Monday, February 17, 2014

ఆకుపచ్చ యాత్ర - ఆర్.ఎం. ఉమామహేశ్వరరావు

అడవి.. ఎప్పటికీ అర్ధంకాని ఒక రహస్యం. కవ్వించే సౌందర్యం. భయపెట్టే బీభత్సం. సేద దీర్చే సహచరి. ఆప్యాయంగా అక్కున చేర్చుకునే అమ్మ.tirumala trek (68)
తిరుమల కొండను ముట్టడిస్తున్నట్టుగా పరచుకున్న పచ్చని అడివి మోహంలో పడి తిరుపతికి బందీలయిపోయిన ఎందరిలో నేనూ ఒకణ్ణి. మేక పిల్లను మింగి కదల్లేక పడుకున్న కొండచిలువలా కనిపించే ఈ కొండ, ఏ కాలానికా అందాన్ని ప్రదర్శిస్తుంది. ఒక్క పూట నిలబెట్టి కురిసిన వానకి, జలజలా దూకుతాయి జలపాతాలు. తిరుపతి ఏ మూల నుంచి చూసినా నల్లపచ్చనికొండ నిండా తెల్లటి పాయలు కనిపిస్తాయి. కొండకు దగ్గరగా ఇళ్ళుండేవాళ్ళకు వానకాలమంతా జలగలల సంగీతం ఒక వరం. మంచు కురిసే వేళ.. పసుపు, ఎరుపు పూల పచ్చనాకుల అడవి చెట్లతో, పొగ మబ్బుల గుసగుసలు, మసక వెలుగులో  మార్మిక సౌందర్యం. భగ్గున మండే  ఎండలకాలంలో, ఆకులన్నీ రాలిపోయి, కొమ్మలన్నీ కాలిపోయి ఎర్ర మచ్చల బెదురు చూపుల జింక పిల్లలా ఉంటుంది తిరుమల కొండ. పచ్చదనాల మధ్య  పొరలు పొరలుగా కనిపించే ఎర్ర బండలు.. దూరపు చూపులకే కట్టిపడేసే తిరుమల కొండ లోలోపలికినడిచి, గుట్టలెక్కి, లోయలుదిగి, వంకలు దాటి, రాయి రప్పలు ఒరుసుకుంటూ ప్రయాణిస్తే…
 కొండల్లోని కోనలూ, కోనల్లో పరుగులు తీసే వాగులూ, కొండ అంచుల్లోని లోయలూ, లోయ లోతుల్లోంచి పిలిచే చీకట్లూ, చీకటి కమ్మిన చెట్లను చీల్చుకుంటూ నేలను తాకే వెలుగు కిరణాలూ, లేత కాంతిలో మెరిసే చిగుళ్ళూ, ఎండినాకుల మీద చినుకుల టపటపలూ, పేరు తెలీని పిట్టల రెక్కల రెపరెపలూ,  ఎర్రమట్టి పుట్టలూ, విరబూసిన ముళ్ల పొదలూ,  పెనవేసుకుని ఎగబాకిన తీగలూ, ఎన్నెన్నో కాయలూ.. అరుదుగా దొరికే అదృష్టం ఇది. అడవిలో, చెట్లలో, పూలలో, పిట్టల్లో, రాళ్ళలో, వంకలు వాగుల్లో, గడ్డి పొదల్లో కలగలిసిపోయి తిరుగులాడే అవకాశం..ఓహ్‌..!
