Wednesday, October 23, 2013

ఒక వాన-కొన్ని ఊహలు -Raghavareddy Ramireddy



..
ముసురు పడుతుంది. మబ్బులు నేలతో అలా తడితడిగా ఊసులాడుతూనే ఉంటాయ్ .ఇంటిముందున్న పసుప్పచ్చని పూలచెట్టు అదేపనిగా స్నానం చేసీ చేసీ అందంగా అలసిపోతుంది.
ఒక చల్లటి గాలి అలా బరువుగా వచ్చి పలకరిస్తుందా.. నాలో కదుల్తోన్న నీ ఙ్నాపకాల నులివెచ్చదనం సోకి ఇలా తేలికవుతుంది. నిన్ను చూడాలన్పిస్తుంది నాకు.
బయల్దేరుతాను నీ సమ్మతి కోరకుండానే. "ఇంత వానలో ఇలా తడుస్తూ ఈ రావడమేంటి బాబూ"అంటావు. పై పై మాటలే గదా అవి. నిజం మాటలు నీ కళ్ళలోంచి వినిపిస్తాయ్.
పక్కన కూర్చుని నీ అరచేతిని అపురూపంగా అందుకుంటానా. .కాస్త పైకెత్తుతానా. .కొంచెం కిందకు వొంగి తడితడి గా ఆ చేతికి ప్రణమిల్లుతానా.. అప్పుడా చేతి నుంచీ వినిపిస్తాయా మాటలు "భలే వచ్చావ్.. ఎంత బావుందో నీ రాక!"
...

కాస్త ఇటు తిరిగి "చెప్పు ఏం చేద్దాం" అంటావు. ఊరికే నవ్వుతాను. కళ్ళనుండీ, పెదవుల నుండీ, సమస్త శరీరం నుండీ పరిమళించిన నీ నవ్వు ఒక పరమాద్భుత విన్యాసమేదో చేస్తుంది. చిన్నప్పుడు చేసుకున్న తామరకాడల దండను తెచ్చి నా మెళ్ళో వేస్తుంది.
...
అనంతస్వచ్చమైన ప్రేమ మన లోతుల్లోంచి అలా అలా మాటలై తేలివస్తుంది.ఎటు చూసినా ప్రవహిస్తోన్న నీళ్ళమీదుగా మన బుల్లి పడవేసుకుని మనం బయలుదేరుతాం.
"
ఇదిగో ఈ కొంగ చూడు.ఇది భలే పరిచయం నాకు.ఇదిగో ఈ చోటు చూడు.ఈ చెట్లు. .ఈ పొలాలు..-నీ లోకమంతా నాకు పరిచయం చేస్తావు..గొప్ప మురిపెం తో.. మనసు కళ్ళను విప్పార్చుకుని అన్ని లోకాలనూ నీలోనే నేను చూస్తుంటాను..
...

ఒక మాట..ఒక స్పర్శ..వేలాది పువ్వులు..-ముసురలా కొనసాగుతూనే ఉంటుంది.

జీవనది - Mercy Margaret




వర్షం పడుతుంది
ఆయనా.. నాతో మాట్లాడుతున్నాడు.
ఎడతెరిపి లేని వానలా కురుస్తున్న ఆయన మాటల్తో
ఎండిన నేలలా నోరు తెరిచిన హృదయం
దాహం తీర్చుకుంటుంది.

ఆయన మాట్లాడుతున్నాడు వానా పడుతూనే ఉంది
హృదయారణ్యంలోని ప్రతి మూలల్లో మాటలు వర్షిస్తున్నాయి
ప్రతి నేలని చదును చేస్తున్నాయి
ఎండిన ప్రతి మోడు చిగురిస్తు౦ది
రాలిన ఆకుల చోట కొత్త జీవం చిగురిస్తుంది
ప్రతి అణువు చెట్టులా మారి పాటలు పాడుతుంది

వర్షం పడుతుంది, ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు
విరిగిన ఎముకలన్నీ ఆ మాటలు వింటున్నాయి

ఆయన మాట్లాడాడు లేచి బయటికి రమ్మన్నాడు
శవం ఇప్పుడు శవం కాదు. మళ్ళీ జీవం ఉన్న మనిషి
కరిగిపోయిన ప్రతి కన్ను చూసేలా ఆయన మాట్లాడాడు
చనిపోయిన ప్రతీది నిత్యత్వం పొందుతుంది
ఆయన మాట్లాడుతున్నాడు
వర్షంలా
చినుకుల్లా కురిసే మాటలు నదులయ్యాయి
ఆ నది
జీవనది
ప్రవహిస్తూ నన్ను ముంచింది

