Wednesday, May 21, 2014

వాన కురిసిన రోజు - కుప్పిలి పద్మ



నీకు గుర్తుందా
వాన కురిసిన ఆ రోజు ?
పసుపచ్చని సూర్యరశ్మిగా మొదలైన 
ఆ సాయంకాలం
 
వానగా మారింది.
సైకిల్ మీద నువ్వు
కొంచెం ఎడంగా ,
ఎందుకోగానీ మన నీడలు మాత్రం
 
పెనవేసుకొని
మనతోనే కదుల్తు.
 
మొగులంతా మబ్బు కమ్మి
 
పగలేమో కుంగిపోయి యెడతెగకుండా వాన.
తడుపుకి దడిసి
తలదాచుకొందామని
 
దారి పక్కన పూరి గుడెసికి మనం
ఎల్లలు లేని వాన
 
వాన చుక్కలు కారుతోన్న చేతులతో
 
ముఖాలని తుడుచుకొంటూ
 
నీకు గుర్తుందా
వాన కురిసిన ఆ రోజు?
నీరు నీరై
 
సిరాంతా కారిపోయి,
రాతలన్ని చెదిరిపోయి
 
తిరిగి రాసుకొనే
అవసరం లేని
 
ముద్దైన ప్రసంగ పాఠాలు.
పామైర చెట్ల మీదనుంచి 
పరుగులెత్తిన
 
ఆ నాటి యీదురు గాలి,
పోర్షియ ఆకులని బాదిబాది
కడలితో కలిసింది.
అబ్బా! ఏం వాన.
నా పక్కన నువ్వు,
గుడిసె నిండా
 
చిత్తడి వ్యాపిస్తూ మనం.
 
చిక్కటి నల్లటి వాన చీకట్ల రోదనల మధ్య,
సన్నటి గీతలాంటి విద్యుత్ లత
 
ఆకాశంలో తిరుగాడి
 
మటుమాయమయింది.
అరే మెరుపు తీగ అని 
ఆశ్చర్యంతో చూపించావ్ .
కాని నేను మళ్లీ
 
అటు చూసేటప్పటికి అది లేదు .
మళ్లీ మెరుపు కోసం
ఎదురుచూస్తుండగా
ఆకాశం వురుముతోనే వుంది.
వానతో తడిసిన నీ ముఖం మీంచి
వోకేవొక్క వెంట్రుక నీ
మెడ మీదుగా
దారి తప్పిన గోర్రెపిల్లలా.
వర్షం నింపాదిగా జల్లుగా మారింది;
వీధి వెంబడి ప్రయాణానికి
మనం తిరిగొచ్చేసాం,
మానవ రాకాసులు మన వైపు
చూస్తారు.
వాళ్ళ చూపులు బాణాల్లా, బల్లెల్లా
మనల్ల్ని వొత్తుకుపోతాయి.
అయినా మనం వొకళ్ళ పక్కన వొకళ్ళం
వున్నప్పుడు వీధి ముక్కలు చెక్కలై
విడిపోతుంది .
మళ్లీ వాన జల్లు:
మళ్లీ మనం వొకళ్ళకి వొకళ్ళుగా
కారు మబ్బుల కింద తలదాచుకొంటు.
నీకు గుర్తుందా
వాన కురిసిన ఆ రోజు?
Translation: Kuppili Padma
Original: Cheran Rudramoorthy