Wednesday, October 23, 2013

ఒక వాన-కొన్ని ఊహలు -Raghavareddy Ramireddy



..
ముసురు పడుతుంది. మబ్బులు నేలతో అలా తడితడిగా ఊసులాడుతూనే ఉంటాయ్ .ఇంటిముందున్న పసుప్పచ్చని పూలచెట్టు అదేపనిగా స్నానం చేసీ చేసీ అందంగా అలసిపోతుంది.
ఒక చల్లటి గాలి అలా బరువుగా వచ్చి పలకరిస్తుందా.. నాలో కదుల్తోన్న నీ ఙ్నాపకాల నులివెచ్చదనం సోకి ఇలా తేలికవుతుంది. నిన్ను చూడాలన్పిస్తుంది నాకు.
బయల్దేరుతాను నీ సమ్మతి కోరకుండానే. "ఇంత వానలో ఇలా తడుస్తూ ఈ రావడమేంటి బాబూ"అంటావు. పై పై మాటలే గదా అవి. నిజం మాటలు నీ కళ్ళలోంచి వినిపిస్తాయ్.
పక్కన కూర్చుని నీ అరచేతిని అపురూపంగా అందుకుంటానా. .కాస్త పైకెత్తుతానా. .కొంచెం కిందకు వొంగి తడితడి గా ఆ చేతికి ప్రణమిల్లుతానా.. అప్పుడా చేతి నుంచీ వినిపిస్తాయా మాటలు "భలే వచ్చావ్.. ఎంత బావుందో నీ రాక!"
...

కాస్త ఇటు తిరిగి "చెప్పు ఏం చేద్దాం" అంటావు. ఊరికే నవ్వుతాను. కళ్ళనుండీ, పెదవుల నుండీ, సమస్త శరీరం నుండీ పరిమళించిన నీ నవ్వు ఒక పరమాద్భుత విన్యాసమేదో చేస్తుంది. చిన్నప్పుడు చేసుకున్న తామరకాడల దండను తెచ్చి నా మెళ్ళో వేస్తుంది.
...
అనంతస్వచ్చమైన ప్రేమ మన లోతుల్లోంచి అలా అలా మాటలై తేలివస్తుంది.ఎటు చూసినా ప్రవహిస్తోన్న నీళ్ళమీదుగా మన బుల్లి పడవేసుకుని మనం బయలుదేరుతాం.
"
ఇదిగో ఈ కొంగ చూడు.ఇది భలే పరిచయం నాకు.ఇదిగో ఈ చోటు చూడు.ఈ చెట్లు. .ఈ పొలాలు..-నీ లోకమంతా నాకు పరిచయం చేస్తావు..గొప్ప మురిపెం తో.. మనసు కళ్ళను విప్పార్చుకుని అన్ని లోకాలనూ నీలోనే నేను చూస్తుంటాను..
...

ఒక మాట..ఒక స్పర్శ..వేలాది పువ్వులు..-ముసురలా కొనసాగుతూనే ఉంటుంది.

1 comment:

  1. ప్రేమవర్షంలా ఉంది. బాగుంది :)

    ReplyDelete