Saturday, August 30, 2014

అమ్మమ్మ -వాన - Bvv Prasad



1
'అమ్మమ్మా వాన పడుతోంది '
ఆరుబయట పక్కలో పడుకొన్న మనవడు ఉలిక్కిపడినప్పుడు
'పడనీరా చల్లగా ఉంటుంది ' అన్న అమ్మమ్మ మాట
అతని జీవితానికొక చూపునిచ్చింది
వానకి భయపడి ఇంటిలోకి పరుగెట్టనక్కరలేదు
వానలో తడవటం బావుంటుంది
దయలాంటి వానకి , ప్రకృతిలోని అందమంతా కరిగి నీరై పడేవానకి
నిన్ను అర్పించుకోవటం బావుంటుంది
మట్టివాసనల్ని మేల్కొలుపుతూ
నిన్ను ఆర్ద్రతలోకి చల్లగా నడిపించే వానపట్ల,
వానలాంటి జీవితంపట్ల ఉండాల్సింది భయం కాదు, ప్రేమ

2
అమ్మమ్మ దేనినీ ధిక్కరించలేదు
ఎవరినీ ఎప్పుడూ గద్దించగా చూడలేదు
భూమిలాంటి అమ్మమ్మ
అంత ఉమ్మడికుటుంబానికీ కేంద్రమై కూడా
తనని నేపధ్యంలోనే నిలుపుకొంది
తాతయ్య తడినిండిన మేఘగర్జనలకి
ఆమె బెదురుతున్నట్లుండేది కాని
ఆమె బెదిరేమనిషి కాదని తాతయ్యకి తెలుసు
భయం చివర సమస్తజీవితాన్నీ దీవిస్తున్నట్టు విచ్చుకొనే
ఆమె చిరునవ్వు చూసిన మనవడికీ తెలుసు

3
జలధరంలాంటి ఉమ్మడికుటుంబం క్రమంగా
తెల్లని మబ్బుతునకలుగా చెదిరిపోయి
జీవితసహచరుడూ సెలవుతీసుకొన్న చివరిరోజులలో
కూతురు అమ్మయి రుణంతీర్చుకొంటున్నపుడు
అగాధమైన నిశ్శబ్దం నిండిన చూపులతో
చివరిరోజులోకి భయంలేక ప్రయాణిస్తున్నట్లుండే
ఆమె జీవస్పందనలని గమనించినప్పుడల్లా
యవ్వనపుతొందరల మధ్యనున్న మనవడు
అమ్మమ్మ ఏం ఆలోచిస్తుందీ అని విస్మయపడుతూనే ఉండేవాడు

4
ఒక ఉక్కపోసే సాయంత్రంలోకి చేరుకొన్న మబ్బులు
చినుకుల్లా కరిగి భూమిని నిశ్శబ్దంగా తాకుతుంటే
గదిలోంచి బయటకు వెళుతున్న మనవడితో ఆమె
'ఏమిటది, వానపడుతోందా ' అన్నపుడు
అతను ఊహించలేదు అవి తనతో ఆమె చివరిమాటలని
ఉక్కపోతతో నిండనున్న జీవితంలోంచి చివరి వానాకాలం వెళ్ళిపోనుందని

5
జీవితం అమ్మమ్మలా దయగలదీ, ఓర్పునిండినదీ
కాదని తెలుసుకొంటున్నా
దానిని ప్రేమనిండిన చిరునవ్వుతో ముగించటమెలాగో
ఆమెనీడలో పెరిగిన కూతురుకొడుకు నేర్చుకొంటున్నట్టే ఉన్నాడు
కనుకనే, దుఃఖపూరిత జీవితానుభవాన్ని
దయగల పదాల్లోకి అనువదిస్తున్నాడు

Friday, August 29, 2014

జడివాన


_______అరుణ నారదభట్ల

ఇంకా నిర్ధారణ కాలేదు
ఆకాశం ముక్కలైందని!

కొన్ని నీటి తెప్పలు
పరుగెత్తి కూలినపుడు
పైపై మట్టి చల్లబడుతుంది
కానీ లోపలి నిశ్శబ్దంలో
దాగున్న లావా...
భూమి పొరల్లో
కదలాడుతూనే ఉంటుంది!

ఈ వానకు చిగురు కూడా
తునాతునకలవుతుంది!
సున్నితంగా తడవాలనుకుంటాం..
సందుల్లో మురికి కాలువ
ముంచేస్తే ఎవరికి ఇష్టమవుతుంది

ప్రశాంతత నిండుకున్న గడ్డి మైదానంలో
రెండు చేతులూ చాచి
చినుకులను వొంటికద్దుకోవడం
ఎంతటి ప్రియమైన స్పర్శ!

ఏదైనా... తడిసిపోవడమనుకొని
మురికినీటినీ తడేనని భ్రమిసిపోలేము
కానీ కొన్ని సార్లు తడుస్తూనే ఉంటాం!

వర్షం స్వచ్చమైన నీరులా కురిస్తే
మనసు వెన్నెలవుతుంది
కఠినజలం కురిస్తే
సారం కోల్పోయి నిర్జీవమవుతుంది!

మేఘం ఎప్పుడూ ఉరుముతూ
కటిక చీకటై సందడి చేస్తూనే ఉంటుంది!
కురవని మబ్బుకు మెరుపెక్కువ
కలవని దిక్కులకు కలతెక్కువ!

సమశీతోష్ణ మైదానంలా
నాలుగు డిగ్రేల కోసారి
రేఖాంశపు సరిహద్దును స్పృశిస్తూ
సమయానికి తగు వాతావరణంలో అక్షాంశమైపోవడం

ఈవానకు నేలంతా తడితో చిత్తడై
గుబురుటాకులను కప్పుకున్న తీగలా
పచ్చదనాలను వొంటపట్టించుకుంటుంది!
ఇంకా ఎన్ని రకాల తడిసేదుందో భూమి
చేజారిపోయేలోపు!

28-8-2014

Wednesday, August 27, 2014

కడిగిన గోడ - కెక్యూబ్ వర్మ


రావి ఆకు చివర వేలాడే నీటి బొట్టు
స్ఫటికత కనులకింత ఓదార్పునిస్తూ

మొనదేలిన గడ్డి పోచ
పచ్చగా వాన నీటిలో నిటారుగా ప్రతిఫలిస్తూ

తార్రోడ్డుపై నల్లగా నిగనిగలాడే
తడితనం రిక్షా టైరుపై మరకలా మెరుస్తూ

తడిచిన కాకి గూడు చేరలేక
దాగిన బ్రహ్మజెముడు పొద బయటపడేస్తూ

తడిచిన దేహంతో పరుగున
దూడ తల్లి పొదుగులో దాగిపోతూ

వాన కడిగిన ఈ జైలు గోడపై ఆకాశాన్నింత దోసిట్లో
పోసి పావురం బొమ్మ వేస్తూ....

27/08/2014 (11:38PM)