తిరుపతి యూత్‌ హాస్టల్‌ ఏర్పాటు చేసిన ప్రయాణం. లీడర్‌ బాలు. పిల్లా పాపలతో కలిసి పాతిక మంది. రెండు రోజులు అడవి జీవనం. కడప జిల్లా కుక్కలదొడ్డి నుంచీ తెల్లవారే వేళ అడవిలోకి అడుగు పెట్టాలని ముందుగా అనుకున్న నిర్ణయం. ఎర్రచందనం చెట్లు తెగ నరికి తరలించే ముఠాలు అడవిలోకి ప్రవేశించే దారీ, వేళా అదే. ఎందుకొచ్చిన తంటా అని,  కొండకి రెండో పక్క నుంచీ నడుద్దాం అని చెప్పారు. ముందు రాత్రి నుంచీ ఎడతెగని వాన. చలి. ప్రయాణం బహుశా సాగదేమో అనుకున్నాం. నవంబరు నెలలో తుపాను రోజుల్లో తిరుమల కొండల్లోకా..? హఠాత్తుగా విరుచుకుపడి పారే వాగులు, వానకి మట్టి కరిగి జారే బండలు, లోయ అంచుల్లో వేళ్ళతో సహా కూలిపోయే వృక్షాలు, నాని జారే రాళ్లు. ప్రయాణం వాయిదా పడుతుందనే నమ్మకం, పడాలనే ఆశ. తెల్లారినా వెలుగు జాడలేని ఆకాశాన్ని చూస్తే  తెలియని భయం. వాయిదా అనే మాట వినబడుతుందని ఫోన్‌ చేస్తే, ముందు పాపనాశనం చేరుకుందాం పదండి అన్నారు.  మమ్మల్ని సన్నద్ధం చేసింది విష్ణు బ్యాంకు సహోద్యోగి భవాని. పిల్లలూ, భర్తతో పాటూ హైదరాబాద్‌, చెన్నయ్‌, కొత్తగూడెంల నుంచి బంధువుల్ని, చిన్ననాటి స్నేహితుల్ని కూడా పోగేసింది ఆమె. ఉదయపు నడకకే మొరాయించే రాగలీనతో కలిసి రెండు రోజులు నడక సాగేదేనా అనే సందేహం. పైగా ఇంత వానలో? చూద్దాం అని, బూట్ల లేసులు బిగించి, రెయిన్‌ కోట్‌లు తొడుక్కుని, తలకి టోపీలు పెట్టుకుని పాపనాశనం చేరుకున్నాం. ఉదయం తొమ్మిదిన్నర. ఆగని వాన. పొగ మబ్బు. చిమ్మ చీకటి. అపనమ్మకంగానే ఒక్కరొక్కరూ బస్సులు దిగారు. అప్పటికే నెట్‌లో వెదర్‌ ఫోర్‌కాస్ట్‌ చూసి, ఉరుములూ, మెరుపులూ, ఈదురు గాలులూ ఉంటాయని తెలుసుకుని,  ‘ఆగిపోదామా’ అనడిగాం బాలూ బృందం రాగానే. తేలిగ్గా నవ్వి, ‘వానలో తడుస్తూ ప్రయాణం కూడా ఒక అనుభవమే పదండి నడుద్దాం’ అన్నాడు. ఆశగా అందరూ భవాని వైపు చూశారు. లేక్కలేనట్లే ఉందామె. ‘ఏం ప్రమాదం లేదా?’ అనడిగారు కొందరు బాలూని బేలగా. ‘ఉంటుంది, అయినా బావుంటుంది.’ అని, మరో మాటకి అవకాశం ఇవ్వకుండా కట్టించుకుని వచ్చిన ఇడ్లీ పొట్లాలు తలా ఒకటి ఇచ్చాడు. ఆ అరగంటలో ఎన్నో అనుమానాలు, భయాలు. వెనక్కా, ముందుకా తేల్చుకోలేని సంకోచం. తిరుమలలోనే కొందరు ఆగిపోయారు. మేం కదిలాం లోపల బెరుగ్గానే ఉన్నా, బయటకి బింకంగా. పాపనాశనం డ్యాం మీద ఉదయం పదిగంటల వేళ.. పదడుగుల ముందేముందో కూడా కనిపించడంలేదు. మొండిగా నడిచాం ముందుకే. ఎత్తయిన గుట్ట.. కాళ్ళ కింద జర్ను జారుతున్న మట్టి. ఒగర్చుకుంటూ నిదానంగా పైకి