Saturday, August 30, 2014

అమ్మమ్మ -వాన - Bvv Prasad



1
'అమ్మమ్మా వాన పడుతోంది '
ఆరుబయట పక్కలో పడుకొన్న మనవడు ఉలిక్కిపడినప్పుడు
'పడనీరా చల్లగా ఉంటుంది ' అన్న అమ్మమ్మ మాట
అతని జీవితానికొక చూపునిచ్చింది
వానకి భయపడి ఇంటిలోకి పరుగెట్టనక్కరలేదు
వానలో తడవటం బావుంటుంది
దయలాంటి వానకి , ప్రకృతిలోని అందమంతా కరిగి నీరై పడేవానకి
నిన్ను అర్పించుకోవటం బావుంటుంది
మట్టివాసనల్ని మేల్కొలుపుతూ
నిన్ను ఆర్ద్రతలోకి చల్లగా నడిపించే వానపట్ల,
వానలాంటి జీవితంపట్ల ఉండాల్సింది భయం కాదు, ప్రేమ

2
అమ్మమ్మ దేనినీ ధిక్కరించలేదు
ఎవరినీ ఎప్పుడూ గద్దించగా చూడలేదు
భూమిలాంటి అమ్మమ్మ
అంత ఉమ్మడికుటుంబానికీ కేంద్రమై కూడా
తనని నేపధ్యంలోనే నిలుపుకొంది
తాతయ్య తడినిండిన మేఘగర్జనలకి
ఆమె బెదురుతున్నట్లుండేది కాని
ఆమె బెదిరేమనిషి కాదని తాతయ్యకి తెలుసు
భయం చివర సమస్తజీవితాన్నీ దీవిస్తున్నట్టు విచ్చుకొనే
ఆమె చిరునవ్వు చూసిన మనవడికీ తెలుసు

3
జలధరంలాంటి ఉమ్మడికుటుంబం క్రమంగా
తెల్లని మబ్బుతునకలుగా చెదిరిపోయి
జీవితసహచరుడూ సెలవుతీసుకొన్న చివరిరోజులలో
కూతురు అమ్మయి రుణంతీర్చుకొంటున్నపుడు
అగాధమైన నిశ్శబ్దం నిండిన చూపులతో
చివరిరోజులోకి భయంలేక ప్రయాణిస్తున్నట్లుండే
ఆమె జీవస్పందనలని గమనించినప్పుడల్లా
యవ్వనపుతొందరల మధ్యనున్న మనవడు
అమ్మమ్మ ఏం ఆలోచిస్తుందీ అని విస్మయపడుతూనే ఉండేవాడు

4
ఒక ఉక్కపోసే సాయంత్రంలోకి చేరుకొన్న మబ్బులు
చినుకుల్లా కరిగి భూమిని నిశ్శబ్దంగా తాకుతుంటే
గదిలోంచి బయటకు వెళుతున్న మనవడితో ఆమె
'ఏమిటది, వానపడుతోందా ' అన్నపుడు
అతను ఊహించలేదు అవి తనతో ఆమె చివరిమాటలని
ఉక్కపోతతో నిండనున్న జీవితంలోంచి చివరి వానాకాలం వెళ్ళిపోనుందని

5
జీవితం అమ్మమ్మలా దయగలదీ, ఓర్పునిండినదీ
కాదని తెలుసుకొంటున్నా
దానిని ప్రేమనిండిన చిరునవ్వుతో ముగించటమెలాగో
ఆమెనీడలో పెరిగిన కూతురుకొడుకు నేర్చుకొంటున్నట్టే ఉన్నాడు
కనుకనే, దుఃఖపూరిత జీవితానుభవాన్ని
దయగల పదాల్లోకి అనువదిస్తున్నాడు

Friday, August 29, 2014

జడివాన


_______అరుణ నారదభట్ల

ఇంకా నిర్ధారణ కాలేదు
ఆకాశం ముక్కలైందని!

కొన్ని నీటి తెప్పలు
పరుగెత్తి కూలినపుడు
పైపై మట్టి చల్లబడుతుంది
కానీ లోపలి నిశ్శబ్దంలో
దాగున్న లావా...
భూమి పొరల్లో
కదలాడుతూనే ఉంటుంది!

ఈ వానకు చిగురు కూడా
తునాతునకలవుతుంది!
సున్నితంగా తడవాలనుకుంటాం..
సందుల్లో మురికి కాలువ
ముంచేస్తే ఎవరికి ఇష్టమవుతుంది

ప్రశాంతత నిండుకున్న గడ్డి మైదానంలో
రెండు చేతులూ చాచి
చినుకులను వొంటికద్దుకోవడం
ఎంతటి ప్రియమైన స్పర్శ!

