Wednesday, July 31, 2013

చినుకుభాష - యాకూబ్



ఇంకొంత సమయం పడుతుందేమో
ఈ ముసురు ఆగిపోవడానికి

మరీ చిని చిన్ని చినుకులు

వాటికో వ్యాకరణ సూత్రమేదో ఉన్నట్టు
వొకటివెంట ఒకటి కుదురుగా

నిన్నటి సాయంత్రం నుండి ఇవాల్టి ఉదయం లోపల
ఎన్ని పరిణామాలు జరిగిపోలేదూ
అవేమీ పట్టనట్లు ప్రవర్తిస్తుందీ ముసురు

ఎవర్నీ వో మాటా అనదు
అసలు నోరే విప్పదు
దానిది చినుకుభాష

వొక గొడుగునో, పైకప్పునో , లేకపోతే వొక రెయిన్ కోటునో
మనమీద కప్పుకుంటాం అడ్డంగా

ఈ ముసురు చేసే సంభాషణలో
ఒక్క ముక్కా అర్థం కాదు.

---------------------------------------------31.7.2013 

Monday, July 22, 2013

వానకలిసిన సముద్రం. - రేణుక అయోల



వెలియనివాన ఎండని కమ్మేసి చలిచలిగా నగరంలోకి
అడుగుపెట్టడం బాగుంది
జల్లులుగా నేలని అల్లుకుని
ఆగని, వాన చినుకులంటే అంటే ఇంకా ఇస్టం.

ముసురు మబ్బులు కాఫీ కప్పుని చేతులోవుంచేసి ఆలోచనలకి ఆవిరినందిస్తాయి
చినుకులు నదుల వరదలు తలవంచుకుని "కాదల్"కడలిలో కలిసిపోతే
తూఫాన్ ఇసుకగుడులని మింగేస్తుంది
గవ్వలేరుకునే మనుషుల బాల్యం
జాడలేని "ఇష్క"కి కహానిలా అయిపోతుంది

”సాగర్కి లహెరే” సవరించలేని ఉంగరాల ముంగురులు అణిగిపోయాయి
నీళ్ళని చిమ్మేసి రహదారులని ఉప్పుటేరులని చేస్తుందని భయం
కనీళ్ళతో పోటిపడే కాటు ఉప్పుని రుచి చూపిస్తుందని వెఱపు

సముద్రతీరంలో ఇసుకమేటలలో కూరుకుపోతూ ”ఆజా తు పాస్..పాస్ గుజారిశ్..పాటపాడితే
”గుంజుకున్నా నిన్నే యదలోకి"బదులిచ్చే అంత్యాక్షారీలు
ఇసుక మడులలో లంగరేసుకున్న పడవలు
 ఫోటోలకి ఫొజులిచ్చే ఇళ్లని
నిమిషంలో మింగేసి తీరాన్ని ముక్కలుచేసి వెనక్కి వెళ్ళిపోదుకదా..

ఈవాన వెలియకపోతే
సంద్రంలో చంద్రుడు మునిగిపోయి
వెన్నెల చిన్నచిన్న వెండిరేకుల్లా అలల మీద తేలవుకదా
నేలని అల్లుకునే వాన చినుకులు ఇస్టం
వానవెలిసేదాక ఆలోచనలన్నీ అక్కడే జాలరి వలలో చేపలు.

.................................................................23-7-2013 

Monday, July 15, 2013

వాన పాట



వచ్చెను వచ్చెను వర్షము వచ్చెను
హర్షము తెచ్చెను కాదా
కర్శకులంతా సాగిలి మొక్కగ
వరుణ దేవునికి బాగా
వాన దేవుడా వాన దేవుడా
వానల్లు కురవాలి దేవుడా //వచ్చెను//

అకాశంలో మబ్బులు నిండెను
ఆషాఢం ఇది కాదా
తళతళ లాడుచు మెరుపులు మెరిసెను
ఉరుములు ఫెళ ఫెళ లాడా
నింగీ నేలా కలిసి పోయెనూ.......
నింగీనేలా కలిసి పోయెను
చినుకులు వంతెన కాగా
వాగులు వంకలు పొంగెను పొరలేను
వరదలు వెల్లువ కాగా //వచ్చెను//

నవ నవ లాడెను చెట్లూ చేమలు
నయనానందము కాగా
జవసత్వాలను పుంజుకొన్నవీ
జగతికి జీవము రాగా
హాలిక హృదయం పొంగిపోయెనూ......
హాలిక హృదయం పొంగిపోయెను
వర్షము వరమై రాగా
హలధరుడై ఫలసాయము దీయగ
పొలమునుజేరేను వేగ //వచ్చెను//

పాడుకోవాలనుకునేవాళ్లు హమ్ ఆప్కే హై కౌన్ సినిమాలో ' మాయిని మాయిని 'స్టయిల్ లో పాడుకోవచ్చు.


