Friday, August 29, 2014

జడివాన


_______అరుణ నారదభట్ల

ఇంకా నిర్ధారణ కాలేదు
ఆకాశం ముక్కలైందని!

కొన్ని నీటి తెప్పలు
పరుగెత్తి కూలినపుడు
పైపై మట్టి చల్లబడుతుంది
కానీ లోపలి నిశ్శబ్దంలో
దాగున్న లావా...
భూమి పొరల్లో
కదలాడుతూనే ఉంటుంది!

ఈ వానకు చిగురు కూడా
తునాతునకలవుతుంది!
సున్నితంగా తడవాలనుకుంటాం..
సందుల్లో మురికి కాలువ
ముంచేస్తే ఎవరికి ఇష్టమవుతుంది

ప్రశాంతత నిండుకున్న గడ్డి మైదానంలో
రెండు చేతులూ చాచి
చినుకులను వొంటికద్దుకోవడం
ఎంతటి ప్రియమైన స్పర్శ!

ఏదైనా... తడిసిపోవడమనుకొని
మురికినీటినీ తడేనని భ్రమిసిపోలేము
కానీ కొన్ని సార్లు తడుస్తూనే ఉంటాం!

వర్షం స్వచ్చమైన నీరులా కురిస్తే
మనసు వెన్నెలవుతుంది
కఠినజలం కురిస్తే
సారం కోల్పోయి నిర్జీవమవుతుంది!

మేఘం ఎప్పుడూ ఉరుముతూ
కటిక చీకటై సందడి చేస్తూనే ఉంటుంది!
కురవని మబ్బుకు మెరుపెక్కువ
కలవని దిక్కులకు కలతెక్కువ!

సమశీతోష్ణ మైదానంలా
నాలుగు డిగ్రేల కోసారి
రేఖాంశపు సరిహద్దును స్పృశిస్తూ
సమయానికి తగు వాతావరణంలో అక్షాంశమైపోవడం

ఈవానకు నేలంతా తడితో చిత్తడై
గుబురుటాకులను కప్పుకున్న తీగలా
పచ్చదనాలను వొంటపట్టించుకుంటుంది!
ఇంకా ఎన్ని రకాల తడిసేదుందో భూమి
చేజారిపోయేలోపు!

28-8-2014