Wednesday, April 3, 2013

ఒక చిన్న వాన - Sri Kanth K



---------------
పొరల పొరల ఎండ తెమ్మరలపై చల్లని గాలిని ఊదుతూ
వాన పడటం మొదలైతే

నా నాలుగేళ్ల పిల్లవాడు రివ్వున, పిచ్చుకలా పరిగెత్తి అలా
బాల్కనీలో నుల్చుని, ఇనుప
ఊచలలోంచి చేతిని చాపి- 'దా
దా, రమ్మంటుంటే' అని అరుస్తా

ఉంటే, నక్షత్ర ప్రసారాలు లేని ఓ
శాంతిమయ సమయంలో నేను
నా గదిలో కూర్చుని, ఇదేదో తొలిసారిగా ఇల్లులా ఉందే అని

అబ్బురపడే విస్మయంలోంచి తేరుకుని
ఆ నాలుగేళ్ల పిల్లవాడిని అడిగాను ఇలా:
'ఒరే అబ్బాయీ, ఎవరిని నువ్వు, అలా
నిలువెత్తు సంతోషంతో ఎగిరెగిరి పిలుస్తూ ఉన్నదీ?" అని అంటే

ఇక అ పిల్లవాడు, కళ్ళల్లో రంగురంగుల ఆకాశాలూ జలపాతాలూ
మెరుపులతో మెరుస్తా ఉంటే
భుజాలకి రెక్కలొచ్చి, అక్కడే
గిర్రుగిర్రున తిరుగుతూ చెభ్తాడు:

'వానని నాన్నా వానని. చూడ్చూడు నాన్నా చూడ్చూడు
నా వేళ్ళని ఈ వాన ఎలా కొరుకుతుందో' అని చెబితే, సరిగ్గా
అప్పుడే ఒక ఇంద్ర ధనుస్సుగా మారిన

గూటిలో కూర్చుని, తడిచిన రెక్కలని
విదుల్చుకుని, ముక్కుతో మెడ కింద
రుద్దుకుంటూ ఇదిగో ఇలా ఈ పదాలు రాస్తున్నాను, శరీరం

అంతా నిండిపోయి, వేణువోలె మ్రోగే
గాలితో చెట్లతో రాలే ఆకులతో దారి
పక్కగా సాగే నీటిపాయలతో ఊరికే

చల్లగా పరచుకున్న మీ హృదయాల వంటి నీడలతో, ఇక
అంతిమంగా ఆగీ ఆగీ, అంచులని
వొదలలేక, వొదిలి వేసే చినుకులతో.

అది సరే కానీ, వర్షం పడిందా మీలో అక్కడ ఈ వేసవి సాయంత్రాన?
___________________________________________
*రాయొద్దని అనుకుంటూనే ఇది. -02-04-2012-

No comments:

Post a Comment