Rammohan Rao Thummuri

వాన - ప్రసూన



అదే వాన చిత్రం
కానీ
అక్కడ ...
ఏ ఉద్వేగాన్నీ అనుభవించలేని
కాంక్రీట్ గోడల మధ్య ఉంటూ
కుచించుకుపోయిన మనసుని
దూరంగా వానలో తడుస్తున్న
చిన్న గుట్ట ఒక్కటే 
పచ్చని చేత్తో నిమురుతుంది.

ఇక్కడ ...
చెట్లతోనే సహజీవనం చేస్తూ
ప్రతి గోడా
నాలుగు చినుకులకే పులకించి
పచ్చటి పాటలు రాస్తుంది.

వాన వెలిసినా
ప్రతి చెట్టూ
ఆ ఙ్ఙాపకాలు పంచుకోడానికి
పోటీ పడుతుంది.

ఈ గాలి సోకుతూనే
గోదారంత విస్తరించిన మనసు
చెట్టు చెట్టునీ పలకరిస్తూ
నిండుగా ప్రవహిస్తుంది.

courtesy : ప్రసూన

వానా-- వానా-- వానా


పలచగా చినుకులు
తడిపొడిగా పడుతూ
పైగుడ్డ కూడా
తడిసేలా లేదు
-----------------------
దబాటు వాన
కర్షకుల కళ్ళల్లో
కొత్త పైర్ల కళ కళ
-----------------------
జడివాన
వరి పొలంలోకి
పారేనానీరు--?
సదసత్ సంశయం
-----------------------
ఉదయాన్నే
అదేపనిగా పడుతున్న వాన
చీకటి పడి ఒచ్చిన చుట్టంలా
ఎక్కడికీ పోదు.
-----------------------
తెల్లారేదాకా
ఇల్లంతా జల కళవుతుందేమోనని
అడుగడుగునా ప్రళయ భయం
గుండెంతా తహతహ.

-----------------------
ఎడతెరిపిలేకుండా
జబురుతున్న వర్షం
ఆకాశానికి
కళ్లనతికించి రైతాంగం
-----------------------
అరేబియా సంద్రంలో
అల్ప పీడన ద్రోణి
కకావికలౌతూ
కర్షక ప్రపంచం
-----------------------
----Purushothamaro Ravela

Thursday, July 4, 2013

శ్రీకాంత్||నాన్న|| --'కంట్లో ఒక వర్షం చినుకు బావుండు - వర్షిస్తున్నప్పుడు-'


వర్షం కవిత్వం- రెండు కనులనూ మేఘాల్లా విస్తరింపజేసి
నిర్మలమైన కనులపాపలతో వర్షం కోసం ఎదురుచూడటం కవిత్వం-
ఆ రెండు కళ్ళూ నల్ల మట్టితో నిండి ఉన్న ఆకాశాలు- లేదా
జలధార కోసం అవిశ్రాంతంగా ఎదురుచూసే రైతులు- లేదా
ఆ రెండు కళ్ళూ గతించిన అతని తండ్రి బాహువులు-లేదా
నాన్న రెండు కళ్ళూ, నాన్న ఊహ తెలీనప్పుడు కోల్పోయిన
పాలతో తొణికిసలాడే తల్లి వక్షోజాలు- వేసవి కాలం నిర్విరామంగా పరుచుకుపోయి
కోసుకుపోయే ఒక అంతు లేని తెరలా విస్తరించుకున్నప్పుడు

నాన్నకో చిన్న కోరిక: "ఈ కంట్లో ఒక వర్షం చినుకు రాలితే బావుండు- వర్షిస్తున్నప్పుడు"

ఇదొక జీవంతో తొణికిసలాడే కారణం అతను కవి కావడానికి-
వేచి చూడటం, అబ్బురం నిండిన చిన్న పిల్లాడి కనులతో ప్రపంచాన్ని చూడటం:
అదీ కవిత్వం- వర్షం కవిత్వం. వర్షం కోసం ఎదురు చూడటం కవిత్వం

వేసవి కాలం అంచున నిలబడి, రాబోయే వర్షాకాలం
బహుమతిగా పంపించిన ఒక మేఘమయపు వర్షపు దినాన
వానపాము వలే భూమిలోకి తొలుచుకుపోయి లేదా
శరీరమే భూమిగా మారిపోయి నాన్ననూ, నాన్న కోరికలనూ
ఆ రెండు కళ్ళల్లో వర్షపు అలల్లా కొట్టుకులాడే కలలను గుర్తుకు తెచ్చుకోవడం కవిత్వం-
చినుకులొక్కటే కవిత్వం కాదు- అది అంతకు మించినది
నాన్నలా, తన స్పర్శలా లేదా నయనాలు విచ్చుకోనప్పుడు
తను కోల్పోయిన తన తల్లి స్పర్శలా-

మరి అతని తల్లి ఎలా ఉంటుంది-?

