Wednesday, April 3, 2013

కాశిరాజు ||వానకురిసింది||




అద్దరాత్రి నిద్దర్లో మెలుకువోస్తే
ఎండిన తాటాకులపై వాన కురుస్తున్నచప్పుడు
అటూ ఇటూ తిరుగుతూ కంగారయ్యే నాన్న
మా కాళ్ళు తొక్కుకుంటూ నడుస్తాడు
ఏమవుతుందో తెలీదు

అడ్డంగా పడుకున్నానేమో అని లేచినుంచుంటాను
అడ్డు లెగరా! అని అమ్మవైపు తోస్తాడు
నువ్వు కూడా ఎల్లి నాన్నకి సాయంచెయ్ అన్నట్టు
ఒళ్ళో మాచెల్లినెట్టుకుని నా వైపు చూస్తుందామే.

నాన్న వెనకాలే నేను గుమ్మం దాటుతాను
చిటపటమంటూ చినుకులన్నీ
చీకటి నిండిన మా వాకిట్లో రాల్తాయపుడు .

కట్రాడుకున్న లేగదూడ తాడు విప్పేస్తాడు
పంచకొచ్చి నా పక్కనే నుంచుంటుంది.
పొద్దున్న ఆరేసిన పుల్లలన్నీ తడిసిపోతాయ్
పంచనపోగేసి పైన కప్పమని తాటాకొకటి నా చేతికిస్తాడు .

కోళ్ళగూడు తడిచిపోతుంది
అలాచూస్తావే
అమ్మనడిగి ఆ మైకాసంచి పట్రా అంటాడు
ఆమేమో
అక్కడే సూర్లోవుంది చూడమంటుంది.

దండెమ్మీద నా ఎర్రచొక్కా,బులుగునిక్కరూ
నాన్నను వాకిట్లోకి మళ్ళీ పిలుస్తాయ్
పరిగెట్టుకెళ్ళి పట్టుకొచ్చేస్తాడు.

ఏమయ్యోయ్
వాన ముదిరింది నీ అడావుడి చాలు
ఇంకా తడుస్తావే లోనికోచ్చేయ్ అంటుందామె .

వాన ఇంకాస్త ముదురుతూవుంటే
కిరసనాయిలుబుడ్డితో కబుర్లు చెబుతూ
ఆ అద్దరాత్రి అమ్మ ఒళ్లో నా చిట్టిచెల్లి నవ్వుతూవుంది
పిల్లల్ని పక్కలోకిలాక్కుని రెక్కలు కప్పుతూ
తల్లికోడి తల్లడిల్లుతూ మా పక్కనేకుచ్చుంది.

మా అందర్నీ శాసించే మారాజు తమ్మున్ని
తాటాకు సందుల్లో చినుకు దూరోచ్చి
వాడి వెన్నముద్ద బుగ్గల్నిముద్దెట్టుకుంటే
నిద్రలేస్తాడేమో అని కంగారుపడుతూ
చినుకురాలకుండా చెయ్యడ్డుపెడతాడు .

వానమానేదాకా ఆ చిత్రాన్ని చూస్తూ
ఒళ్లోకి చేరి నేను కళ్ళుమూస్తాను
మెల్లగా తెల్లారి కళ్ళు తెరిచేసరికి
రాత్రి మా ఇంట్లో ప్రేమకురిసిన సంగతి
నాకుమాత్రమే తెలిసి నవ్వుకుంటాను
రాత్రంతా నానిన చేతుల నా నెత్తిమీదేట్టి
నాన్న దేముడు నన్ను దీవిస్తుంటాడు.

-కాశిరాజు

No comments:

Post a Comment