ఏదైనా... తడిసిపోవడమనుకొని
మురికినీటినీ తడేనని భ్రమిసిపోలేము
కానీ కొన్ని సార్లు తడుస్తూనే ఉంటాం!

వర్షం స్వచ్చమైన నీరులా కురిస్తే
మనసు వెన్నెలవుతుంది
కఠినజలం కురిస్తే
సారం కోల్పోయి నిర్జీవమవుతుంది!

మేఘం ఎప్పుడూ ఉరుముతూ
కటిక చీకటై సందడి చేస్తూనే ఉంటుంది!
కురవని మబ్బుకు మెరుపెక్కువ
కలవని దిక్కులకు కలతెక్కువ!

సమశీతోష్ణ మైదానంలా
నాలుగు డిగ్రేల కోసారి
రేఖాంశపు సరిహద్దును స్పృశిస్తూ
సమయానికి తగు వాతావరణంలో అక్షాంశమైపోవడం

ఈవానకు నేలంతా తడితో చిత్తడై
గుబురుటాకులను కప్పుకున్న తీగలా
పచ్చదనాలను వొంటపట్టించుకుంటుంది!
ఇంకా ఎన్ని రకాల తడిసేదుందో భూమి
చేజారిపోయేలోపు!

28-8-2014

Wednesday, August 27, 2014

కడిగిన గోడ - కెక్యూబ్ వర్మ


రావి ఆకు చివర వేలాడే నీటి బొట్టు
స్ఫటికత కనులకింత ఓదార్పునిస్తూ

మొనదేలిన గడ్డి పోచ
పచ్చగా వాన నీటిలో నిటారుగా ప్రతిఫలిస్తూ

తార్రోడ్డుపై నల్లగా నిగనిగలాడే
తడితనం రిక్షా టైరుపై మరకలా మెరుస్తూ

తడిచిన కాకి గూడు చేరలేక
దాగిన బ్రహ్మజెముడు పొద బయటపడేస్తూ

తడిచిన దేహంతో పరుగున
దూడ తల్లి పొదుగులో దాగిపోతూ

వాన కడిగిన ఈ జైలు గోడపై ఆకాశాన్నింత దోసిట్లో
పోసి పావురం బొమ్మ వేస్తూ....

27/08/2014 (11:38PM)

Saturday, June 28, 2014

రుతుకవనాలు


ముందు రోజు రుతుపవనాలు చల్లిన కళ్ళాపికి
ఇంకా నిట్టూర్పులు విడుస్తున్న పృద్వి,
ఆక్సిజన్ అందక కూలబడ్డ చేపల రైతు చెమట
గాలిలో తేమ శాతాన్ని ఇంకా పెంచుతొంది.

ఫ్యాను రెక్కలు తోడుతున్న గాలి లోంచి
పెంచిన చార్జీలు పంపి శ్లాబు వెక్కిరించింది.,

ఈ రాత్రి తెలవారితే చాలనుకుంటూ
తీసిన తలుపుల్లోంచి వీధి దీపాల కాంతి
మూడు రోజుల నుంచి వస్తోందే మైనా! ఎక్కడా...
చిన్నగా చల్లగాలి తిరగ్గానే వచ్చింది

పట్టణంలో నీకేం పనని అడగ్గానే
కూజితాల రాగాల కులుకులు
పక్కింటి పసిబిడ్డ ఏడుపు ఆపగా
వాకిలో తిరుగుతున్న నా అరికాళ్ళ నిండా
కొల్లేరు కిక్కిస మేకల రంగు

మైనా! మైనా!
వర్షం ఎప్పుడు వస్తుందని అడిగితే
మానవా! మానవా!
తుఫాను పట్టినప్పుడని తుర్రుమంది....25.06.2014...28.06.2014.

Friday, June 27, 2014

నిన్న పొద్దున్న ఇక్కడ వాన కురిసింది


ఒంటరిగా పచ్చని గడ్డిమీద అందంగా పేర్చిన రాళ్లమీద
నీలి గడ్డి పూలమీద, మెత్తగా సాగిపోయే కార్లమీద, అప్పుడే వాలిన పక్షులరెక్కలమీద, వాన కురిసింది
అంతా నిశ్శబ్దంగా తెరలు తెరలుగా వాన ఒంటరిగా కురిసి వెళ్ళిపోయింది