అదో ... చూడు ఇప్పుడు
నీవైపే..
నీవైపే వస్తుంది.
____________ (23/10/2013)_

Saturday, September 21, 2013

వర్షా కాలం - కె.ఎన్.వి.ఎం.వర్మ



సాయంత్రం నాలుగుగంటలకే
చీకటి ముసురుకుంది ఆకాశం.
చల్లగాలికి పులకరించి ఒళ్ళు

ఉరుముకి జలదరించింది.
మెల్లగా, చిన్నగా చినుకులు
నన్ను తడపడం మొదలుపెట్టాయి.
అల్పపీడనం అని మద్యహాణమే
ప్రకటించారు అందుకేనేమో
సముద్రమంత అల్లకల్లోలంగా ఉన్నాను.
రహదారుల్లోంచి లేచిన ధూళి
వాహనాల్లోంచి వచ్చిన కాలుష్యం
కరిగి కాస్త మనసు తేలికపడినట్టేవుంది
కానీ కాళ్ళ దగ్గర చూస్తే,
నిండి పోయిన మురుగు బోది
రోడ్లన్నీ కాలువలై పారి దుర్గందం వ్యాపించింది.
చివరికి ఈ వరద నీరంతా
సముద్రానికి చెందవలసినదే కానీ,
వర్షాకాలం కదా...
నేను తడుస్తూనే ఉన్నాను.....20.09.2013.






Wednesday, September 18, 2013

చిక్కు ప్రశ్న - నంద కిషోర్



వాగు వయ్యారంగా
ఒంపులు తిరగడం చూస్తుంటే

వరదెప్పుడొచ్చిందో-
వంపులన్నీ మాయం..!

వర్షం జోరుగా కురుస్తోంది.

తడవాలంటే తనని కప్పుకోవాలి.
తప్పుకోవాలంటే ఒప్పించాలి.

ఏం చేస్తానో?!
(ఇప్పటికైతే చెప్పలేను..)
— ఫీలింగ్ కంప్యూజ్‌డ్ .

Tuesday, September 10, 2013

జోరున వర్షం





జోరున వర్షం

ఆసరా కోసం నా ప్రయత్నం

చెట్టు చాటున
నలుగురితో నేను

ఉరుములు మెరుపులు
వాటి మద్య నువ్వు
దేవ కన్యలా

అప్రయత్నంగా నా అడుగులు
నీ వైపు , తడిసిపోతున్న

మల్లి ఓ మెరుపు
ఒక్క సారి కనులముందు చీకటి
క్షణకాలం పాటు

మసక మసకగ చూపు
ఎక్కడ అని వెతుకుతూ ఉంటె
దానికి తోడు విజ్రుంభిస్తున్న గాలి హోరు

నిరాశ నిస్పృహలో నేను
కాన రాని ( నా రాణి) నువ్వు

తడిసిన తనువుతో
భారమైన గుండెతో
ఇంటికి నా పయనం
ఎప్పుడ కలగుతుందో నీ దర్శనం

రోజులు గడుస్తు ఉన్నాయి
నీ జ్ఞాపకం భారమై పోతు ఉంది
గుండెనే పిండేస్తు, నరాలనే లాగేస్తూ
పిచ్చి వాడిని చేస్తూ ఉన్నాయి

మల్లి కానవస్తావేమో అని
ప్రతి రోజు అక్కడే నీకోసం నిరీక్షణం
రాలేదు బాధతో ఇంటికి నా పయనం
కలుస్తవనే ఆశతో మల్లి ఆగమనం

కాల చట్రం గిర్రున తిరిగింది
పసి పాపతో పసి పాపల్లె నువ్వు
తన చేయి పట్టి నువ్వు
నీ చేయి పట్టి తను ( భర్త ) ?

