Thursday, November 6, 2014

ఓ వర్షం వెలసిన సాయంత్రం - మమతఒక చిన్ని వాన నీటి మడుగు
పక్కన కాస్త ఎడంగా నిలబడిన నా చేతిలో
గిజగిజలాడుతోంది చిట్టి చెయ్యి.

"ఇదిగో ఇక్కడే ఐదు నిమిషాలు నిలబడదాం. ఒక్క పాపైనా, బాబైనా ఇందులోకి దిగితే,
అదిగో ఆ పక్కన దీనికంటే పెద్ద మడుగు. అందులో ఎంతసేపైనా ఆడుకోనిస్తాను."

వాళ్ళ అమ్మల చేతులు పట్టుకుని
డే కేర్ బయటకు వస్తున్న పిల్లల్ని
ఒక్కక్కరిని ఆశగా చూస్తూ నిలబడిన
నాలుగేళ్ళ నా పాపను ఒదిలి
నాలోకి వెళ్ళిపోయాను.

***

నాకే, ఎందుకిలా
అతను, అతని అమ్మా, నాన్న,
అక్క చెళ్ళెళ్ళు, వాళ్ళ భర్తలు, పిల్లలు
ఇక వీళ్ళే నా ప్రపంచం అనుకున్నా, అందులో
నాదంటూ ఒక గౌరవనీయ స్థానం కోసం
నాదంటూ ఒక్క నిమిషం కోసం
నాదంటూ ఒక ప్రేమ కోసం
ఈ వెంపర్లాట.

ఊపిరి సలపకుండా
కరిగిపోతున్న నా ఉనికిని చూసుకుని
కలవరపాటును కాస్త పంచుకున్నందుకు
విసుగుపడి, తోడుంటానన్నవాడు
బాధ్యత మరచి
ఇంకో జోడీ వెతుక్కుంటే,
కాసేపు క్షమిస్తూ, కాసేపు శపిస్తూ
నేనే, ఎందుకిలా?

***

అప్పటిదాకా నా చెయ్యి విడిపించుకో చూస్తున్న చిట్టి చెయ్యి
నా చేతిలో బిగుసుకు పోయింది.

"ఇక వెళ్దామా? ఎంతో మందిలానే మనమూ!"
నాకు నేను కటువుగా సమాధానం చెప్పుకుంటూ
నా అసహనాన్ని కొంచెం తనపై చల్లుతూ
ముందుకు ఆడుగేసిన నా చేతిలోంచి చెయ్యి లాక్కుని
మడుగుల వైపు ఒక్క క్షణం ఆసక్తిగా చూసినా
వాళ్ళ అమ్మల వెంట మారు మాటాడక వెళ్ళిపోతున్న పిల్లలను
ఆశ్చర్యంగా, భయంగా నీళ్ళు నిండిన కళ్ళతో గమనిస్తూ
"అమ్మా, ఎందుకలా వాళ్ళు చూసినా చూడనట్లు,
రెక్కలున్నా ముడుచుకుని ..."
పూడుకుపోయిన తన గొంతులోంచి
వచ్చింది నా వంద సంకోచాలకు ఒక్క సమాధానం.

తన చేతికి నా చేయి అందించాను,
"పద తల్లీ, మనం ఆడుకుందాం
రెండు మడుగుల్లోనూ."

పాప కేరింతలకు తోడుగా
అప్పటిదాకా గుబురాకుల్లో దాక్కున్న
వాన చినుకులు జలజలా రాలాయి.

****
("fly, fly, my butterfly" అంటూ నాకు ధైర్యం చెప్పే నా ఆరేళ్ళ చిట్టితల్లి ఆనన్యకు.)

Saturday, October 25, 2014

వర్షం కోసం

వర్షం కోసం చూసి చూసి

ఇప్పుడే తలుపులు , కిటికీలు మూసాను

వర్షం వచ్చిపోయిందని మట్టి వాసన లోని కొచ్చి

చెప్పాక

నాలుగు గోడలే నివాసం అయిన చోట

ఒక అడవి కావాలని ఎలా అనుకోను ??

