Sunday, August 25, 2013

A poem for today:-వాడ్రేవు చినవీరభద్రుడు






ఒక ఉర్దూమహాకవి గుండెచప్పుడులాగా
రాత్రంతా వాన. నిద్రపట్టనివ్వని ప్రేమతో
మీర్ విలపిస్తే, మరీ అంత బిగ్గరగా
ఏడవాలా అనే పొరుగువాడి సణుగుడు.

ఒకే ఒక్క తంత్రిమీద జీవితకాలరక్తినీ
విరక్తినీ సాధనచేస్తున్న నిర్విరామధ్వని,
పల్లెల్లో అపరాహ్ణాల తీరికలో గృహిణులు
ఒకరికొకరు నోరారావెళ్ళబోసుకునే సొద

వరిమొలకలు ఊడ్చినతరువాత రైతుకి
వానతోతప్ప మరిదేంతోనూ పనిలేనట్టే,
నాతో తప్ప మరిదేంతోనూ పనిలేనట్టు
నా కిటికీపక్క రాత్రంతా వ్యాకులరాగం

Thursday, August 15, 2013

వాడ్రేవు చినవీరభద్రుడు



ఏ రాత్రిమధ్యనో దేహాంగాల్లోంచి ప్రేమ పొంగినట్టు
వాన. తెల్లవారేవేళల్లో ఏటిఒడ్డున అడవిదున్నలు
నీళ్ళుతాగుతున్న చప్పుడు, కొంత సాధుత్వం
కొంత పశుత్వం. కొంతదాహం, కొంత దుస్తరం.

నిన్ను నువ్వెంత సముదాయించుకున్నా తీరని
కోరిక ఒకటి పాదరసం చుక్కలాగా రక్తనాళాల్లో
సరసర సాగుతున్న సవ్వడి. ఎన్ని తీర్మానాలు
చేసుకున్నా, ఒక్కవాన చాలు చెరిపెయ్యడానికి.

ఏ కొండదారుల్లోనో వానపడుతున్నరాత్రి ఒకడివీ
కారులో ప్రయాణిస్తున్నట్టు నీ దేహంలో నువ్వు
ఇరుక్కుపోయావు,ఆగలేవు, ముందుకి పోలేవు
అలాగని తలుపుతెరుచుకుని బయటకి రాలేవు.
----------------16.8.2013

మంచివాన - Sriramoju Haragopal


వాన వాన వానవాన వానావానా
వాన వాన వానవాన వానావానా
నన్ను నిన్ను మనల కలిపి
బతికించే వాన
అందరి కడుపులకు మెతుకు
కనిపెంచిన వాన

గుప్పుమన్న మట్టిగుండె పరిమళాలవాన
కప్పుకున్న నేలపచ్చ పచ్చడాలవాన
మావూరికి తరలివచ్చు పెళ్ళిగుంపువాన
మీవూరి మొగులు మీద నీటిగొడుగు వాన

నింగి నేల కలిపి పాడు నీటివీణ వాన
పొంగిపొరలు నదుల ఎదల సంగీతం వాన
వరిపొలాల పంటగొలుసు మురిపించే వాన
తరతరాల మానవసంస్కృతికి జాడ వాన

మూగబాసలెన్నో మాటలైన వాన
మనసుగాలి మళ్ళగానె తొణుకులాడు వాన
కలలవసంతాలు నేల దిగివచ్చిన వాన
కలకాలం మనుషుల్లో మంచితనం వాన
(అముద్రితం-2004)
15-08-2013

Tuesday, August 13, 2013

వానాకాలం హైకూలు - పసునూరు శ్రీధర్ బాబు


rain flowers

1
రాత్రంతా ఒకటే వాన
గదిలో నిద్దరోతున్న పిల్లలు
నేనొక్కడ్నే మెలకువగా
2
పాటలు పాడి అలసిపోయిన పాప
పెదాలు మూసి నిద్దరోతోంది
చీకట్లో కురుస్తూనేవుంది వాన
3
3
మెరుపులకు మురిసిపోయాడు
ఉరుములకు భయపడ్డాడు
వానలో తడిసిపోయాడు మా పిల్లాడు
4
వాన మొదలైంది
పెద్దవాళ్ళు లోపలికి వెళ్ళారు
చిన్న పిల్లలు బయటకు వచ్చారు
5
వాన వెలిసింది
రావిఆకు కొసన
జారిపోవడానికి సిద్ధంగా ఒక చినుకు
6
పచ్చని చెట్లు
తడిసిన పువ్వులు
ఆగని వానలు
7
ఆగిపోయిన వర్షం
ఆకులు రాలిన చెట్టును
దట్టంగా అల్లుకున్న చినుకులు
8
పొద్దుట కురిసిన వాన కోసం
ఆకాశంలో కొలువుదీరాయి
కొత్త మబ్బులు
9
రాత్రి కురిసిన వానకు
పగటి వాన తోక ముడుచుకుని
వంకల్లోకి జారుకుంది
10
ఆకాశానికీ అరిచేతులకీ మధ్య
వాన తప్ప
మరెవ్వరూ లేరు
11
తడిసిన పువ్వులూ కొమ్మలూ
తలలు వంచి మురిసిపోతున్నాయి
వానాకాలం అందం
12
ఎండలో వాన
వానలో చలి
వానాకాలమే అంత-
13
ఇంధ్రధనుస్సును చూపించి
మళ్లీ తీసేసుకుంది
ఆకాశం
14
పిల్లలు
పడుచు పిల్లలు
వానజల్లులు
***
from పసునూరు శ్రీధర్ బాబు blog 
http://anekavachanam.wordpress.com

