Monday, August 5, 2013

చినుకు - శ్రీకాంత్ కాంటేకర్




చినుకుతో ఎలా మమేకం కాను
ప్యాంటుజేబులో చేతులను జారవిడిచి
భుజాలను చెవుల వరకు రెక్కించి
అలా మౌనంగా నడక..
సౌమ్యంగా తాకుతూ.. జీవకణాలను తట్టిలేపుతూ ..చినుకులు

పచ్చని ప్రకృతి ఒడిలో
అదొక జీవభాష
ఏ లిపిలోకి తర్జుమా కాని భావధార
చినుకులతో ఒక సంభాషణ ..
కాదు.. చినుకుల్లో తడిసిపోయి కరిగిపోయే
ఒక సమాలోచన

గగనం నుంచి జలజలా రాలుతూ
ఆకుల లాలిత్యాన్ని ప్రేమగా నిమిరుతూ
మట్టిపొత్తిల్లలోకి చినుకు

నింగి నుంచి రాలిపడినా
తొణకని గర్వం
లిప్తపాటు అస్తిత్వమే అయినా
తన ఉనికిని బలంగా చాటే నైజం
జలసమూహంలో ఐక్యమై
తరంగాలుగా విస్తరించే ఒంటరి సైనికుడు చినుకు

ఎలా అనుసంధానం చేసుకోను
ఆ చిన్ని చినుకులో ఎలా లీనం కాను
అయినా జనసమూహంలో నువ్వు-నేను చినుకులమే కదా?
అలలుగా అల్లుకుంటూ.. ఆవిరిగా ఆకాశం ఒడికి చేరుతూ..
చినుకులుగా.. జల్లులుగా.. వర్షిస్తూ ఉంటాం
అప్పుడు ఆ చినుకు నీలా ఉంటుంది
నన్నూ తన మెరుపులో నింపుకుంటుంది
ఇద్దరిని తనలో ఐక్యం చేసుకొని
ఏ సముద్రంలోనో మునిగితేలుతుంది



తేదీ 5-8-13