చేరుకున్నాం. వాన కాస్త తెరపిచ్చింది. ‘ఇంకెక్కడా గుట్టలెక్కే పని ఇంత ఉండదు’ అని ఉత్సాహపరిచాడు బాలు. అర గంట నడక, తడిచిన పొదల నడుమ సన్నని కాలి దారి. గలగలా శబ్దం స్వాగతం పలికింది. రెండు పాయలుగా వచ్చిన వాగు ఒకటిగా కలిసి పారుతోంది. అక్కడే చిన్న  పందిరి కింద  హనుమంతుడి రాతి విగ్రహం. మట్టి ప్రమిదలో ఆరిపోయిన దీపం. ‘సనకసనంద తీర్ధం. మళయాల స్వామి ఇక్కడే ధ్యానం చేసేవారంట. తర్వాత ఆయన ఏర్పేడులో ఆశ్రమం ఏర్పాటు చేసుకుని స్ధిరపడ్డారు’ అంటూ దాని గురించి చెప్పాడు బాలు. అందరినీ అక్కడ పోగేసి, ట్రెక్కింగ్‌ నియమాలన్నీ వివరించాడు, ‘మద్యం, పొగ నిషేధం. మనిషి వాసన జంతువుల్ని చికాకు పరుస్తుంది. చిరుతలుండే అడవి ఇది, కొండ దిగితే ఏనుగుల గుంపు ఉంటుంది. మన ప్రవర్తన వాటిని రెచ్చ గొట్టకూడదు. ఒకరికొకరు కనిపిస్తూనే నడవాలి’ అని. రెండు రోజులు సెల్‌ఫోన్‌లు మోగవు. వాన మళ్ళీ మొదలైంది. కాసేపు జోరుగా కురిసి, చిటపట మంటూ సర్దుకుంది. తడుస్తూ, ఆరుతూ, కళ్ళద్దాల మీద చినుకులు తుడుచుకుంటూ, తడి ఆకుల స్పర్శకు పులకిస్తూ, జారే బండల మీద మునివేళ్ళు అదిమి పట్టిన బూటుకాళ్ళతో నడుస్తూ లోయ అంచున మూడు గంటల ప్రయాణం. నడి మధ్యాహ్నపు వేళ కూడా వెలుగు జాడలు లేవు. తెరిపి లేని వాన మబ్బు కమ్మిని ఆకాశం కింద ఏదో సంతోషం, తెలియని దిగులు..ఇంకెంత దూరం? వాన కురిసే రాత్రి ఈ అడవిలో బస ఎట్లా? సందేహాలు లోపల్లోపలే అదిమి పెట్టేసుకుని భారం భవానీ మీదా, బాలూ మీదా వేసేసి నడుస్తున్నారు అందరూ. మా బృందానికి సాయం కోసం ఆ అడవంచు పల్లెల్లోని యానాదులు పది మంది వంట పాత్రలూ, సామాగ్రి మోసుకుంటూ మా కన్నా ముందు నడిచారు. అడవి ఆనుపానులు తెలిసినవారు వీరే.tirumala trek (106) చిరుత లు తిరుగాడే చోట్లు, లేళ్ళ మందలుండే ప్రాంతాలు, ఎలుంగొడ్ల గుహలు, ఏనుగుల అడుగుజాడలు, రేసుకుక్కలతో ప్రమాదాలు, నక్కలు నక్కి ఉండే బొరియలు, విషపు పాములు, రాళ్ళ కింద తేళ్లు..అడవిని చదువుకున్న జ్ఙానులు వీరు. ఈశ్వరయ్య, అంకయ్య, సుబ్బరాయుడు, ఎంగటేశ్వర్లు.. ఎక్కువ మందికి ఇవే పేర్లు. పెద్దగా ఎవ్వరితో మాట్లాడరు.  వీరు చూపిన దారిలోనే రెండు రోజులూ నడిచాం. ఆగమన్న చోట ఆగాం. పడుకోమన్న చోట పడుకున్నాం. పెట్టింది తిన్నాం. వీరితో పాటూ వంట మాస్టారు రఘు తిరుపతి నుంచి వచ్చాడు. పాతికేళ్ళుగా ఆయన ఈ కొండ కోనల్ని ఎక్కి దిగుతూనే ఉన్నాడంట. పెళ్ళిళ్లు, ఇతర కార్యాలున్నా అడివిలో వంట అంటే చాలు అన్నీ వదిలేసి వచ్చేస్తాడంట. అడవంటే అంత మోజు రఘుకి.
