Monday, February 10, 2014

వర్షం గంపలో - రేణుక అయోలా



ఎండిన నేల రాలుతున్న ఆకులు
కొలిమిమంటల గాడ్పులు
నీటి బొట్టుకోసం తల్లడిల్లే పశుపక్ష్యాదులు
చమట ధారలలో జనం

నీలం చీరలో వర్షం గంపతో వస్తుందని
ఎన్ని ప్రార్ధనలు.
ఆమె కూడా గంపని నింపుకుని వద్దామనే అనుకుంటుంది
వర్షం గంప నింపడానికి సంఘర్షణలు.

గుమ్మంలో వున్న మబ్బులు ఏరుకుని
చినుకు జతారులని నింపుకొని
నేలకి దిగుతుండగానే

బలమైన గాలి అటూగా లాక్కేళ్ళి పోయింది
గంపలో వున్న మబ్బులు పారిజాతాల్లా
కొండ అంచుల్లో రాలిపడ్దాయి
అడవి కడుపులో ఒరిగిపోయాయి

ఖాళి గంపలో దిగులుపూలు

మళ్ళీ నల్లరేడు రంగు మబ్బులు ఏరుకుని
కొన్ని మెరుపుల దండలు బుట్టలో వేసుకుని
వురుములు నింపి గంపని జాగ్రత్తగ నెత్తినపెట్టుకుని
గంపని బోర్లించింది నేల ఒడిలో
వర్షం! వర్షం! వర్షం!

నేలని చుట్టుకున్న వర్షం
పచ్చటి తీవాచీలు పరిచిన వర్షం
పూలని పూయించిన వర్షం
నది తనువులో పొంగిన వర్షం
సీతాకోకచిలుకలైన గొడుగుల మీద వర్షం
పిల్ల కాలువలో కాగితం పడవలతో ఆడుకున్న వర్షం

ఆమె ఖాళి అయిన గంపతో వెళ్ళి పోయింది
శీతగాలులు ఏరుకోవడానికి.


(ఎ ప్పుడో రాసుకున్నది ఇప్పుడు ఇలా )

Friday, November 29, 2013

రేణుక అయోల //అడవిలోతడి వెన్నెల



ఓ వర్షపు మేఘం అడవిలో తప్పిపోయింది
నీటి చినుకులు నదిని కనుకున్నాయి
ప్రవహించే నది వృక్షాలని కౌగలించుకొని
చీర చెంగులా చుట్టుకుని
ఆకుల కిరీటాల్ని మోసుకుంటూ వెళ్తుంటే

నదిపైన వంతెన చెట్టుకి గట్టుకిదారివేస్తూ
నదిని రెండుభాగాలు చేసింది
ఒకటైన నది రెండు వైపులా కనిపిస్తోంది
వర్షం ఆకాశంలో ఆగిపోయింది

పొగమంచు దుప్పటిలో దూరిన అడవి
ఆ చీకటిని నేనే అనుకుంది
చీకటి అడవిని కనుగొన్నాను అంది
చంద్రుడు దారి తప్పి అడవిలోకి రాగానే
ఇద్దరు సిగ్గుపడి
వెన్నెలని ఎవరు పంపారో కదా
చలిని, వేడిని, తీసుకువచ్చింది అనుకున్నాయి

నది మాత్రం
నేను అక్కడనుంచి తీసుకొచ్చి
ఇక్కడ పడేసాను అనుకుంది
వెన్నెల అమాయకంగా
నదిని, ఆకులని, చెట్లని పలకరించి
చీకటి దూరిన ఆడవికి
తెల్లని పరదాలు కట్టి
వర్షం వెలిసిన తడి దారుల వెంట ప్రయాణిస్తూనే వుంది..

Monday, November 25, 2013

నీది కాని వొక వాన! - అఫ్సర్





వొక తెల్లారు జాము వానలో తడుస్తూ
ఇల్లూ ఊరూ వదిలి
పరిగెత్తుతూ వెళ్తాను, ప్రపంచం వేపు.

