Tuesday, June 11, 2013

పేరంటం



ఒక్కో ఆకూ తీరిగ్గా మొహాలు కడుక్కొని తయారై .. 

పేరంటం కి వచ్చినట్టు ఉంది ..

 పిలిచింది వర్షం కదా మరి ..!!
                  --సాయి పద్మ

Friday, June 7, 2013

ఇంకో సాయం చేస్తావా మేఘమా? ||జ్యోతిర్మయి మళ్ళ ||


ఇప్పటికి గుర్తొచ్చానా 
సూర్యుని తాపంతో పోటీ పడలేక నొచ్చుకుని కూచున్నావేమో
మదినిండా నిండి ఉన్న మధురోహల పరిమళాలు
పోనీలే ఇప్పుడొచ్చావుగా
నీ హర్షమంతా వర్షమై ముగిసాక
8-6-2013

ఇలా పలకరించావు వానజల్లై ?

ఇవాళదాకా ఇసుమంతైనా ఇటు తొంగిచూడలేదు 
నీలి నీలి నీ అందాలు తిలకిస్తూ 
ఎవరికీ చెప్పక గుండెలోదాచుకున్న రహస్యమొకటి 
చలచల్లగా నువ్వొస్తే మెలమెల్లగా నీతో చెప్పాలని 
ఎంతగా ఎదురుచూసానో!

ఎండవేడికి ఆవిరయిపోతుంటే 
ఉస్సురంటూ కాలమీదుతూ..
ఎపుడైనా నువు కాసింత చల్లదనాన్ని తీసుకొచ్చి
నాపై చిలకరిస్తే పులకరించాలని
ఎంతగా ఆశపడ్డానో! 

నేలా, నేనూ ఏకమై స్వాగతం పలుకుతున్నాం నీకు 
ఇదిగో ఆరుబయట నీకందుబాటుగా కూచున్నా 
నాకంటే ముందు నిన్నందుకోవాలని 
బారగా తనకొమ్మల్ని చాచి ఆహ్వానిస్తూ బాదంచెట్టు
నువు పంపే నీటిచుక్కలన్నీ 
టపటపమని తననే ముందు పలకరిస్తున్నా 
మధ్యమధ్యలో ఆకుల్ని తప్పించుకుంటూ నామీదా 
వాలుతున్నాయి కొన్ని చినుకుపూలు 
నా ముఖాన్ని ముద్దుగా ముద్దాడుతూ 
ఊహలకొచ్చాయి మళ్ళీ తాజాదనపు రెక్కలు 
నాట్యం చేస్తున్నాయి పురివిప్పిన నెమళ్ళై 

పనిలోపని నాకోసం ఇంకోపని కూడా చేసిపెట్టు మేఘమా
నీ చల్లదనంతో కలిపి నా సంతోషాన్నీ మోసుకెళ్ళి
గుమ్మరించు నా ఇష్టసఖునిపై !

Thursday, June 6, 2013

చిటపట చినుకుల వాన.....!!


 
 
తొలకరి చినుకు పుడమిని తడిమితే.....!!
తొలి తొలి పలుకుల తీయదనం
అమ్మకు తెలిసిన చందమే....!!
చిరు చిరు జల్లుల చిత్తడి పుత్తడి
బుడి బుడి నడకల సవ్వడి ఆనందమే....!!
జోరువానల హోరుగాలి
పరుగులెత్తే పరువాల నయగారమే...!!
సప్త స్వరాల స్వరూపమే
సప్త వర్ణాల హరివిల్లు....!!
వడగళ్ళ వాతలు పిడుగుపాటులు
బతుకు నేర్పే పాఠాలు....!!
వాయుగుండాల వాయువేగం
చక్రాల సుడుగుండాలు....
అనుకోని అవాంతరాలే....
జీవిత కాలగమనంలో....!!
చిటపట చినుకుల వాన.....
చెప్పావు బతుకు పయనాన్న
 
 
http://naalonenu-manju.blogspot.in/2013/06/blog-post_6.html
 

తొలకరి పలకరింపు




తొలకరి పలకరించింది 
పుడమి తల్లి పులకరించింది
వేసవి వేడితో
ప్రఛండ భానుడి తాకిడితో
విలవిల లాడిన పుడమికి
జలాభిషేకం జరిగింది
గొంతెండుతున్న జీవరాశితో
మోడుబారుతున్న వృక్షజాతితో
కళావిహీనంగా మారిన పుడమి
తొలకరి పలకరింపుతో 
తన గాయాలను మరిచింది
నూతనత్వం సంతరించుకుంది

         -  తోట యోగేందర్

http://tyogendar.blogspot.in/2013/06/blog-post.html

Wednesday, June 5, 2013

వాన చినుకు - శిశిర వసంతం

 
మబ్బు చాటు వాన చినుకు
మంచుతెరలోంచి తొంగి తొంగి
మరుమల్లియ లాంటి నన్ను చూసి
మైత్రి చేయ మనసై
స్నేహ వీచిక ఒకటి రాయభారమంపింది
నాకు స్నేహ వీచిక ఒకటి రాయభారమంపింది
స్నేహ వీచిక నా చక్కిలి తాకి
సిగ్గులు నును లేత సిగ్గులు ఏవో నాలో పెంచింది
సోయగాలు పోతూ విషయమంతా చెప్పింది
నాకు విషయమంతా చెప్పింది
సిలకమ్మలా ఆరుబయట వాన కోసం ఎదురు చూడమని అంది