మాకన్నా ముందు నడిచెళ్ళిపోయి, ఒక కాలువ పక్కన, కొండ అంచున ప్లాస్టిక్‌ పట్ట వాలుగా కట్టి దాని కింద  రాళ్ళ పొయ్యిలు వెలిగించారు మా సహాయకులు. రెండు గుహలున్నాయి అక్కడ. గుహల్లో బ్యాగులు తడవకుండా దాచుకున్నాం. ‘ఈ రాత్రి ఇక్కడే ఉంటాం’ అన్నాడు బాలు. ‘ఇక్కడా..’ అని అందరూ అరిచారు చుట్టూ చూస్తూ. ఒక చోట వాలుగా నీలం పట్ట వేలాడగట్టారు. ‘మీరు తెచ్చుకున్న పట్టలు నేల మీద వేసుకుని పడుకోవాలి’ అన్నాడతను. వాన కురుస్తూనే ఉంది. ఇంతలో పొగలు కక్కే టీ .  టీ తాగే అలవాటు లేని వాళ్ళు కూడా అందుకున్నారు. ఎవరికి వాళ్ళు తెచ్చుకున్న నీళ్ళ బాటిళ్ళు ఖాళీ. కొండ మీద నుంచి కారుతున్న నీళ్ళని పట్టుకున్నాం తాగడానికి. బ్యాగులన్నీ పెట్టేశాక, తుంబురు తీర్ధానికి గంట నడక. బండరాళ్ళ మధ్య నుంచి వడిగా పారుతున్న వాగులోంచీ, వాగు అంచుమీద నుంచీ, పాచిపట్టి జారుతున్న బండల మీదుగా ప్రయాణం.. ఇటు నుంచి అటూ, అటు నుంచి ఇటూ వాగుని దాటుకుంటూ జిల్లుమనే నీళ్ళలో నానుతూ. ప్రవాహం వేగంగా ఉన్న చోటంతా మోకులు పట్టుకుని ఒకరి వెనుక ఒకరు వాగు దాటారు. మా సహాయకులు దడి కట్టి నిలబడి, వాగు వేగానికి కొట్టుకుపోకుండా ఒక్కొక్కరినీ పట్టుకుని దాటించారు. చాలా చోట్ల  వాగు ప్రవాహ వేగానికి కాళ్ళు ఆనేవి కావు. ఎంతో ఒడుపుగా, భద్రంగా ఒడ్డుకు చేర్చారు మమ్మల్ని. రెండు కొండల మధ్య లోయలో ఒంపులు తిరుగుతూ వయ్యారాలు పోతూ, తుళ్ళుతూ దూకుతూ, నురగలు పరుగులుగా పారే ఆ వాగు  ఆ రెండు రోజులూ మా వెంటే ఉంది, మమ్మల్ని భయపెడుతూ, మాకు ధైర్యం చెబుతూ. గంట తర్వాత- నిటారుగా, ఆకాశంలోకి నిలబెట్టిన నిచ్చెన్ల లాగా రెండు కొండలు ఒకదాని కెదురుగా ఒకటి, ఇక ఆలింగనం చేసుకోబోతాయా అన్నంత దగ్గరగా  కనిపించాయి. దట్టంగా చీకటి పరుచుకున్న లోయ అది. ఆ రెండు కొండల వెనుక నుంచి దిగ్గున వెలుగు పడుతోంది. బహుశా అవతలి పక్కన విశాలంగా ఉండిఉండాలి. రమ్మని పిలుస్తున్నట్టుగా ఉన్న ఆ వెలుగు దగ్గరికి చేరుకోవాలంటే నీటి మడుగులోంచి వెళ్ళాలి. ‘చాలా లోతు, వెళ్ళలేం’ అన్నారు. ‘ ఈత వచ్చిన వాళ్ళం అయినా వెళ్ళచ్చుగా’ అనడిగితే, బాలు ఒప్పుకోలేదు. అప్పటిదాకా వానలో, వాగులో తడుస్తూనే ఉన్నా, అందరూ మడుగులో స్నానాలకు దిగారు. చల్లటి నీళ్ళలోనే కేరింతలు, అరుపులు, కేకలు, ఆటలు,ఫోటోలు. అలిసిపోయి మళ్ళీ వెనక్కి మోకులు పట్టుకుని వాగు దాటుకుంటూ  నడక. బస చేసిన చోటుకు చేరుకుని కూల బడ్డారు బండల మీద. బూట్ల లోంచి బయటకు తీసిన పాదాలు