Showing posts with label రేణుక అయోల //అడవిలోతడి వెన్నెల. Show all posts
Showing posts with label రేణుక అయోల //అడవిలోతడి వెన్నెల. Show all posts

Friday, November 29, 2013

రేణుక అయోల //అడవిలోతడి వెన్నెల



ఓ వర్షపు మేఘం అడవిలో తప్పిపోయింది
నీటి చినుకులు నదిని కనుకున్నాయి
ప్రవహించే నది వృక్షాలని కౌగలించుకొని
చీర చెంగులా చుట్టుకుని
ఆకుల కిరీటాల్ని మోసుకుంటూ వెళ్తుంటే

నదిపైన వంతెన చెట్టుకి గట్టుకిదారివేస్తూ
నదిని రెండుభాగాలు చేసింది
ఒకటైన నది రెండు వైపులా కనిపిస్తోంది
వర్షం ఆకాశంలో ఆగిపోయింది

పొగమంచు దుప్పటిలో దూరిన అడవి
ఆ చీకటిని నేనే అనుకుంది
చీకటి అడవిని కనుగొన్నాను అంది
చంద్రుడు దారి తప్పి అడవిలోకి రాగానే
ఇద్దరు సిగ్గుపడి
వెన్నెలని ఎవరు పంపారో కదా
చలిని, వేడిని, తీసుకువచ్చింది అనుకున్నాయి

నది మాత్రం
నేను అక్కడనుంచి తీసుకొచ్చి
ఇక్కడ పడేసాను అనుకుంది
వెన్నెల అమాయకంగా
నదిని, ఆకులని, చెట్లని పలకరించి
చీకటి దూరిన ఆడవికి
తెల్లని పరదాలు కట్టి
వర్షం వెలిసిన తడి దారుల వెంట ప్రయాణిస్తూనే వుంది..