అప్పుడే ఈ వాన నా దేశంలోని వానని గుర్తుకుకి తెచ్చింది వేడితో తల్లడిల్లిపోయే మనుషుల మీద
రాలే చినుకులు అపురూపం, ఎండిన భూమిని తడిపే వాన సంతోషం అందరిదీ హఠత్తుగా కురిసే వాన
చిత్రం గమ్మతైనది. గొడుగులు అవసరం ఎప్పుడు రాని వాన రాగానే చెట్లకిందికి పరుగెత్తే జనం,
నడుస్తూ వానకి దొరికి పోయి తడిసి పోయిన బట్టలతో సిగ్గుపడే జనం, బైక్ లమీద వానకి తడుస్తూ
కళ్లమీద జారే నీటి చినుకులతో ముఖాలని చిట్లించుకునే జనం, చిన్న వానకే పొంగి పొరలే నాలాలు
మురికి నీటి కాలువలు ఎంత సందడి ఎంత అల్లరి ..

ఇక్కడ మాత్రం ఒంటరిగా బిక్కు బిక్కుమని
కురిసి నా కళ్ళకి అందాన్ని ఇచ్చి వెళ్ళిపోయింది .......

Monday, June 23, 2014

మట్టి వాన- తిలక్ బొమ్మరాజు

నిన్న రాత్రి కురిసిన వర్షానికిఆరుబయటంతా ఒకటే మట్టి వాసనఎంత ఆపుదామన్నా గుండె పుటాల్లో జ్ఞాపకమై కూర్చుంది
పచ్చి ఆకులు ఒంటి నిండా తడిసిన తన్మయంలో ఓ తేనె పులకింత

అప్పుడో ఇప్పుడో అన్నట్టుగా తట్టి వెళ్ళే వసంతంలా ఓ పులకరింత

కారుమేఘాల మధ్య భళ్ళున ఓ శృతి మనసుకినసొంపుగా యదలోతుల్లో మరోవాటిక

రెక్కలు రాలిన పువ్వులెన్నో ఒంటరిదారి నిండా పరుచుకొనిఈవేళ తృప్తి చెందాయి ఈ వానకి

చీకటి ముసుగును అప్పుడే తొలగిస్తూ ఆకాశం ఇంకిన చినుకుల్ని రుచిచూపిస్తూ

దోసిళ్ళలో కాసిని ఇప్పుడే స్థిమితపడ్డాయి రహదారులన్ని కురచయిపోయాక

చిన్నప్పుడు వేసిన కాగితం పడవలు ఇంకా ఎక్కడో తిరుగాడుతున్నట్టుగా ఓ మధుర సంతకం ఈ వర్షంలో

మళ్ళా ఎప్పుడో గగనాన మేఘమధనంనా కళ్ళలో కొట్ల విత్తనాలు మొలకెత్తడానికి ఎదురు చూస్తూ


http://myblacksand.blogspot.in/2014/06/blog-post_23.html

Sunday, June 22, 2014

మృదువర్షధార…సారా టీజ్డేల్, అమెరికను ||by NS Murty||

ఓ రోజు వస్తుంది... సన్నని ధారలుగా వర్షం పడుతుంటే
నేల కమ్మని వాసనలేస్తుంటుంది,
పిచ్చుకలు కిచకిచలాడుతూ చక్కర్లు కొడుతుంటాయి;
రాత్రుళ్ళు చెరువులలో కప్పలు బెకబెకలాడుతుంటాయి;
పిచ్చిగా మొలిచిన అడవిరేగు పూలుతెల్లగా గాలికి వణుకుతుంటాయి
క్రిందకి వాలిన సరిహద్దు తీగలపై
ఎర్రని రెక్కల రాబిన్ లు ప్రేమసరాగాలాడుకుంటుంటాయి;
ఒక్కదానికీ యుద్ధం గురించి ఎరుక ఉండదు,
ఒక్కదానికీ యుద్ధం ఎప్పుడు అంతమయిందో పట్టదు.
చెట్టుకిగాని, పిట్టకిగాని బాధ ఉండదు
మానవజాతి సమూలంగా నాశనమయిందే అని.
సూర్యోదయంతోనే మేల్కొన్న వసంతం సయితం
మనం అక్కడలేమన్న విషయాన్ని ఏమాత్రం గుర్తించదు.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను.
There will come soft rains
.
There will come soft rains and the smell of the ground
and swallows circling with their shimmering sound;
And frogs in the pools singing at night
and wild plum-trees in tremulous white;
Robins will wear their feathery fire
whistling their whims on a low fence-wire;
And not one will know of the war, not one
will care at last when it is done.
No one would mind, neither bird nor tree
If mankind perished utterly;
And Spring, herself, when she woke at dawn
would scarcely notice that we were gone
.