జవికి పోయి ఉన్నాయి. త డిచిన గుడ్డటూ, బూట్లూ పిండి పొడిగా ఉన్న కొండ గుహలో ఆరేసుకుని పట్టలు పరుచుకుని నడుం వాల్చారు. వేడి వేడి పలుచటి సాంబారుతో భోజనం ఆకలి మీద అదిరిపోయింది. ఆవురావురుమంటూ తిన్నారు. అప్పటికే సాయంత్రం అయిపోయింది. వాన సన్నగా కురుస్తూనే ఉంది. చుట్టూ కొండల నడుమ వాగు ఒడ్డున గుహ అంచున అందరం ఉన్నాం. అగోరీబాబా అనే ఆయన చాలా ఏళ్ళు ఆ గుహలో ఉండే వాడు. ఐదారేళ్ళ కిందట ఎవరో గుహలోనే ఆయనని చంపేశారు. హత్య జరిగిన చోటే మా రాత్రి నిద్ర. గుహలోపల సన్నటి దువ్వ మట్టి, గబ్బిలాల చప్పుడు, మక్కు వాసన. వాన వేళ, తల తడవకుండా ఉంచే ఆ గుహ స్టార్‌ హోటల్‌ని తలపించింది. నీలం పట్ట కింద కొందరు, గుహలో కొందరు . చీకటి దట్టంగా అలుముకుంది. రాత్రి అడవి అరుపులు మొదలయ్యాయి. ఏరుకొచ్చిన కొన్ని దుంగలతో మంట వేశారు. కబుర్ల మధ్య అంతగా ఆకల్లేకపోయినా, పూరీ, ఉల్లగడ్డ కూరతో రాత్రి భోజనం పూర్తయింది. నడిచీ, నానీ ఒళ్ళు పులిసిపోయి, అలిసిపోయినా ఎవ్వరికీ సరిగా నిద్ర లేదు.   ఫోన్‌లకు కూడా అందని లోయలో, నిండు పౌర్ణమి నాడు చిమ్మ చీకట్లో, హోరున పారే వాగొడ్డున, ఏ జంతువు ఏ పొద చాటున నక్కి ఉందోననే భయం వెంటాడుతున్న ఆ  రాత్రి  సన్నని వానా ఆగలేదు, ఎవ్వరి కంటి మీదా రెప్పా వాలలేదు.
అడవి కోళ్ళ అరుపులు, పిట్టల కిలకిలలతో పాటూ సన్నని వెలుగు ఆకాశంలోంచి లోయలోకి దిగుతోంది. ఉదయపు కార్యక్రమాలు ముగిశాయి. చలి ఉదయపు చల్లని వాగు స్నానం, కాసేపు వణికించినా ఎంతో హాయిగా ఉంది. పొంగలి తిని, వెజిటబుల్‌ రైస్‌ ప్యాకె ట్లు  బ్యాగుల్లో సర్దుకుని తుంబురులోయకు వీడ్కోలు చెప్పి రెండో రోజు నడక మొదలు పెట్టాం. మొన దేలిన రాళ్ళ మీద నడక. తడి ఆరని బూట్లలో దూర్చిన నానిన పాదాలు జివ్వుమంటూనే ఉన్నాయి. వాగు ఒంపు తిరిగినపుడంతా మోకులు పట్టుకుని దాటడం, కొన్ని చోట్ల నీళ్ళలోనే ఫర్లాంగులకు ఫర్లాంగులు నడవడం. ముళ్ళ పొదలు, వేలాడే తీగలు, బిక్కి, నేరేడు, నెల్లి, కరక, ముష్టి, అడవి మామిడి చెట్లు. చిత్ర విచిత్రమైన పూలు, పేరు తెలీని కాయలు.. ఎటు చూసినా కొండ నెల్లికాయల గుత్తులు. కొందరు మోయగలిగినన్ని కోసి బ్యాగుల్లో కుక్కుకున్నారు. కొందరు తినగలిగినన్ని జేబుల్లో నింపుకున్నారు. బుగ్గన దాచుకున్న నెల్లికాయ రసాన్ని పంటి గాట్లతో కొంచం కొంచం పీలుస్తూ ఉంటే, నడిచినంత సేపూ అలసటను దూరం చేసింది. దాహమైనపుడు వాగులో తేటంగా పారే నీళ్ళు తాగుతూ, ఒకర్నొకరు హెచ్చరించుకుంటూ, జారి