Saturday, May 3, 2014

వానపాట - Sriramoju Hara Gopal



వాన కురిసినపుడల్లా
మురిసిపోయే మనసా
మేఘాలపూలకు మట్టివాసనలద్ది
చుట్టుకునే వానకాంతిధారల్లో తడిసిపోవాలని ఎవరికుండదు
కొండైనా పులకరించిపోతుంది నీటిశాలువా కప్పుకుని
ముఖంమీదా, కనురెప్పలమీదా,గదువమీదా, గుండెలమీదా,
నిలువెల్లా నీటిజల్లులు...వొంటిమీద నవ్వులస్పర్శ
నీటివీణెలు మీటే చినుకులరాగాలు తుళ్ళి తుళ్ళి మళ్ళీ, మళ్ళీ
గొర్రెలు కాస్తున్న మల్లన్న గొంగడిరేకుల మీద,గడ్డితినే మేకపిల్ల ముట్టెమీద,
పొలం వొరాల పొంటి గడ్డికొనలమీద, రేకులగుడిసె చూరు అంచున,
వానలో నిలుచున్న నీ పాదాలమీదా ఒకటేనా వానరాస్తున్న కావ్యం
వానలో తడుస్తున్నది దేహాలా, లోలోని తడులస్నేహాలా?
ముడుచుకుని పడుకున్న ఏనుగులా, తాబేలులా,
వొంటిని వింటిలా వొంచిన వీధి సర్కస్ పిల్లలా
కనిపిస్తున్నఆ ముద్దులకొండ మీద కోట, రాజమహల్
చరిత్రపుటల్లోంచి జయహోలు,
రాళ్ళు మోసిన కూలీల స్వేదాలవాన
గుండె పగిలి కన్నీళ్ళు ఓపని మొగులు దిగులులాగా వాన
లోలోపల బొగ్గుకణికెల్లా పచ్చిపచ్చిగా గడ్డకట్టిన యాదిలా వాన
రెండుగా చీరిన దుఃఖాలు రెండు కళ్ళల్లో
నవ్వులకు,బాధలకు రేలపువ్వుల్లెక్క వానజల్లులు