ఇప్పుడు నాకు బలమైన ఇత్తడి కత్తెర కావాలి

గోడలన్నిటి నవ్వును కత్తరించి

వర్షాన్ని చూసే విత్తనాల్ని

నాటడానికి ...

--------------------- 25/10/204-------

Friday, October 17, 2014

ఒక వాన - తిలక్ బొమ్మరాజు

రోడ్డుమీద నడుస్తున్న నేను
నన్ను పలకరించరించడానికొచ్చిన ఒక ముసురు వాన
తుంపరలన్నీ మట్టిలో తడుస్తూ తొణికిసలాడే మొసళ్ళు
ముఖం మీదో
చేతులపైనో భళ్ళున పడి జారిపోవడం
చొక్కా జేబులో గుప్పెడు మన్నీళ్ళు

ఇంట్లోకొచ్చాక ఒక తడి వాసన తల నిమిరిన నా చేతివేళ్ళకు
చీమలు పాకిన ఆకులు పడవలై అక్కడక్కడే
బాల్కనీ అంతా నిండిన కొత్త నీళ్ళు
తడిసిపోయిన కాగితాలు పుస్తకాల్లో దాక్కుంటూ రంగులను విసిరి ఎక్కడో జల్లుతాయి

నిన్నూ నన్నూ ఒక్కసారి కదుపుతూ
పచ్చని అడవిలో అడక్కుండా కురిసిన శబ్దం
కీచురాళ్ళ సంగీతం వినబడీ వినబడకుండా
మసకగా అడుగులు మన్నురోతలో
రేగడి కళ్ళను తెరుస్తూ మూస్తూ
రెండు చెక్క తలుపులు కిర్రున బతికిన చప్పుడు నాకెందుకో మరోలా పోస్తూ
చెవుల రెక్కలు వింటున్న విహంగాలు నా వాన మాటలు
లోనెక్కడో ఇంకా కురుస్తూ

Wednesday, October 15, 2014

వర్షపు దారి - రేణుక అయోలావాన చినుకుల్ని పట్టుకోవడమంటే బాల్యం నుంచీ అమితమైన ఇష్టం. వాన చినుకులను కవిత్వంలో ఎవరైన వర్షింపచేయడానికి ప్రయత్నించినప్పుడు చదవడానికి  అమితమైన ఆనందానికి లోనౌతాను.
ఈ కవితలో
తడి జ్ఞాపకం, పూలు రాల్తున్న మెత్తటి సుఖం, పడవతో ఆడుకోవడం, 
తడి ఆకాశం మబ్బులని తోసుకుంటూన్నదృశ్యం 
చినుకు తలుపులు తోసుకు వచ్చిన గాలిగుర్తులని 
గాలి గుర్తులు 
ఇవన్నీ ఎక్కడెక్కడికో తీసుకు వెళ్ళాయి. వానతో అనుబందమో, అనుభూతో వున్నవారినందరిని ఎక్కడో ఒకచోటికి లాక్కెళ్ళకుండా వుండదు. 

ఈ వానను, వానచినుకుల తడిని దేనికైనా ప్రతికలుగా అర్థం చేసుకోవచ్చా అని అలోచనలు ముసిరాయి. 
కచ్చితంగా ప్రతీకలుగా చదవొచ్చనే అనిపిస్తుంది. కవితయొక్క పరిథి చాలా విశాలమౌతుంది 
ఏదో తెలియని అనిర్వచనీయమన అనుభూతి వివరించలేకపోతున్నాననిపిస్తుంది. మీరే చదివి ఆనందించండి.

