Saturday, June 22, 2013

|||శ్రీకాంత్|| వర్షం

వర్షం ఎప్పుడు కురుస్తుందో నీకేమైనా తెలుసా-?
మబ్బ్లులు కమ్ముకున్న మధ్యాహ్న సమయంలో, ఆకాశంలో వొంటరిగా తిరుగాడే డేగకు తెలియదు, లేదా తలపై పుస్తకాలు ఉంచుకుని, చెట్ల కిందుగా హడావిడిగా వచ్చే అమ్మాయికి కూడా తెలియదు-

తను ఒక నల్ల గులాబి. కదిలే, మాట్లాడే నల్ల గులాబీల పొద. క్లుప్తంగా, తను మెలికలు తిరుగుతూ ప్రవహించే నల్ల గులాబీల నది. తను ఒక తుంపర కూడా-

"జీవితంలో స్పష్టంగా ఉండాలి. నాకేది కావాలో నేను కూడా నిర్ణయించుకోవాలి కదా - నేను జీవితంలో స్పష్టంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. సాధ్యమయినంత స్పష్టంగా - ఇతరులకు అస్పష్టంగా ఉన్నా సరే. అది సరే, నువ్వెందుకు ఎప్పుడూ నైరాశ్యంగా కనిపిస్తావు? తను అడిగింది.

నేను తిరిగి ప్రశ్నించాను: వర్షం ఎప్పుడు కురుస్తుందో నీకేమైనా తెలుసా?

తను తల ఊపింది. ఎటు వైపో జ్ఞాపకం లేదు. వర్షానికి తడుస్తున్న రాయిలా తన ఎదురుగా కూర్చున్నాను పచ్చికలా, నీటికి నానిన పచ్చిక మైదానంలా శరీరం విస్తరించి, తిరిగి అంతలోనే, ఎడారిలా దేహం దప్పికతో పరచుకుంటుంది. ఎల్లా అంటే, దేహంలో నెత్తురు పిడచ కట్టుకు పోయినట్టుగా.-

మరి తనేమో నడిచే వర్షం. అదే చెబుతాను తనతో. నువ్వు గులాబీవి కాదు, గులాబీ రేకుల వర్షానివి,కాదు కాదు ఒట్టి వర్షానివి అని. అప్పుడు విరగబడి నవ్వుతుంది తను. "Metaphors". మబ్బులు పగిలి మెరుపులతో చిట్లినట్టు తను మళ్ళా నవ్వి చెబుతుంది: " సరే, నేను వెడుతున్నాను. నువ్వూ ఇష్టమే కానీ, ఎప్పటికీ వర్షం కురుస్తూనే ఉండదు ". నేనూ నవ్వాను. కానీ అది ఎడారి గాలి. నేను అన్నాను: "కానీ నాకు ఎప్పటికీ కురిసే వర్షమే కావాలి, మరే వర్షమూ కాదు." తను నవ్వి వెళ్ళిపోయింది. అతను అనువదించుకోలేకపోయాడు. నవ్వు - వర్షం. ఎవరైనా

వర్షాన్ని అనువదించగలరా? పోనీ, వర్షంలోని ఒక చినుకునైనా? వర్షంలో తడిచే భూమీ చెప్పలేదు. భూమిపై వీచే మొక్కలూ చెప్పలేదు. మొక్కలపైకి వంగిన వృక్షాలూ చెప్పలేదు. ఏదీ అనువదించలేని, చెప్పలేని వర్షం. మరి ఇంతకూ, వర్షం ఎప్పుడు కురుస్తుందో మీకేమైనా తెలుసా? మబ్బుల నీడ కమ్ముకున్న మధ్యాహ్న సమయంలో

వర్షంలో వంటరిగా తిరుగాడే డేగకీ తెలియదు. తలపై పుస్తకాలు ఉంచుకుని, చెట్ల కిందుగా హడావిడిగా వచ్చే అమ్మాయిని గమనించే నాకూ తెలియదు!
------------------------------
---------------
23/06/2013