చెలిమి చేసే చినుకు కోసం
చిన్న పిల్లను అయ్యాను
అందం ఆరబోసా
పైటల తెరలు తీసా
పరువపు వేడి పెంచి
వయసును మరచిపోయా
చెంతకు చేరే చిరుచినుకుని చెంగులో పట్టి ఆడించేసా
చెంగు చెంగున చిందేసా
నే చెంగు చెంగున చిందేసా

చినుకు చినుకు కూ నాలో
చిలిపితనం నచ్చింది
చందమామ లాంటి చల్లదనం నచ్చింది
చంటి పాప మనసున్న మంచితనం నచ్చింది
చిరకాలం చెలిమి చేయాలనిపించింది
నాతో చిరకాలం చెలిమి చేయాలనిపించిందీ

ఒకే ఒక్క చిరు చినుకు గా మారి
తూరుపు సింధూరం లా నా పాపిట్లో చేరింది
అమృతమే తానై నా అధరాలపై తేలి ఆడింది
నా దాహార్తిని తీర్చేందుకు గొంతులోకి చేరింది
నాలో జీర్ణమై అణువణునా ఇంకిపోయింది
నాతో చిరకాలం కలిసుండాలనే
చిరు వాంఛను గెలిచింది

చినుకు అంటే చుక్కలాంటి నేనని
చుక్కలాంటి నేను అంటే చినుకని
వేరు వేరు కాము మేమని
నా కడ కట్టె కాలే వరుకూ కలసి ఉంటామని
చెలిమికి చక్కని భాష్యం చెప్పింది
చిత్రంగా విచిత్రంగా
చిన్న నాటి తీపి జ్ఞాపకాల సాక్షిగా ....... శిశిర వసంతం

Monday, June 3, 2013

వాన కోయిల - రేణుక అయోలా


ఈ వాన కోయిల బుజం మీదవాలి అడుగుతుంది
అప్పటి నాసామన్లు అన్నీ తిరిగి ఇచ్చేయమని

కాగితం పడవలు, సుడులు తిరిగే నీటిలో నాట్యం చేసే పాదాలు
చేయి అందక పోయినా అరచేతులు చాచి దాచుకున్న నీటిచినుకులు

తడిసిపోయిన మల్లే దండని, నీరుకారిన జడకోసలని విదల్చుకోని
కుంపటిలొ కాల్చే అప్పడం ఘుమఘుమలని అనుభవించిన సాయంకాలాన్ని

నీళ్లలొ జారిపోయి కాలి పట్టీ వెత్తుకునే నెపంతో మరోసారి తడిసి
తడిసిన  ఓణీని  గాలికి ఆరవేసిన  అందమైన క్షాణాలని

ఇచ్చేయమని అడుగుతోంది తన సామాన్లు తనకి ఇచ్చేయమని
వానకోయిల ఈ రోజు ఈ వానకోయిల.... 
 
ఈ వాన కోయిల బుజం మీదవాలి అడుగుతుంది
అప్పటి నాసామన్లు అన్నీ తిరిగి ఇచ్చేయమని

కాగితం పడవలు, సుడులు తిరిగే నీటిలో నాట్యం చేసే పాదాలు
చేయి అందక పోయినా అరచేతులు చాచి దాచుకున్న నీటిచినుకులు

తడిసిపోయిన మల్లే దండని, నీరుకారిన జడకోసలని విదల్చుకోని
కుంపటిలొ కాల్చే అప్పడం ఘుమఘుమలని అనుభవించిన సాయంకాలాన్ని

నీళ్లలొ జారిపోయి కాలి పట్టీ వెత్తుకునే నెపంతో మరోసారి తడిసి
తడిసిన ఓణీని గాలికి ఆరవేసిన అందమైన క్షాణాలని

ఇచ్చేయమని అడుగుతోంది తన సామాన్లు తనకి ఇచ్చేయమని
వానకోయిల ఈ రోజు ఈ వానకోయిల....
 

శ్రీ || తొలకరి జల్లు ||





నల్లని మబ్బులు
నెమ్మదిగా ఆకాశాన్ని కమ్మేశాయి,
వెలుతురును మింగేసే చీకటిలా.

కృష్ణ మేఘాలను వెంటబెట్టుకొని
బయలుదేరిన శచీంద్రుని
ఐరావతం ఘీంకారాలు,
ముందు నడిచే భేరీమృదంగ ధ్వనులు.

ఈ ఋతువంతా మిమ్మల్ని వదలమంటూ
కరిమబ్బులని వెంటబడుతూ,
చుట్టుకుంటున్న విద్యుల్లతల మెరుపులు.

సాయం సంధ్యలో దేవసేనాని మయూరం
పురి విప్పినట్లుగా.
సప్తవర్ణాల ఇంద్ర చాపం కనువిందు చేస్తుంటే...

ఈ క్షణం కోసం ఐదు ఋతువుల కాలం
వేచి ఉన్న ధరిత్రి పులకరించేలా ,
ప్రకృతి పరవశించేలా...
వేసవి వేడి గాడ్పుల తాపానికి
పూర్ణ విరామం యిస్తూ...
నింగి నుంచి నేలకు నీటివంతెన వేస్తున్నట్లు
కురిసింది తొలకరి జల్లు. 
'శ్రీ' 03/06/2013