Showing posts with label వానకలిసిన సముద్రం. - రేణుక అయోల. Show all posts
Showing posts with label వానకలిసిన సముద్రం. - రేణుక అయోల. Show all posts

Friday, June 27, 2014

నిన్న పొద్దున్న ఇక్కడ వాన కురిసింది


ఒంటరిగా పచ్చని గడ్డిమీద అందంగా పేర్చిన రాళ్లమీద
నీలి గడ్డి పూలమీద, మెత్తగా సాగిపోయే కార్లమీద, అప్పుడే వాలిన పక్షులరెక్కలమీద, వాన కురిసింది
అంతా నిశ్శబ్దంగా తెరలు తెరలుగా వాన ఒంటరిగా కురిసి వెళ్ళిపోయింది

అప్పుడే ఈ వాన నా దేశంలోని వానని గుర్తుకుకి తెచ్చింది వేడితో తల్లడిల్లిపోయే మనుషుల మీద
రాలే చినుకులు అపురూపం, ఎండిన భూమిని తడిపే వాన సంతోషం అందరిదీ హఠత్తుగా కురిసే వాన
చిత్రం గమ్మతైనది. గొడుగులు అవసరం ఎప్పుడు రాని వాన రాగానే చెట్లకిందికి పరుగెత్తే జనం,
నడుస్తూ వానకి దొరికి పోయి తడిసి పోయిన బట్టలతో సిగ్గుపడే జనం, బైక్ లమీద వానకి తడుస్తూ
కళ్లమీద జారే నీటి చినుకులతో ముఖాలని చిట్లించుకునే జనం, చిన్న వానకే పొంగి పొరలే నాలాలు
మురికి నీటి కాలువలు ఎంత సందడి ఎంత అల్లరి ..

ఇక్కడ మాత్రం ఒంటరిగా బిక్కు బిక్కుమని
కురిసి నా కళ్ళకి అందాన్ని ఇచ్చి వెళ్ళిపోయింది .......

Monday, July 22, 2013

వానకలిసిన సముద్రం. - రేణుక అయోల



వెలియనివాన ఎండని కమ్మేసి చలిచలిగా నగరంలోకి
అడుగుపెట్టడం బాగుంది
జల్లులుగా నేలని అల్లుకుని
ఆగని, వాన చినుకులంటే అంటే ఇంకా ఇస్టం.

ముసురు మబ్బులు కాఫీ కప్పుని చేతులోవుంచేసి ఆలోచనలకి ఆవిరినందిస్తాయి
చినుకులు నదుల వరదలు తలవంచుకుని "కాదల్"కడలిలో కలిసిపోతే
తూఫాన్ ఇసుకగుడులని మింగేస్తుంది
గవ్వలేరుకునే మనుషుల బాల్యం
జాడలేని "ఇష్క"కి కహానిలా అయిపోతుంది

”సాగర్కి లహెరే” సవరించలేని ఉంగరాల ముంగురులు అణిగిపోయాయి
నీళ్ళని చిమ్మేసి రహదారులని ఉప్పుటేరులని చేస్తుందని భయం
కనీళ్ళతో పోటిపడే కాటు ఉప్పుని రుచి చూపిస్తుందని వెఱపు

సముద్రతీరంలో ఇసుకమేటలలో కూరుకుపోతూ ”ఆజా తు పాస్..పాస్ గుజారిశ్..పాటపాడితే
”గుంజుకున్నా నిన్నే యదలోకి"బదులిచ్చే అంత్యాక్షారీలు
ఇసుక మడులలో లంగరేసుకున్న పడవలు
 ఫోటోలకి ఫొజులిచ్చే ఇళ్లని
నిమిషంలో మింగేసి తీరాన్ని ముక్కలుచేసి వెనక్కి వెళ్ళిపోదుకదా..

ఈవాన వెలియకపోతే
సంద్రంలో చంద్రుడు మునిగిపోయి
వెన్నెల చిన్నచిన్న వెండిరేకుల్లా అలల మీద తేలవుకదా
నేలని అల్లుకునే వాన చినుకులు ఇస్టం
వానవెలిసేదాక ఆలోచనలన్నీ అక్కడే జాలరి వలలో చేపలు.

.................................................................23-7-2013