సుదూరంగా, అసంఖ్యాక వర్షపు తెరల సంవత్సరాల క్రితం కురిసిన ఒకానొక వర్షం-
ఊరిలో, వసారా ముందు, చూరు అంచులను తాకుతూ, పేడతో అలికిన
మట్టి మీద రాలిన వర్షం చినుకు రాలిన బరువుకి
ఎండిన మట్టి, కొద్దిగా చలించి అదృస్యంగా చలించి
గాలిలోకి చేతులు చాచితే అతని తల్లిలాగా ఉంటుంది.
అందుకే నాన్నకో చిన్న కోరిక-

"కంటిలో ఒక వర్షం చినుకు రాలితే ఎంత బావుంటుంది- వర్షిస్తున్నప్పుడు-"

నీడలు కమ్మిన మధ్యాహ్నం, చెట్ల గుబురు కొమ్మలలోంచి
ఊయలలూగుతూ జారిపడిన పక్షి ఈక వలే
వర్షం వాలిన జ్ఞాపకం తప్ప, మరే జాడా లేక
అమ్మనే పదం తప్ప మరే గుర్తులూ తోడు రాక
వర్షం వెలిసాక, లోకాన్ని చిన్ని మంటలా అదుముకునే ఎండలా
అతని వర్షం వెలిసిన కన్నుల్లో అమ్మ కొట్టుకులాడుతుంది-

వర్షంలోని ప్రతి చినుకూ అమ్మ లేక తడబడిన బాల్యంతోనూ
ప్రతి నిమిషం, మట్టిలోంచీ, తండ్రి గరకు హస్తాలలోంచీ
మొలకెత్తుతూ గడిపిన పసితనంలో మిళితమయ్యి
ఎదురుచూసే అతని కన్నులలో ప్రతిబింబిస్తుంది-

కాళ్ళ ముందు కురిసే ప్రతి చినుకులోనూ తల్లి రూపం
కళ్ళలో వాలకుండా మట్టిపై చిట్లిన ప్రతి చినుకులోనూ
తల్లి హస్తాలు. ఆ చినుకు లోకాలలో, తను తన తల్లితో గడిపిన ఐదారేళ్ళ పసితనం-
ఒకప్పుడు ఆమె తనకు చనుబాలు తాపిందన్న ఊహ
తనని రెండు కాళ్ళ మధ్య పరుండబెట్టుకుని స్నానం
చేయించిందన్న ఊహ.వర్షం ఊహ-చాలా కాలం క్రితం

తాటాకులు కప్పిన ఇంటి ముందు, అతను జన్మించక
ముందు, అతని తల్లికీ ఒక చిన్న కోరిక -"కంటిలో ఒక
వర్షం చినుకు రాలితే బావుండు-వర్షిస్తున్నప్పుడు"అని-

ఆమె స్వప్నించి ఉండవచ్చు. ఘాడంగా, వర్షానికి ముందు
భూమిపై బలంగా వీచిన గాలి తెరలా, రాత్రి పూట చిక్కగా అలుముకున్న చీకటిని
లోపల గదిలోంచి సన్నగా తాకుతున్న దీపపు కాంతిలో
గుమ్మం పక్కగా కూర్చుని, మబ్బులతో నిండుతనం సంతరించుకుంటున్న నింగిలా
బరువైన తన గర్భాన్ని ఆమె ప్రేమగా కలల అరచేతులతో కప్పి స్వప్నించి ఉండవచ్చు

"నా బిడ్డ కంటిలో ఒక వర్షం చినుకు రాలితే బావుండు- వర్షిస్తున్నప్పుడు-"

వర్షం చినుకొకటి మట్టిని తాకేంత సామీప్యంలో, ఆమెను మరణం చుట్టుకుంటున్నప్పుడు
ఆమె శరీరంలోని ప్రతి నెత్తురు చినుకూ మహోద్రేకంతో చలించిపోయి
ఒకే ఒక్క కోరికతో తపించిపోయి ఉండవచ్చు-'నేను చనిపోక ముందు
ఒక వర్షం చినుకు నా బిడ్డ కంటిలో రాలితే బావుండు-వర్షిస్తున్నప్పుడు'-