బాధ లేదు
నీ పెదవుల పై ఆ చిరునవ్వు చూస్తూ ఉంటె
చంపేసాను
నాలోని నీ మీద పెంచుకున్న ప్రేమని
ఆ సంతోషమేగా నీలో చూడాలి అనుకుంది

నీ పై ప్రేమని సమాధి చేస్తూ
నాదనే జీవితానికి పునాది వేస్తూ
గడిపేస్తున్న కాలాన్ని
ఎప్పటిలా ఒంటరిగా
బాధ ఎక్కడ లేదు
ఏదో సాధించాను అనే గర్వం

మల్లి నీ తలపు లేదు ( ప్రేమలో )
ఆశిస్తూ ఉంటా ఎప్పటికి సంతోషంగా ఉండాలని ...........Rk .Bhagath

Monday, September 2, 2013

ఐస్ ముక్కల వానోస్తోంది ||పెరుగు సుజనరాం||




అప్పుడు నేను ఎనిమిదేళ్ళ చిన్నపిల్లని
ఓ తొలకరిలో
మబ్బులు కమ్మిన ఆకాశం
కారు చీకట్లు కమ్మని సాయంత్రం
పెళ పెళ మంటున్న ఉరుముల సడి
భయంతో అమ్మ కొంగు చాటున ఒదిగి
అర్జున,పల్గున అనుకుంటుంటే ,,,.......
మంచు రాళ్ళ వానోస్తోందీ
రా చెల్లీ ఆడుకుందాం అక్క పిలుపు
భయాలన్నీ మాయం
అమ్మ చెప్తున్న వడగండ్ల వాన ఇదే
అనుకుంటూ తూనీగలా
ఎగిరిన జ్ఞాపకం

మళ్ళీ ఇన్నాళ్ళకు
నాలుగు పదుల వయస్సులో
ఐస్ ముక్కల వానోస్తోంది అంటున్న
నా స్టూడెంట్స్ తో కలిసి
వదగండ్లను వేరుకోవటం
ప్రకృతి ప్రేమను అందుకోటం కై
మళ్ళీ నేను నా బాల్యం లోకి వెళ్ళాను

Monday, August 26, 2013

భార్గవి -బాల్యమా ఒక్కసారి తిరిగిరావూ..


అమ్మో...!
గాయాలేం తొలచటంలేదేంటో...
ఎపుడు గడచిపోయిందో కాలం
కళ్ళముందు కాంట్రాస్ట్ కలలా కదలాడుతోంది!

చిన్నప్పుడు ఇంటిముందు సందులో
గాలీ దుమారంలో ఆడుతుంటే
పీల్చిన మట్టివాసనింకా వస్తూనే ఉంది
సన సన్నటి వాన చినుకులు
ఎడతెరిపి లేకుండా కురుస్తుంటే
ఎవరేడుస్తున్నారా ...?! ఇంతసేపు
అనుకుని చిరాకేసేది!
అప్పటి నా కన్నీళ్ళను ఆ చినుకులు
కప్పేసినపుడు ఆనందమేసేది!
చల్లని చినుకులను నిండుగా
గుండెకు హత్తుకునేదాన్ని!
వాటికి తోడు
ఆకాశంలో ఉరుములు, మెరుపులూ...
ఇత్తడి లంకె బిందెలను ఎత్తుకుని
మువ్వలు కట్టుకున్న ఎడ్లబండి
సాగిపోతున్నట్లు వినిపించేవి
వీధి వీధంతా కలయచూసి
వానల్లో స్నానం చేస్తున్న కప్పలమీద
విసుగ్గా రాయి విసిరేదాన్ని!

వర్షం వచ్చిన రాత్రి(చందమామ)బూచిమామ
ఆకాశంలో మబ్బుల చాటున దాక్కుని
అప్పుడప్పుడు నవ్వుతూ
మెరుపులతో ఫోటోలు తీస్తుంటే
నేను తప్పించుకు తిరిగే దాన్ని!!

ఎప్పుడు గడచిపోయిందో కాలం!
గిర్రున తిరిగి తిరిగి వచ్చి
కంటిపాప చాటునుండిపుడు
నక్కి నక్కి చూస్తోంది!
చుట్టూ చీకటి చూడగానే
బాల్యం బిక్కు బిక్కుమంటూ
కాలాన్ని కప్పుకుని నిధ్రపోయిందట!

బాల్యమా ఒక్కసారి లేచి తిరిగిరావూ...!
అదే మట్టితో మళ్ళీ ముచ్చట్లాడుదాం
జారిపోయిన ఊసులన్నీ గాలం వేసి పట్టి
గుండెలకు అతికించుకుందాం!!