ఒక చిన్ని వాన నీటి మడుగు
పక్కన కాస్త ఎడంగా నిలబడిన నా చేతిలో
గిజగిజలాడుతోంది చిట్టి చెయ్యి.
"ఇదిగో ఇక్కడే ఐదు నిమిషాలు నిలబడదాం. ఒక్క పాపైనా, బాబైనా ఇందులోకి దిగితే,
అదిగో ఆ పక్కన దీనికంటే పెద్ద మడుగు. అందులో ఎంతసేపైనా ఆడుకోనిస్తాను."
వాళ్ళ అమ్మల చేతులు పట్టుకుని
డే కేర్ బయటకు వస్తున్న పిల్లల్ని
ఒక్కక్కరిని ఆశగా చూస్తూ నిలబడిన
నాలుగేళ్ళ నా పాపను ఒదిలి
నాలోకి వెళ్ళిపోయాను.
***
నాకే, ఎందుకిలా
అతను, అతని అమ్మా, నాన్న,
అక్క చెళ్ళెళ్ళు, వాళ్ళ భర్తలు, పిల్లలు
ఇక వీళ్ళే నా ప్రపంచం అనుకున్నా, అందులో
నాదంటూ ఒక గౌరవనీయ స్థానం కోసం
నాదంటూ ఒక్క నిమిషం కోసం
నాదంటూ ఒక ప్రేమ కోసం
ఈ వెంపర్లాట.
ఊపిరి సలపకుండా
కరిగిపోతున్న నా ఉనికిని చూసుకుని
కలవరపాటును కాస్త పంచుకున్నందుకు
విసుగుపడి, తోడుంటానన్నవాడు
బాధ్యత మరచి
ఇంకో జోడీ వెతుక్కుంటే,
కాసేపు క్షమిస్తూ, కాసేపు శపిస్తూ
నేనే, ఎందుకిలా?
***
అప్పటిదాకా నా చెయ్యి విడిపించుకో చూస్తున్న చిట్టి చెయ్యి
నా చేతిలో బిగుసుకు పోయింది.
"ఇక వెళ్దామా? ఎంతో మందిలానే మనమూ!"
నాకు నేను కటువుగా సమాధానం చెప్పుకుంటూ
నా అసహనాన్ని కొంచెం తనపై చల్లుతూ
ముందుకు ఆడుగేసిన నా చేతిలోంచి చెయ్యి లాక్కుని
మడుగుల వైపు ఒక్క క్షణం ఆసక్తిగా చూసినా
వాళ్ళ అమ్మల వెంట మారు మాటాడక వెళ్ళిపోతున్న పిల్లలను
ఆశ్చర్యంగా, భయంగా నీళ్ళు నిండిన కళ్ళతో గమనిస్తూ
"అమ్మా, ఎందుకలా వాళ్ళు చూసినా చూడనట్లు,
రెక్కలున్నా ముడుచుకుని ..."
పూడుకుపోయిన తన గొంతులోంచి
వచ్చింది నా వంద సంకోచాలకు ఒక్క సమాధానం.
తన చేతికి నా చేయి అందించాను,
"పద తల్లీ, మనం ఆడుకుందాం
రెండు మడుగుల్లోనూ."
పాప కేరింతలకు తోడుగా
అప్పటిదాకా గుబురాకుల్లో దాక్కున్న
వాన చినుకులు జలజలా రాలాయి.
****
("fly, fly, my butterfly" అంటూ నాకు ధైర్యం చెప్పే నా ఆరేళ్ళ చిట్టితల్లి ఆనన్యకు.)