చాలా రోజుల తరువాత, మరో తల్లైన, అతని తండ్రి మరణించే ముందు
అతని తండ్రి కనులలో అద్రుస్యంగా కదులాడిన కల. వర్షం కల. నాన్నా
నువ్వది గమనించావా?నీ తండ్రి కనులలో కనిపించిన వర్షం.స్వచ్చమైన
ఆనంద సౌందర్యం వల్ల కదులాడిన వర్షం? నాన్నా అతను నీ కనులలో
ఒక స్వప్నాన్ని చూసాడు. వర్షిస్తున్నప్పుడు కంటిలో ఒక చినుకు మృదువుగా జారి పడటాన్ని

నీ కనులలో చూసాడు. ఆ చినుకులో నీ తల్లిని వీక్షించాడు
ఆమె కాంక్షించిన ఒక ఆప్తమైన కల, తనలాంటి సౌందర్యవంతమైన కల, నీ కనులలో
నిజమవ్వడాన్ని ఆనందపు వీడుకోలుతో గమనించాడు-
ఇక చాలా రోజుల తరువాత, నువ్వు మళ్ళా ఆనాటి ఆరేళ్ళ కళ్ళతో స్వప్నిస్తావు కదా

'కంటిలో ఒక వర్షం చినుకు రాలితే బావుండు- వర్షిస్తున్నపుడు-' అని
మరి నువ్వది గమనించావా? అరచేతుల్లా నువ్వు చాచిన నీ
కనులలోకి ఒక చినుకు రాలింది. మృదువుగా తాకింది. నీ
నయనాల సజలతనంలోకి కరిగిపోయింది. అది కవిత్వం-
నీ చుట్టూ ఉన్న మట్టిపై, నీ చుట్టూ ఉన్న మనుషులపై
లేతగా కురుస్తూ ఉంది. నువ్వు, నీ తల్లి ఒడిలో వొదిగిన
చిరునవ్వు వలే తాకుతూనే ఉంది. నువ్వు తపించిన నీ

బాల్యమంతా, తల్లి ప్రేమంతా, ప్రియురాలి చేతివేళ్ళ స్పర్సలా
తెల్లటి మబ్బులు తేలుతున్న ఆకాశంలాంటి, విప్పారిన నీ
కనులలోకి మట్టి పరిమళంతో ఒక చినుకై రాలి పడింది
అది కవిత్వం:నీ శరీరంపై వాలి,లోపలి నెత్తురు కొమ్మల్లో
అసంఖ్యాకంగా, గూళ్ళు కట్టుకుంటూనే ఉంది. నీ శరీరం

అణువణువులోంచి ఒక కలల పక్షి తొంగి చూస్తుంది- మరి నీకు తెలుసా
నీ శరీరం ఏమిటో? ఎగిరే పక్షుల కిలకిలరావాల సందడి-
విస్తరించిన మట్టి వృక్షాల వాన కొమ్మల అలజడి. మరి
నీ కనులూ, పెదాలూ, పాదాలూ, పదాలూ? అవి ఒక
నెత్తురు జలపాతం,ఒక వెన్నెల సాగరం.చూడు ఇటు

ఘాడంగా, ఆ చిక్కటి అరణ్యాలపై వర్షం కురుస్తున్నప్పుడు
నా చినుకుల వజ్రాలలోంచి,నేనూ ఒక స్వప్న బిందువుని
దొంగలించాను. రహస్యంగా, నీకు తెలియకుండా,నేను ఒక
నెత్తురు చుక్కనూ, దాని పరిమళాన్నీ దొంగాలించాను.ఇక
ఇప్పుడు, నా రక్తం అలల నిండా మత్తుగా, బరువుగా కదిలే
ఒక కోరిక -'నా కంటిలో ఒక వర్షం చినుకు పడితే బావుండు- వర్షిస్తున్నప్పుడు-'
---------------------
1997.||04.07.2013||

Tuesday, July 2, 2013

మిథిల్ /వర్ష గీతం/2008


---------------------------
మెరుపులు మెరిసెను!
ఉరుములు ఉరిమెను!
చినుకులు కురిసెను !!
మనసులు మురిసెను!!

వర్షాకాలం వచ్చెను వచ్చెను !!!
హర్షాతిరేకం తెచ్చెను తెచ్చెను!!!!

నీటి లో పిల్లలు
పడవలు తిప్పిరి!!

నెత్తి పై పెద్దలు
గొడుగులు విప్పిరి !!

వీధిన అందరు
బిరబిరా ఉరికిరి!!

ఇంటిలో పకోడీలు
వేడి గ మెక్కిరి!!!

బయట తడుసుడు
వద్దని తల్లులు
తలంటి స్నానం
వణుకుత చేసిరి!!

జలుబు రొంప తో
ముక్కులు నిండగా
చీర కొంగు తో
చీమిడి తీసిరి!!!!!