పడుతూ, బెణికిన కాళ్ళను సర్దుకుంటూ మూడు గంటల నడక. పేర్చిన పొరల్లా ఒంగి గొడుగు పట్టినట్టుగా ఉండే కొండ అంచుల కింద నుంచీ, మనిషెత్తు పిచ్చి పొదల్లో దారి చేసుకుంటూ పారే వాగుతో పాటే ప్రయాణం. వీపుల మీద బ్యాగుల భారం. మబ్బులు పలచబారి వెలుతురు ప్రకాశవంతంగా అడవిని ఆవరించింది. వాన దూరమైంది. ఆ లోయలో అప్పుడప్పుడూ చెమటలు కూడా పడుతున్నాయి. మహా వృక్షాలను పెనవేసుకున్న  మెలికల గిల్ల తీగలూ, ముదురుపచ్చని ఆకుల మీద మెరుస్తున్న వెలుగు రేఖలూ, వాగు నీళ్ళలో గోగు పువ్వులవంటి పసుపు పూల గుత్తులూ, తెరిపి ఉన్న చోట ఎగిరే సీతాకోక చిలుకలూ..శ్రమ తెలియని నడక. దట్టమైన వెదురు వనాలకిందకి చేరుకోగానే చీకటి కమ్ముకునేది. వెదురు పొదరింటికి చిల్లు పడిందా అన్నట్టుగా మైదానంలో వెలుగు పరుచుకునేది. అడవి యానాదులు నెత్తిన మోతతోనే మాకు ముందూ, వెనుకా మమ్మల్ని కవర్‌ చేసుకుంటూ నడుస్తున్నారు. కోట గోడలా చుట్టూ ఆవరించిన కొండల నడుమ విశాలమైన గడ్డి మైదానంలో మధ్యాహ్నం కాసేపు విశ్రాంతి. అక్కడే ప్యాకెట్లలోని భోజనం. పొద్దు వాలక ముందే లోయలోంచి బయటపడాలి. మళ్ళీ నడక. చాలా చోట్ల దారి లేదు. కొన్ని చోట్ల మాత్రం బండ రాళ్ళ మీద ఎర్ర పెయింట్‌తో వేసిన బాణం గురుతులు కనిపించాయి. ఏడాదికోసారి జరిగే తుంబురు తీర్ధం కోసం వచ్చే భక్తులకు దారి చూపేందుకు టీటీడీ వేసిన గురుతులు ఇవి. పొంగి పారుతున్న వాగు నీళ్ళలో అనేక చోట్ల ఇవి మునిగి పోయాయి.అయినా యానాదులకు ఈ దారి కొట్టిన పిండి. నడిచీ నడిచీ ఒక చోట ఈతకు అనువుగా వాగు లోతుగా ఉన్న చోట ఆగాం. గబగబా కొందరు నీళ్ళలోకి దూకేశారు. ఏనుగులు ఈదులాడే వాగు అది. ఇక ఇక్కడి నుంచీ కొండకు దూరమవుతాం. ఏనుగుల రాజ్యం అది. చిత్తూరు జిల్లాలోంచి నడక మొదలు పెట్టి కడప జిల్లాలోకి ప్రవేశించాం. సాయంత్రపు వెలుగులో లేత పసుపు దనం పరచుకున్న గడ్డిమైదానంలోకి అడుగుపెట్టాం. మనుషులు కనిపించనంత ఏపుగా పెరిగిన గడ్డిపొదల మధ్య నుంచీ నడక. కొంత సేపటికి బురద నేల మొదలైంది. దూరంగా రైలు చప్పుడు. నడిచీ నడిచీ రైలు కట్ట దాటి కుక్కలదొడ్డి రోడ్డు మీదకు చేరుకున్నాం. కడప నుంచీ వచ్చే బస్సులు ఆపి ఎక్కి తిరుపతికి తిరుగు ప్రయాణం. తడచీ, ఆరీ, నడచీ, నవ్వీ, పడీ, పరుగెత్తీ, దిగులూ, భయంతో కూడుకున్న సాహసోత్సాహంతో ప్రయాణించి, నిత్యం ఎదుర్కొనే సకల వత్తిళ్ళ నుంచీ ఆ ఆకుపచ్చ లోయలో విముక్తమై అనంతమైన ఆనందాన్ని మనశ్శరీరాల నిండా నింపుకుని అడవి ఒడ్డుకు చేరుకున్నాం.
