Thursday, August 1, 2013

చినుకు పాట - వర్చస్వి


పట్టుకున్న ఈ చినుకు పాట ఇప్పట్లో వదిలేలా లేదు
మసక మసక ముసురులా!

సంద్రంలో బడబాగ్ని ముడుచుకుని
పడుకుంటుందంటే నే నమ్మలేదు ఇప్పటివరకూ-

ఈ ముసురు చినుకు ఇంతలేసి అగ్గి శిఖలై
నన్ను మసి చేస్తుంటే అర్ధమౌతోంది ఇప్పుడు

నిప్పుకీ నీటికీ 
మనువెంతో మనోహరమని!

ఎంత వింతో కదా-

సంద్రంలా నీ ప్రేమ కప్పేసినప్పుడు
ముడుచుకు పడుకున్నా!

ఇప్పుడు ఆగిపోయిన నీ పాట చినుకుతో 
ఏ సుందర సంద్రాలకావలో
నన్ను చేయి పట్టుకు తీసుకెళ్తుంటే
బడబాగ్నిలా రగులుతున్నా!

---------------------------------------//02.08.2013//

1 comment:

  1. నా చినుకు పాటని మీ బ్లాగ్ సంద్రం లోకి ఆప్యాయంగా మళ్లించినందుకు నా ధన్యవాదాలు జాన్ హైడ్ కనుమూరి గారూ! అయితే ఆ రచన తేదీ ని 02.08.2013 గా చదువుకోవాల్సిందిగా ప్రార్ధన! అన్నట్లు ఈ మీ బ్లాగు సుందరి చాలా అందంగా ఉంది. కంగ్రాట్స్!

    ReplyDelete