Friday, June 7, 2013

ఇంకో సాయం చేస్తావా మేఘమా? ||జ్యోతిర్మయి మళ్ళ ||


ఇప్పటికి గుర్తొచ్చానా 
సూర్యుని తాపంతో పోటీ పడలేక నొచ్చుకుని కూచున్నావేమో
మదినిండా నిండి ఉన్న మధురోహల పరిమళాలు
పోనీలే ఇప్పుడొచ్చావుగా
నీ హర్షమంతా వర్షమై ముగిసాక
8-6-2013

ఇలా పలకరించావు వానజల్లై ?

ఇవాళదాకా ఇసుమంతైనా ఇటు తొంగిచూడలేదు 
నీలి నీలి నీ అందాలు తిలకిస్తూ 
ఎవరికీ చెప్పక గుండెలోదాచుకున్న రహస్యమొకటి 
చలచల్లగా నువ్వొస్తే మెలమెల్లగా నీతో చెప్పాలని 
ఎంతగా ఎదురుచూసానో!

ఎండవేడికి ఆవిరయిపోతుంటే 
ఉస్సురంటూ కాలమీదుతూ..
ఎపుడైనా నువు కాసింత చల్లదనాన్ని తీసుకొచ్చి
నాపై చిలకరిస్తే పులకరించాలని
ఎంతగా ఆశపడ్డానో! 

నేలా, నేనూ ఏకమై స్వాగతం పలుకుతున్నాం నీకు 
ఇదిగో ఆరుబయట నీకందుబాటుగా కూచున్నా 
నాకంటే ముందు నిన్నందుకోవాలని 
బారగా తనకొమ్మల్ని చాచి ఆహ్వానిస్తూ బాదంచెట్టు
నువు పంపే నీటిచుక్కలన్నీ 
టపటపమని తననే ముందు పలకరిస్తున్నా 
మధ్యమధ్యలో ఆకుల్ని తప్పించుకుంటూ నామీదా 
వాలుతున్నాయి కొన్ని చినుకుపూలు 
నా ముఖాన్ని ముద్దుగా ముద్దాడుతూ 
ఊహలకొచ్చాయి మళ్ళీ తాజాదనపు రెక్కలు 
నాట్యం చేస్తున్నాయి పురివిప్పిన నెమళ్ళై 

పనిలోపని నాకోసం ఇంకోపని కూడా చేసిపెట్టు మేఘమా
నీ చల్లదనంతో కలిపి నా సంతోషాన్నీ మోసుకెళ్ళి
గుమ్మరించు నా ఇష్టసఖునిపై !