‘ఎర్ర’ బీభత్సపు ఆనవాళ్ళు
CIMG7665అడవియాత్రలో తొలి నుంచీ చివరి దాకా మా మధ్య మాటలై నడుస్తూ, మమ్మల్ని వెంటాడిన విషయం ఎర్రచందనం స్మగ్లింగ్‌. తిరుమల అడవుల్లో విస్తారంగా పరచుకున్న అరుదైన అద్భుత వృక్షాలు ఇవి. విలువైన సంపద ఇది. అడవినీ అడవిలోని ఎర్ర బంగారు సంపదనీ కొల్లగొడుతున్న తీరు అడుగడుగునా కనిపించింది.  సనకసనంద తీర్ధం దాటిన అరగంట నుంచే ‘ఎర్ర’ బీభత్సం తీవ్రత అర్ధమైంది. నరికేసిన ఎర్ర చందనం చెట్లు అడవి నిండా కనిపించాయి. కొన్ని చోట్ల, ఆ రాత్రో, ఆ ముందు రోజో నరికిన చెట్లూ కనిపించాయి. కొన్ని ప్రదేశాల్లో తరలించడానికి సిద్ధంగా ఉన్న దుంగలున్నాయి. నరికిన చెట్లను ఒక్క చోటకి చేర్చి బెరడు చెక్కి కావలసిన సైజుల్లోకి దుంగలుగా నరుక్కున్న గురుతులున్నాయి. నరికిన దుంగల్ని పారే వాగులోకి దొర్లించి తరలించుకుపోయిన ఆనవాళ్ళున్నాయి. గుంపులు గుంపులుగా ఎర్రచందనం చెట్లు నరికే కూలీలు తిరుమల అడవిలోనే రోజుల తరబడి ఉన్నారనేందుకు సాక్ష్యంగా అనేక చోట్ల భోజనాలు వండుకున్న పొయ్యిలున్నాయి. ఎర్ర దొంగలు వంటకీ,  రాత్రుళ్లు చలి నెగళ్ల మంటకీ కూడా అత్యంత విలువైన ఎర్ర చందనమే వాడుకుంటున్నారనేందుకు గుర్తుగా సగం కాలి ఆరిన దుంగలు కనిపించాయి. ఎర్రటి గురుతులు, బొగ్గులు, ఎర్ర పేళ్ళ పోగులు.. అడుగడుగునా తారసపడ్డాయి. తెగిన వృక్షాల కాండాలు నేలలోంచి పొడుచుకువచ్చి వికృతంగా ఉన్నాయి. పాతికేళ్ళ కన్నా ఎక్కువ వయసున్న ఎర్రచందనం చెట్లు మాత్రమే చేవదేలి ఉంటాయి. వాటికే మార్కెట్‌ ఉంటుంది. వెడల్పాటి కాండమున్న చెట్లనే నరికి తరలిస్తారు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ దుర్మార్గం శ్రుతి తప్పి లేత చెట్ల ఉసురూ తీస్తోంది. చిత్తూరు, కడప జిల్లాల్లో అడవి అంచు పల్లెల్లోని వారు కూలీలుగా స్మగ్లర్లకు ఉపయోగపడిన కాలంలో చేవగల చెట్లనే నరికి తరలించేవారు. కేసులు పెరగడంతో స్థానికులు ఎర్ర  వృక్షాలు నరికే పనికి దూరమయ్యారు. దీంతో తమిళనాడు  పల్లెల నుంచి వందలాది మంది కూలీలను రోజుకు వెయ్యి రూపాయల ఆశ చూపి ఈ పనికి పురమాయిస్తున్నారు. ఎర్ర చెట్ల పై అవగాహన లేని తమిళ కూలీలు, లేత చెట్లను కూడా తెగ నరికేస్తున్నారు.  