రేణుక అయోలా  గారికి అభినందనలు 
*~*~*

అరచేతిలో రాలిన చినుకులో ఏమి వుండవు
చేతిలో పడగానే స్పర్శ మొదలవుతుంది
ఒక నాటి వాన జల్లు తడి జాపకం
ఏ ఒక్క మాట మరచిపోనంత చలి గాలి

పసుపు గన్నేరు పూలు బుజాలమీద
మెడఒంపులో రాలుతున్న మెత్తటి సుఖం
ఖాళితనంలో చొరబడి చెవి పక్కనే వినిపించిన నవ్వు
ఎగిరిపోయిన గొడుగు దొరికి పోయిన శరీరం

కాస్త ఖాళీ చోటులో కాగితం పడవతో ఆడుకోవడం
దూరంగా వినిపించే చిన్నపిట్ట కూతరెక్కలో
తడి ఆకాశం మబ్బులని తోసుకుంటూన్నదృశ్యం

చినుకు తలుపులు తోసుకు వచ్చిన గాలిగుర్తులని
ఆ వర్షపు హాయిని చెప్తూనే వుంది
అరచేతి తడి ఇంకిపోయి వర్షపు దారి గుర్తు వుండిపోయింది ...

Wednesday, September 10, 2014

వానాకాలంలో

వానాకాలం జీవితానికి ఉత్సవ సమయమైనట్టు
ఎక్కడెక్కడినుండో పుట్టుకొస్తాయి రకరకాల జీవులు

అప్పటివరకూ
ఏ నేలపొరల్లో లేదా గాలితెరల్లో దాగాయో,
ఆకాశంలో తేలే పలు స్వప్నలోకాల సంచరించాయో కాని

ఆకాశం జలదేహం దాల్చి భూమిని హత్తుకొన్నాక 
అప్పుడే విచ్చుకొన్న కళ్ళల్లో ఆకాశాన్ని దాల్చి 
గాలికి రాగాలు అద్దుతూ భూమ్మీద తెరుస్తాయి మరికొన్ని కొత్త కచేరీలు

నిన్నటివరకూ పొడిగా, శుభ్రంగా ఉన్న నేలపైనా, గోడలపైనా
ఒకటే జీవుల సందడి
ఏమరుపాటున నడిస్తే కాలికింద ఏ ప్రాణం పోతుందోనని
తెల్లనిమేఘాల వెంట గాలిపటంలా పరిగెత్తే చూపుల్ని
బలవంతంగా నేలకి లాగుతావు నువ్వు

ఒక చీమలబారో, గొంగళిపురుగో, కప్ప అరుపో
నీ చైతన్యాన్ని తాకిన ప్రతిసారీ
నువ్వు ఒంటరివాడివి కావని
జీవితం నీ చెవిలో గుసగుసలాడినట్లనిపిస్తుంది

Saturday, August 30, 2014

అమ్మమ్మ -వాన - Bvv Prasad1
'అమ్మమ్మా వాన పడుతోంది '
ఆరుబయట పక్కలో పడుకొన్న మనవడు ఉలిక్కిపడినప్పుడు
'పడనీరా చల్లగా ఉంటుంది ' అన్న అమ్మమ్మ మాట
అతని జీవితానికొక చూపునిచ్చింది
వానకి భయపడి ఇంటిలోకి పరుగెట్టనక్కరలేదు
వానలో తడవటం బావుంటుంది
దయలాంటి వానకి , ప్రకృతిలోని అందమంతా కరిగి నీరై పడేవానకి
నిన్ను అర్పించుకోవటం బావుంటుంది
మట్టివాసనల్ని మేల్కొలుపుతూ
నిన్ను ఆర్ద్రతలోకి చల్లగా నడిపించే వానపట్ల,
వానలాంటి జీవితంపట్ల ఉండాల్సింది భయం కాదు, ప్రేమ

2
అమ్మమ్మ దేనినీ ధిక్కరించలేదు
ఎవరినీ ఎప్పుడూ గద్దించగా చూడలేదు
భూమిలాంటి అమ్మమ్మ
అంత ఉమ్మడికుటుంబానికీ కేంద్రమై కూడా
తనని నేపధ్యంలోనే నిలుపుకొంది
తాతయ్య తడినిండిన మేఘగర్జనలకి
ఆమె బెదురుతున్నట్లుండేది కాని
ఆమె బెదిరేమనిషి కాదని తాతయ్యకి తెలుసు
భయం చివర సమస్తజీవితాన్నీ దీవిస్తున్నట్టు విచ్చుకొనే
ఆమె చిరునవ్వు చూసిన మనవడికీ తెలుసు

