Thursday, May 30, 2013

సంగీతపు కాలం - Mercy Margaret

ప్రకృతి
సంగీత కచేరి మొదలు పెట్టే కాలం ఇది
చల్లటి స్పర్శను సాధన చేసి
చిక్కటి మట్టివాసన నింపుకుని
చి ట ప ట మ ని
ట ప ట ప మ ని వర్షపు సంగీతాన్ని సిద్ధం చేసుకొని
మళ్ళీ ఈ యేడు కొత్త ఋతురాగాన్ని ఆలపించవచ్చింది

సూర్యుడ్నెంత ఎంత మరగబెట్టిందో
అంత చల్లబరిచే దాక
సంగీతాన్ని చినుకులుగా
ఒలికిస్తూ
జ్ఞాపకాల కొత్త పాట నేర్ప సిద్ధపడుతుంది

వాన వాన వల్లప్పని పిల్ల జల్ల మురిసిపోతూ
చిన్న నాటి పాటలన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ
తడారని జ్ఞాపకాల గాయాల్ని
తన సహచర్యంతో నయం చేయ వచ్చింది

మనసు మనసుని తడుపుతూ
మాట మాటని కుడుతూ
మండి ఎండిన గుండెలపై చినుకు భాషలాడుతూ
సంతోషాన్ని దోసిలి నిండా నింపే వాన కాలం వచ్చింది


30.05.2013

వాడ్రేవు చినవీరభద్రుడు


నా చిన్నప్పుడు మా ఊళ్ళో వైశాఖమాసపు రోజులు చాలా చిత్రంగా ఉండేవి. మధ్యాహ్నందాకా ఎండ మండిపోయేది. ఉన్నట్టుండి కృష్ణమేఘాలు ఆకాశమంతా ఆవరించి వేసవివాన లోకాన్ని తడిపిపొయ్యేది. ఊరూ, అడివీ, కొండలూ మెత్తబడిపోయేవి. సాయంకాలానికి పడమటి ఆకాశం మీద ప్రకాశవంతమైన రంగుపరుచుకునేది. రాత్రికాగానే శుభ్రమైన వెన్నెల పరిమళంలాగా వ్యాపించేది. ఆ సుమనోహరమైన రంగుల్ని పట్టుకోవడానికి నా జీవితమంతా ప్రయత్నిస్తున్నానుగాని ఆ విద్య చాతకావడం లేదు. కాని ప్రాచీన చీనాకవులకి ఆ కౌశల్యం తెలుసనిపిస్తుంది. అందుకని ప్రతి వేసవిలోనూ వాళ్ళను మళ్ళా మళ్ళా చదవకుండా ఉండలేను.

నిన్నసాయకాలం నగరాన్ని తడిపేసినవాన నాకు ప్రాచీన చీనాకవిశ్రేష్టుడు దు-ఫు (712-770) రాసిన కవితని గుర్తుతెచ్చింది. 'చక్కటి వానకు తెలుసు ఎప్పుడు కురవాలో 'అంటాడాయన.

చూడండి ఈ కవిత:


ఒక వసంతకాలపు రాత్రి వానని స్వాగతిస్తూ

చక్కటివానకి తెలుసు ఎప్పుడు కురవాలో
వసంతం నిండుగా వికసించినప్పుడు వస్తుందది

గాల్లోంచి పొంచివస్తుంది, రాత్రిలో ఒదిగివస్తుంది
చప్పుడుచెయ్యకుండా ప్రతిఒక్కటీ మెత్తబరుస్తుంది

నల్లని అడవి, నల్లని దారులు, నల్లమబ్బులు
నదిమీద పడవలో మినుకుమనే ఒంటరిదివ్వె

తెల్లవారుతూనే చుట్టూ ఎర్రటి ఎరుపు,చిత్తడి
పూలగుట్టల్లో మునిగిపోయిన రాజధాని.



30.5.2013