Monday, February 10, 2014

వర్షం గంపలో - రేణుక అయోలా



ఎండిన నేల రాలుతున్న ఆకులు
కొలిమిమంటల గాడ్పులు
నీటి బొట్టుకోసం తల్లడిల్లే పశుపక్ష్యాదులు
చమట ధారలలో జనం

నీలం చీరలో వర్షం గంపతో వస్తుందని
ఎన్ని ప్రార్ధనలు.
ఆమె కూడా గంపని నింపుకుని వద్దామనే అనుకుంటుంది
వర్షం గంప నింపడానికి సంఘర్షణలు.

గుమ్మంలో వున్న మబ్బులు ఏరుకుని
చినుకు జతారులని నింపుకొని
నేలకి దిగుతుండగానే

బలమైన గాలి అటూగా లాక్కేళ్ళి పోయింది
గంపలో వున్న మబ్బులు పారిజాతాల్లా
కొండ అంచుల్లో రాలిపడ్దాయి
అడవి కడుపులో ఒరిగిపోయాయి

ఖాళి గంపలో దిగులుపూలు

మళ్ళీ నల్లరేడు రంగు మబ్బులు ఏరుకుని
కొన్ని మెరుపుల దండలు బుట్టలో వేసుకుని
వురుములు నింపి గంపని జాగ్రత్తగ నెత్తినపెట్టుకుని
గంపని బోర్లించింది నేల ఒడిలో
వర్షం! వర్షం! వర్షం!

నేలని చుట్టుకున్న వర్షం
పచ్చటి తీవాచీలు పరిచిన వర్షం
పూలని పూయించిన వర్షం
నది తనువులో పొంగిన వర్షం
సీతాకోకచిలుకలైన గొడుగుల మీద వర్షం
పిల్ల కాలువలో కాగితం పడవలతో ఆడుకున్న వర్షం

ఆమె ఖాళి అయిన గంపతో వెళ్ళి పోయింది
శీతగాలులు ఏరుకోవడానికి.


(ఎ ప్పుడో రాసుకున్నది ఇప్పుడు ఇలా )