3
జలధరంలాంటి ఉమ్మడికుటుంబం క్రమంగా
తెల్లని మబ్బుతునకలుగా చెదిరిపోయి
జీవితసహచరుడూ సెలవుతీసుకొన్న చివరిరోజులలో
కూతురు అమ్మయి రుణంతీర్చుకొంటున్నపుడు
అగాధమైన నిశ్శబ్దం నిండిన చూపులతో
చివరిరోజులోకి భయంలేక ప్రయాణిస్తున్నట్లుండే
ఆమె జీవస్పందనలని గమనించినప్పుడల్లా
యవ్వనపుతొందరల మధ్యనున్న మనవడు
అమ్మమ్మ ఏం ఆలోచిస్తుందీ అని విస్మయపడుతూనే ఉండేవాడు

4
ఒక ఉక్కపోసే సాయంత్రంలోకి చేరుకొన్న మబ్బులు
చినుకుల్లా కరిగి భూమిని నిశ్శబ్దంగా తాకుతుంటే
గదిలోంచి బయటకు వెళుతున్న మనవడితో ఆమె
'ఏమిటది, వానపడుతోందా ' అన్నపుడు
అతను ఊహించలేదు అవి తనతో ఆమె చివరిమాటలని
ఉక్కపోతతో నిండనున్న జీవితంలోంచి చివరి వానాకాలం వెళ్ళిపోనుందని

5
జీవితం అమ్మమ్మలా దయగలదీ, ఓర్పునిండినదీ
కాదని తెలుసుకొంటున్నా
దానిని ప్రేమనిండిన చిరునవ్వుతో ముగించటమెలాగో
ఆమెనీడలో పెరిగిన కూతురుకొడుకు నేర్చుకొంటున్నట్టే ఉన్నాడు
కనుకనే, దుఃఖపూరిత జీవితానుభవాన్ని
దయగల పదాల్లోకి అనువదిస్తున్నాడు

Friday, August 29, 2014

జడివాన


_______అరుణ నారదభట్ల

ఇంకా నిర్ధారణ కాలేదు
ఆకాశం ముక్కలైందని!

కొన్ని నీటి తెప్పలు
పరుగెత్తి కూలినపుడు
పైపై మట్టి చల్లబడుతుంది
కానీ లోపలి నిశ్శబ్దంలో
దాగున్న లావా...
భూమి పొరల్లో
కదలాడుతూనే ఉంటుంది!

ఈ వానకు చిగురు కూడా
తునాతునకలవుతుంది!
సున్నితంగా తడవాలనుకుంటాం..
సందుల్లో మురికి కాలువ
ముంచేస్తే ఎవరికి ఇష్టమవుతుంది

ప్రశాంతత నిండుకున్న గడ్డి మైదానంలో
రెండు చేతులూ చాచి
చినుకులను వొంటికద్దుకోవడం
ఎంతటి ప్రియమైన స్పర్శ!

ఏదైనా... తడిసిపోవడమనుకొని
మురికినీటినీ తడేనని భ్రమిసిపోలేము
కానీ కొన్ని సార్లు తడుస్తూనే ఉంటాం!

వర్షం స్వచ్చమైన నీరులా కురిస్తే
మనసు వెన్నెలవుతుంది
కఠినజలం కురిస్తే
సారం కోల్పోయి నిర్జీవమవుతుంది!

మేఘం ఎప్పుడూ ఉరుముతూ
కటిక చీకటై సందడి చేస్తూనే ఉంటుంది!
కురవని మబ్బుకు మెరుపెక్కువ
కలవని దిక్కులకు కలతెక్కువ!

సమశీతోష్ణ మైదానంలా
నాలుగు డిగ్రేల కోసారి
రేఖాంశపు సరిహద్దును స్పృశిస్తూ
సమయానికి తగు వాతావరణంలో అక్షాంశమైపోవడం

ఈవానకు నేలంతా తడితో చిత్తడై
గుబురుటాకులను కప్పుకున్న తీగలా
పచ్చదనాలను వొంటపట్టించుకుంటుంది!
ఇంకా ఎన్ని రకాల తడిసేదుందో భూమి
చేజారిపోయేలోపు!

28-8-2014