Monday, July 15, 2013

వాన పాట



వచ్చెను వచ్చెను వర్షము వచ్చెను
హర్షము తెచ్చెను కాదా
కర్శకులంతా సాగిలి మొక్కగ
వరుణ దేవునికి బాగా
వాన దేవుడా వాన దేవుడా
వానల్లు కురవాలి దేవుడా //వచ్చెను//

అకాశంలో మబ్బులు నిండెను
ఆషాఢం ఇది కాదా
తళతళ లాడుచు మెరుపులు మెరిసెను
ఉరుములు ఫెళ ఫెళ లాడా
నింగీ నేలా కలిసి పోయెనూ.......
నింగీనేలా కలిసి పోయెను
చినుకులు వంతెన కాగా
వాగులు వంకలు పొంగెను పొరలేను
వరదలు వెల్లువ కాగా //వచ్చెను//

నవ నవ లాడెను చెట్లూ చేమలు
నయనానందము కాగా
జవసత్వాలను పుంజుకొన్నవీ
జగతికి జీవము రాగా
హాలిక హృదయం పొంగిపోయెనూ......
హాలిక హృదయం పొంగిపోయెను
వర్షము వరమై రాగా
హలధరుడై ఫలసాయము దీయగ
పొలమునుజేరేను వేగ //వచ్చెను//

పాడుకోవాలనుకునేవాళ్లు హమ్ ఆప్కే హై కౌన్ సినిమాలో ' మాయిని మాయిని 'స్టయిల్ లో పాడుకోవచ్చు.


Rammohan Rao Thummuri

వాన - ప్రసూన



అదే వాన చిత్రం
కానీ
అక్కడ ...
ఏ ఉద్వేగాన్నీ అనుభవించలేని
కాంక్రీట్ గోడల మధ్య ఉంటూ
కుచించుకుపోయిన మనసుని
దూరంగా వానలో తడుస్తున్న
చిన్న గుట్ట ఒక్కటే 
పచ్చని చేత్తో నిమురుతుంది.

ఇక్కడ ...
చెట్లతోనే సహజీవనం చేస్తూ
ప్రతి గోడా
నాలుగు చినుకులకే పులకించి
పచ్చటి పాటలు రాస్తుంది.

వాన వెలిసినా
ప్రతి చెట్టూ
ఆ ఙ్ఙాపకాలు పంచుకోడానికి
పోటీ పడుతుంది.

ఈ గాలి సోకుతూనే
గోదారంత విస్తరించిన మనసు
చెట్టు చెట్టునీ పలకరిస్తూ
నిండుగా ప్రవహిస్తుంది.

courtesy : ప్రసూన

వానా-- వానా-- వానా


పలచగా చినుకులు
తడిపొడిగా పడుతూ
పైగుడ్డ కూడా
తడిసేలా లేదు
-----------------------
దబాటు వాన
కర్షకుల కళ్ళల్లో
కొత్త పైర్ల కళ కళ
-----------------------
జడివాన
వరి పొలంలోకి
పారేనానీరు--?
సదసత్ సంశయం
-----------------------
ఉదయాన్నే
అదేపనిగా పడుతున్న వాన
చీకటి పడి ఒచ్చిన చుట్టంలా
ఎక్కడికీ పోదు.
-----------------------
తెల్లారేదాకా
ఇల్లంతా జల కళవుతుందేమోనని
అడుగడుగునా ప్రళయ భయం
గుండెంతా తహతహ.

-----------------------
ఎడతెరిపిలేకుండా
జబురుతున్న వర్షం
ఆకాశానికి
కళ్లనతికించి రైతాంగం
-----------------------
అరేబియా సంద్రంలో
అల్ప పీడన ద్రోణి
కకావికలౌతూ
కర్షక ప్రపంచం
-----------------------
----Purushothamaro Ravela