Monday, November 25, 2013

నీది కాని వొక వాన! - అఫ్సర్





వొక తెల్లారు జాము వానలో తడుస్తూ
ఇల్లూ ఊరూ వదిలి
పరిగెత్తుతూ వెళ్తాను, ప్రపంచం వేపు.

*

పరిగెట్టించే ఈ ప్రపంచంలో
అసలేమైనా వుందో లేదో!
వున్నా అది నాదో కాదో
వెతుక్కునే వ్యవధి కూడా
దొరకనివ్వని ఉక్కిరిబిక్కిరిలో

వెళ్ళిపోతాను.

*
నా కోసం కురవని ఆ వానలోకి
తీక్షణంగా చూసే శక్తి కూడా నాకు వుండదు.

ఆ మాటకొస్తే, ఎన్ని చినుకులు కలిస్తే
వొక వాన అవుతుందో కూడా తెలీదు ఈ పరాయీ క్షణంలో.

ఈ వానా ఈ జీవితం
నన్ను ఎంతలా తడుపుతున్నాయో కూడా చూసుకోను.
వానకి కురవడం వొక్కటే తెలిసినట్టు
నాకు పరిగెత్తడం మాత్రమే తెలిసినట్టు!

*

మళ్ళీ మళ్ళీ
వొక తెల్లారు జాము వానలో తడుస్తూ
ఇల్లూ ఊరూ వదిలి
పరిగెత్తుతూనే వుంటాను, ప్రపంచం వేపు.

*

నన్ను ఉక్కిరిబిక్కిరి చేసే వూపిరిలాంటి ప్రపంచంలోకి!


(బాల్టిమోర్...లో అసలే నచ్చని వానలో తడుస్తూ...!)