మబ్బెందుకొచ్చినాదో-మొగలుకూ
సిగ్గెందుకొచ్చినాదో
పువ్వెందుకిచ్చుకుందో-కొమ్మదీ
మనసెంత మెత్తగుందో
జానపదమూవోలె జారేటి జడివాన
కునుకురాగంలోన సినుకుసినుకూ నేసి
సిత్రంగ సిత్రంగ ముడులేసి గడులేసి
ముద్దులా రంగద్ది ముఖమునే దాచేటి
తెరలెట్ల అల్లినాదో-ఓ పిల్ల
తెమ్మెరట్లాడినాదో
మసకెట్ల కమ్ముకుందో-సూదంటు
సీకటెటులాగినాదో
|మబ్బెందుకొచ్చినాదో-మొగలుకూ
సిగ్గెందుకొచ్చినాదో|
తంగేడుమోదుగులపసుపుకుంకుంబెట్టి
వరదగూడూగట్టి సిగ్గంత ఎగ్గొట్టి
వాన అచ్చింతల్ని దులుపుకుంటూతుళ్ళె
కానుగానీడల్లో కన్నుకన్నూకలిపి
మనువెట్లజేసినాదో -ఓ పిల్ల
మనసెట్లదోచినాదో
వయసెట్లదెలిపినాదో-వంతేసి
వలపెట్లపంచినాదో
|మబ్బెందుకొచ్చినాదో-మొగలుకూ
సిగ్గెందుకొచ్చినాదో |
ఇప్పసెట్లాసిగురుమేసితిన్నామేక
దూరంగదూరంగమందకేదూరంగ
మచ్చలదుప్పోలె ఉర్కిఉర్కీపోయి
గుట్టమీదికిఎక్కి తప్పిపోయె ఆట
మనకెట్ల నేర్పినాదో-ఓ పిల్ల
మత్తెట్లదించినాదో
ఎండెంత ఎచ్చగుందో-ఎండేటి
ఘడియెంత మంచిగుందో
|మబ్బెందుకొచ్చినాదో-మొగలుకూ
సిగ్గెందుకొచ్చినాదో |
సూరుకొసలామీద సుడిగాలిగారేగి
వాసాలగాలించి నిట్టాడనదిరించి
తాటికమ్మలన్నీ తానమాడేవాన
గుడిసెలో కూసున్న గుండెలో నిదరోగ
ఇళ్ళెంత ఉరిసినాదో-ఓ పిల్ల
ఒళ్ళెంత వణికినాదో
సలిఎంతబుట్టినాదో-సంజేటి
పొత్తిళ్ళుజీరినాదో
|మబ్బెందుకొచ్చినాదో-మొగలుకూ
సిగ్గెందుకొచ్చినాదో|
నల్లినారిస్తర్లు నలుచెరగులానిండి
దుంపిడీయేర్లకు దూపమొత్తందీరి
సంపెంగపారంగ జంపన్నలేవంగ
నర్రెంగసెట్లల్ల నరుడు నడయాడంగ
అడవెంతపొంగినాదో-ఓ పిల్ల
అందమెట్లొదిగినాదో
అలుగెట్ల దుంకినాదో-సిన్నారి
పరకేమి పాడినాదో
|మబ్బెందుకొచ్చినాదో-మొగలుకూ
సిగ్గెందుకొచ్చినాదో|
నలనల్లరేగళ్ళ నల్లానివాగయ్యి
ఎర్రెర్రసెలకల్ల ఎర్రాని ఏరయ్యి
పొలమూగట్టూమొదలు తుమ్మతోపూకాడ
సినుకుపూలసూసి తుమ్మెదలుకదలంగ
వరదెంతవచ్చినాదో-ఓ పిల్ల
వగలెన్నిసూపినాదో
సాలెంత నవ్వుకుందో-జోకొట్టి
మొలకనెట్లుత్తుకుందో
|మబ్బెందుకొచ్చినాదో-మొగలుకూ
సిగ్గెందుకొచ్చినాదో|
రావీ ఆకుమీది రతనమంటీ సినుకు
తీరొక్కతీగల్ల నీలాలతుంపరై
పత్తిసేలపైన పగడాలవానయ్యి
వరినారు వంపులో సొంపులో కెంపులై
పాలసెట్టిక్కినాదో-ఓ పిల్ల
పాలబొట్టయ్యినాదో
పల్లెపై మెరిసినాదో-మాగాణి
మట్టిలో మురిసినాదో
|మబ్బెందుకొచ్చినాదో-మొగలుకూ
సిగ్గెందుకొచ్చినాదో|
No comments:
Post a Comment