Thursday, August 8, 2013

జ్ఞాపకాల జడివాన జోరు తగ్గేదెలా.....!! - శోభరాజు



నా మది గదిలోనూ
ఇంటిగది బయటా
భోరున, జోరున ఒకటే వాన
జ్ఞాపకాల వాన
చినుకులుగా మొదలై.. జడివానై
అంతకంతకూ పెరిగిపోతూ
మదిగదిని ఉక్కిరిబిక్కిరిచేస్తూ
వరదలా ముంచెత్తుతోంది

పసితనపు వాన...
ఇంటి బయట చూరుకింద
ధారలు కట్టిన కాలువల్లో
అమాయకత్వపు పడవలు
హైలెస్సా అంటూ సాగుతుంటే
అల్లరి ఆనందాల కేరింతల వాన...

చినుకు చినుకు చిత్రంగా
అరచేతిలో నాట్యం చేస్తూ
అంతలోనే వేళ్ల సందుల్లోంచి
సుతారంగా జారుతుంటే
సందడిచేసే సంగీతపు వాన...

చూపులు, చేతులు కలిసి
ఒకటి రెండో భుజానికి ఆసరాగా
ఇరు మనసుల కలబోతలో
అంతేలేని మాటల జల్లులై కురిసేవేళ
ముసిముసి నవ్వుల ప్రేమవాన...

ప్రేమబంధం మాంగల్య బంధమై
మరుజన్మ ఎత్తితే
ఏకాంతపు లోగిలిలో
అనురాగపు ఆనందాల వెల్లువలో
సిగ్గుల మొగ్గ సింధూరపు వాన...

ముద్దు ముద్దు మాటలు
మురిపాల మూటలై
అమ్మానాన్నలని చేసిన
బుడి బుడి అడుగుల చప్పుడు
చిటపట చినుకుల నాట్యమైనప్పుడు
గుండెనిండా వాత్సల్యపు వాన...

రెక్కలొచ్చి ఎగురనేర్చి
గూడును, కన్నవారినొదిలి
కాలమనే కారుమబ్బులై
తుఫానులా తీరం చేర్చితే
జీవితపు మలిసంధ్య వాన...

మది గదిలో వాన...
చినుకులుగా మొదలై...
జడివానై, తుఫానై అలా తీరం చేర్చింది
వాన వెలసిన ఆకాశం స్వచ్ఛంగా
ఇంధ్రధనుస్సు వెలుగుల్ని విరజిమ్ముతోంది...

వానొచ్చింది..!! - శోభరాజు



చెంప ఛెళ్లుమన్నప్పుడు
దెబ్బ.. దెబ్బతో వచ్చే నొప్పీ
రెండూ మర్చిపోయి
రెప్పపాటు క్షణంలో
అలా వచ్చి ఇలా వెళ్లిపోయే
కరెంట్ షాక్ లాంటి మెరుపులు
ఎంత ఆశ్చర్యంగా అనిపించేదో

వానొస్తే మెరుపుల్ని చూస్తే ఎంత భయమో
కానీ కళ్లలోంచి ఆ మెరుపులు వస్తుంటే
ఆశ్చర్యమే ఆశ్చర్యం
అంతపెద్ద ఆకాశానికీ మెరుపులు
ఇంత చిన్న కళ్లకీ మెరుపులే.....!
ఎక్కిళ్ల శబ్దం ఆశ్చర్యాన్ని బ్రేక్ చేసేదాక
షాక్ నుంచి తేరుకోలేని కళ్లు...

ఆకాశానికి చిల్లుపడి వానొస్తే...
మా గొడుగుకీ చిల్లుపడి
వానొచ్చింది
నా కళ్లకి....
టపా టపా హోరులో కలిసిపోతూ...
సాగరంలో మునిగితేలుతూ
గట్టు తెగేందుకు ఓ కన్ను
వద్దు వద్దంటూ మరో కన్ను...!!

వాన - వాడ్రేవు చినవీరభద్రుడు


ఒక్కసారిగా తెలిసొచ్చింది నీకు, రాత్రంతా
వాన ఫోన్ చేస్తూనేవుందని, నువ్వు సైలెంట్
మోడ్ లో ఉండిపోయావని. నిస్సహాయంగా
తడుస్తున్నవి గోడలు,మేడలు,వీథులు,వైర్లు.

అడివిలో మిగలముగ్గిన తాటిపండ్ల లాగా ఆమె
వక్షోజాలు నిన్నుక్కిరిబిక్కిరిచేస్తున్నాయి. ఈ
నగరంలానే నీ హృదయం కూడా ఒక పొలం
కాలేకపోయిందని నీకిప్పుడిప్పుడే తెలుస్తున్నది.

మింటినీ మంటినీ చుట్టబెట్టినట్టు నీక్కూడా
మేఘంలాంటి ఒక వస్త్రంకావాలి, బహుశా
వస్త్రం వదిలిపెట్టి నువ్వొక మేఘం కావాలి,
నీకూ వర్షానికీ మధ్య గోడ బద్దలు కావాలి.

-------------------------------------8.8.2013