Thursday, August 8, 2013

వాన - వాడ్రేవు చినవీరభద్రుడు


ఒక్కసారిగా తెలిసొచ్చింది నీకు, రాత్రంతా
వాన ఫోన్ చేస్తూనేవుందని, నువ్వు సైలెంట్
మోడ్ లో ఉండిపోయావని. నిస్సహాయంగా
తడుస్తున్నవి గోడలు,మేడలు,వీథులు,వైర్లు.

అడివిలో మిగలముగ్గిన తాటిపండ్ల లాగా ఆమె
వక్షోజాలు నిన్నుక్కిరిబిక్కిరిచేస్తున్నాయి. ఈ
నగరంలానే నీ హృదయం కూడా ఒక పొలం
కాలేకపోయిందని నీకిప్పుడిప్పుడే తెలుస్తున్నది.

మింటినీ మంటినీ చుట్టబెట్టినట్టు నీక్కూడా
మేఘంలాంటి ఒక వస్త్రంకావాలి, బహుశా
వస్త్రం వదిలిపెట్టి నువ్వొక మేఘం కావాలి,
నీకూ వర్షానికీ మధ్య గోడ బద్దలు కావాలి.

-------------------------------------8.8.2013

2 comments:

  1. Renuka Ayola వ్రాసిన స్పందన :
    **********************************
    కవిత రాసేటప్పుడు కవికి ఒక సమయం ,ఒక భాష వుంటుంది ఒక మూడ్ కూడవుంటుంది
    మనం దాన్ని చదివేటప్పుడు కూడ ఒక మూడ్ మనచుట్టూ ఏర్పడుతుంది. నాలుగు గోడలమధ్య కూర్చుని కవిత్వాన్ని కంప్యుటర్ లో చదువు తున్నప్పుడు మన అలోచనలు ఇంకో విధంగా వుంటాయి

    కొన్ని సార్లు ఆ కవిత్వసారాన్ని అందుకోలేక పోతాము. మళ్ళీమళ్ళీ చదువుతాము. కవియొక్క భావావేసాన్ని అర్ధంచేసుకుంటూ ఇంకో ప్రపంచంలోకి వెళ్ళి పోతాము..

    చినవీరభద్రుడి గారి కవిత-- A POEM FOR TODAY

    ఒక్కసారిగా తెలిసొచ్చింది నీకు,రాత్రంతా వాన ఫోన చేస్తూనే వుందని,నువ్వు సైలెంట మోడ్ లోనే ఉండి పోయావని,
    నిస్సహయంగా తడుస్తున్న గోడలు,వీధులు,వైర్లు

    ఒక్కోసారి మనం గాఢనిద్రలో వున్నప్పుడు వాన చప్పుడు కిటికీలోంచి వచ్చే చల్లటి గాలి స్పర్శతో తెలివి ఒచ్చినా నిద్రపోతాము
    మనం సైలెంట్ మోడలోనే మెలుకువ నిద్రమధ్యలో వుండిపోతాము

    నిస్సహయంగా తడుస్తున్న గోడలు ,వీధులు,వైర్లు అనగానే/

    నాకు ఇంకోన్ని దృశ్యాలు కనిపించాయి అరుగులమీద వానజల్లులకి తడిసిపోతూ
    వెనక్కి జరగలేని పేదవాళ్ళ నిస్సహత చూపులు.

    రోడ్డుకి అడ్డంగా పడిపోయిన కరెంటు వైర్లు,కూలిపోవడానికి సిధపడ్డ పాత పాడుపడ్డ మేడలు
    మనం నిద్రలో ఉన్నప్పుడు నగరం మీద వాన నిశ్శబ్ధంగా కురుస్తు తనపనితాను చేసుకుపోతుంది అనిపిస్తుంది...

    నీకు వర్షానికి మధ్య గోడలు బద్దలు కావాలి అన్నప్పుడు/
    వెచ్చని ఇంట్లో వర్షాన్ని అనుభవించడం ఒకేత్తు అయితే

    వానకి తడిసి కుప్పకూలిపోయిన పాత ఇళ్లు నిర్జీవమైన
    జీవాలు/అప్పుడే వర్షానికి నీకు మధ్య గుండె గోడలు బద్దలై కన్నీళ్ళ మేఘం అడ్డుకుంటుంది

    ఇలా ఇన్ని భావాలు దృశ్యాలు కళ్లకి కడతాయి అక్కడ కవి ఏభావంతో రాసినా మనమనసు మాత్రం ఇలా ఇక్కడ ఎన్నో చిత్రాలని పటం కట్టిపెట్టుకుంటుంది......

    ReplyDelete