పనికి రావని అక్కడే పారేస్తున్నారు.  ప్రపంచంలో ఇక్కడ మాత్రమే పెరిగే చెట్టు ఇది.  బుడిపెల బుడిపెల బెరడు గలిగిన ఎర్ర చందనం చెట్లు ఒకప్పుడు దట్టంగా శేషాచలమంతా పరుచుకుని ఉండేవి.  ఇప్పుడు శేషాచలం ఎర్రబోడి కొండలుగా మారుతున్నాయి. లక్ష కోట్ల విలువైన ఎర్ర బంగారం ఇప్పటికే అడవి దాటిపోయింది. అటవీ, పోలీసు శాఖ కాస్త గట్టిగా ఉండడంతో తెగించిన ఎర్ర దొంగలు, దుంగల కోసం ప్రాణాలు కూడా తీస్తున్నారు. సౌందర్య భరితమైన ఆకుపచ్చ లోయలో బీభత్సం సృష్టిస్తున్నారు. ఎర్రదొంగల పుణ్యం వల్ల ఈ కొండల్లోకి నడిచి సేదదీరే ప్రయాణాలకు ప్రజలు దూరమవుతున్నారు. తిరుమల కొండల్లోకి ప్రయాణాలకు ఇప్పుడు అటవీ అనుమతి అంత సులభంగా దొరకడంలేదు. దొరికినా సవాలక్ష ఆంక్షలు. ఎందుకొచ్చిన తంటా అని అడవి దారులు తెలిసిన వారూ దూరంగా ఉండిపోతున్నారు. శేషాచలం కొండల్లో తుంబురు తీర్ధం, కుమారధార, పసుపుధార తీర్ధాలు, శేషతీర్ధం, రామకృష్ణ తీర్ధం, యుద్ధగళ తీర్ధం వంటి ఎన్నో అద్భుతమైన ప్రదేశాలున్నాయి. నడిచి మాత్రమే చేరుకునే ప్రదేశాలు ఇవి. కష్టనష్టాలకోర్చి ప్రయాణిస్తే పొందే ఆనందం అంతా ఇంతా కాదు. అయితే, ఎర్ర బీభత్సాల వల్ల ఈ తీర్ధాలకు ముందుండి నడిపించే వారు కరువయ్యారు. తిరుపతి, కుక్కలదొడ్డి, మామండూరు ప్రాంతాలనుంచి ఎన్నో బృందాలు ట్రెక్కింగ్‌ యాత్రలు నిర్వహించేవి. ఇప్పుడు తిరుపతి యూత్‌ హాస్టల్‌ మాత్రమే అప్పుడొకటీ అప్పుడొకటీ యాత్రలు నిర్వహిస్తోంది. ఆన్‌లైన్‌లో ముందుగా పేర్తు నమోదు చేసుకున్నవారికే అవకాశం ఉంటుంది. అసలు అటవీ శాఖే ఎకో టూరిజం పేరుతో అడవి ప్రయాణాలు నిర్వహించవచ్చు. ప్రయాణించేవారి మంచి చెడ్డలు విచారించుకున్నాకే అడవిలోకి అనుమతించవచ్చు. వీరికి సహకరించేందుకు తిరుపతి చుట్టుపక్కల ఎందరో అడవి గుట్టు మట్లు తెలిసినవారున్నారు. వీరి సేవలు వినియోగించుకోవచ్చు. వీరికి ఉపాధిగానూ ఉంటుంది. అటవీశాఖకు ఆదాయమూ లభిస్తుంది. ఈ కదలికల వల్ల అడవిలో ఎర్ర దొంగల సంచారమూ తగ్గుతుంది.

(ఆంధ్రజ్యోతి ఆదివారం పత్రికలో అచ్చయిన వ్యాసం)