Showing posts with label వాన ·. Show all posts
Showing posts with label వాన ·. Show all posts

Monday, June 3, 2013

శ్రీ || తొలకరి జల్లు ||





నల్లని మబ్బులు
నెమ్మదిగా ఆకాశాన్ని కమ్మేశాయి,
వెలుతురును మింగేసే చీకటిలా.

కృష్ణ మేఘాలను వెంటబెట్టుకొని
బయలుదేరిన శచీంద్రుని
ఐరావతం ఘీంకారాలు,
ముందు నడిచే భేరీమృదంగ ధ్వనులు.

ఈ ఋతువంతా మిమ్మల్ని వదలమంటూ
కరిమబ్బులని వెంటబడుతూ,
చుట్టుకుంటున్న విద్యుల్లతల మెరుపులు.

సాయం సంధ్యలో దేవసేనాని మయూరం
పురి విప్పినట్లుగా.
సప్తవర్ణాల ఇంద్ర చాపం కనువిందు చేస్తుంటే...

ఈ క్షణం కోసం ఐదు ఋతువుల కాలం
వేచి ఉన్న ధరిత్రి పులకరించేలా ,
ప్రకృతి పరవశించేలా...
వేసవి వేడి గాడ్పుల తాపానికి
పూర్ణ విరామం యిస్తూ...
నింగి నుంచి నేలకు నీటివంతెన వేస్తున్నట్లు
కురిసింది తొలకరి జల్లు. 
'శ్రీ' 03/06/2013

Thursday, May 30, 2013

సంగీతపు కాలం - Mercy Margaret

ప్రకృతి
సంగీత కచేరి మొదలు పెట్టే కాలం ఇది
చల్లటి స్పర్శను సాధన చేసి
చిక్కటి మట్టివాసన నింపుకుని
చి ట ప ట మ ని
ట ప ట ప మ ని వర్షపు సంగీతాన్ని సిద్ధం చేసుకొని
మళ్ళీ ఈ యేడు కొత్త ఋతురాగాన్ని ఆలపించవచ్చింది

సూర్యుడ్నెంత ఎంత మరగబెట్టిందో
అంత చల్లబరిచే దాక
సంగీతాన్ని చినుకులుగా
ఒలికిస్తూ
జ్ఞాపకాల కొత్త పాట నేర్ప సిద్ధపడుతుంది

వాన వాన వల్లప్పని పిల్ల జల్ల మురిసిపోతూ
చిన్న నాటి పాటలన్నీ మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తూ
తడారని జ్ఞాపకాల గాయాల్ని
తన సహచర్యంతో నయం చేయ వచ్చింది

మనసు మనసుని తడుపుతూ
మాట మాటని కుడుతూ
మండి ఎండిన గుండెలపై చినుకు భాషలాడుతూ
సంతోషాన్ని దోసిలి నిండా నింపే వాన కాలం వచ్చింది


30.05.2013