Thursday, August 15, 2013

వాడ్రేవు చినవీరభద్రుడు



ఏ రాత్రిమధ్యనో దేహాంగాల్లోంచి ప్రేమ పొంగినట్టు
వాన. తెల్లవారేవేళల్లో ఏటిఒడ్డున అడవిదున్నలు
నీళ్ళుతాగుతున్న చప్పుడు, కొంత సాధుత్వం
కొంత పశుత్వం. కొంతదాహం, కొంత దుస్తరం.

నిన్ను నువ్వెంత సముదాయించుకున్నా తీరని
కోరిక ఒకటి పాదరసం చుక్కలాగా రక్తనాళాల్లో
సరసర సాగుతున్న సవ్వడి. ఎన్ని తీర్మానాలు
చేసుకున్నా, ఒక్కవాన చాలు చెరిపెయ్యడానికి.

ఏ కొండదారుల్లోనో వానపడుతున్నరాత్రి ఒకడివీ
కారులో ప్రయాణిస్తున్నట్టు నీ దేహంలో నువ్వు
ఇరుక్కుపోయావు,ఆగలేవు, ముందుకి పోలేవు
అలాగని తలుపుతెరుచుకుని బయటకి రాలేవు.
----------------16.8.2013

మంచివాన - Sriramoju Haragopal


వాన వాన వానవాన వానావానా
వాన వాన వానవాన వానావానా
నన్ను నిన్ను మనల కలిపి
బతికించే వాన
అందరి కడుపులకు మెతుకు
కనిపెంచిన వాన

గుప్పుమన్న మట్టిగుండె పరిమళాలవాన
కప్పుకున్న నేలపచ్చ పచ్చడాలవాన
మావూరికి తరలివచ్చు పెళ్ళిగుంపువాన
మీవూరి మొగులు మీద నీటిగొడుగు వాన

నింగి నేల కలిపి పాడు నీటివీణ వాన
పొంగిపొరలు నదుల ఎదల సంగీతం వాన
వరిపొలాల పంటగొలుసు మురిపించే వాన
తరతరాల మానవసంస్కృతికి జాడ వాన

మూగబాసలెన్నో మాటలైన వాన
మనసుగాలి మళ్ళగానె తొణుకులాడు వాన
కలలవసంతాలు నేల దిగివచ్చిన వాన
కలకాలం మనుషుల్లో మంచితనం వాన
(అముద్రితం-2004)
15-08-2013