వర్షం పడుతుంది
ఆయనా.. నాతో మాట్లాడుతున్నాడు.
ఎడతెరిపి లేని వానలా కురుస్తున్న ఆయన మాటల్తో
ఎండిన నేలలా నోరు తెరిచిన హృదయం
దాహం తీర్చుకుంటుంది.
ఆయన మాట్లాడుతున్నాడు వానా పడుతూనే ఉంది
హృదయారణ్యంలోని ప్రతి మూలల్లో మాటలు వర్షిస్తున్నాయి
ప్రతి నేలని చదును చేస్తున్నాయి
ఎండిన ప్రతి మోడు చిగురిస్తు౦ది
రాలిన ఆకుల చోట కొత్త జీవం చిగురిస్తుంది
ప్రతి అణువు చెట్టులా మారి పాటలు పాడుతుంది
వర్షం పడుతుంది, ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు
విరిగిన ఎముకలన్నీ ఆ మాటలు వింటున్నాయి
ఆయన మాట్లాడాడు లేచి బయటికి రమ్మన్నాడు
శవం ఇప్పుడు శవం కాదు. మళ్ళీ జీవం ఉన్న మనిషి
కరిగిపోయిన ప్రతి కన్ను చూసేలా ఆయన మాట్లాడాడు
చనిపోయిన ప్రతీది నిత్యత్వం పొందుతుంది
ఆయన మాట్లాడుతున్నాడు
వర్షంలా
చినుకుల్లా కురిసే మాటలు నదులయ్యాయి
ఆ నది
జీవనది
ప్రవహిస్తూ నన్ను ముంచింది
అదో ... చూడు ఇప్పుడు
నీవైపే..
నీవైపే వస్తుంది.
____________ (23/10/2013)_
wonderful
ReplyDelete