*

పరిగెట్టించే ఈ ప్రపంచంలో
అసలేమైనా వుందో లేదో!
వున్నా అది నాదో కాదో
వెతుక్కునే వ్యవధి కూడా
దొరకనివ్వని ఉక్కిరిబిక్కిరిలో

వెళ్ళిపోతాను.

*
నా కోసం కురవని ఆ వానలోకి
తీక్షణంగా చూసే శక్తి కూడా నాకు వుండదు.

ఆ మాటకొస్తే, ఎన్ని చినుకులు కలిస్తే
వొక వాన అవుతుందో కూడా తెలీదు ఈ పరాయీ క్షణంలో.

ఈ వానా ఈ జీవితం
నన్ను ఎంతలా తడుపుతున్నాయో కూడా చూసుకోను.
వానకి కురవడం వొక్కటే తెలిసినట్టు
నాకు పరిగెత్తడం మాత్రమే తెలిసినట్టు!

*

మళ్ళీ మళ్ళీ
వొక తెల్లారు జాము వానలో తడుస్తూ
ఇల్లూ ఊరూ వదిలి
పరిగెత్తుతూనే వుంటాను, ప్రపంచం వేపు.

*

నన్ను ఉక్కిరిబిక్కిరి చేసే వూపిరిలాంటి ప్రపంచంలోకి!


(బాల్టిమోర్...లో అసలే నచ్చని వానలో తడుస్తూ...!)

Monday, October 28, 2013

వర్షం - ఆర్కే


1#
పోటిపడి మరీ ముసురేసిన వర్షం,మూగేసిన
నీ కన్నీళ్ళ సునామీకి ఓ చక్కటి ముసుగు.
నరుల కంటబడకుండా, కుంభ వర్షానికి సిద్దమైన
నీ కన్నీళ్ళ పైలాన్ ను -ఎవరో చూసారు? ఎవరు "అతను"?

2#
నీ ప్రతి కన్నీటిబొట్టును -తన గ్రంధంలో భద్రపరచి
ఇంపైన సువాసనగ -తన రూపంలోకి మారుస్తూ,
మంచి గోధుమ గింజలా నలిగి, మెత్తని పిండై
నువ్ పిండంగా నిర్మించకమునుపే ముద్దాడిన,
"అతను" చోద్యం చూస్తూ ఉండగలడా?

వర్షానికే తెరిపిచ్చిన ఆ "అతను", నీ బుజ్జికళ్ళకివ్వలేడా?

కన్నీళ్లు విడుచుచు విత్తువారు,
సంతోషగానముతో పంట కోసెదరు.

సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప మరే ఏదియు మీకు సంభవింపలేదు.
సహింపగలుగుటకు "అతను", శోధనతోకూడా తప్పించుకొను మార్గమును కలుగ జేయును.

3#
మబ్బుల నుండి జారిన వర్షపు చినుకుకు గమ్యం ముత్యమైతే,
ఆ మబ్బుల పైనే ఆసీనుడైన "అతని" గుండెల్లోకే నీ నా పయనం.
ముత్యాలకోటల్లో, బంగారపు వీధుల్లో, చీకటేలేని లోకంలో
నీతో నేను, నాతో నీవు, మనతో "అతను" ....ప్రేమ వర్షంలో తడుస్తూ!!!

4#
నీలాల కన్నుల్లో కన్నీరు నీకేలా -
నా చిన్నీ ప్రాణమా, నాకున్న నేస్తమా
నినుగన్న తండ్రి ("అతను") నీకు తోడుగా వుండగా -
కలత ఏలనే? కన్నీరు ఏలనే??

||ఆర్కే|| వర్షం - 20131028

Sunday, October 27, 2013

ఓ వర్షపు రాత్రి ----Srinivas Vasudev


ఓ వర్షపు రాత్రి
---------------

భళ్ళున చీల్చుకున్న ఆకాశంలోంచి ఊడిపడ్డ ఆరెండు 
చినుకులూ చెవిపక్కనుండే పోతున్నాయి
ఓ కథని విప్పుతూ
అంత గొడవేంటని గొణిగాను మనసారా

నిష్కల్మషం గురించనుకుంటా ఆ రణగొణధ్వని
దానికంత చెప్పాలా అని అన్నప్పుడల్లా మళ్ళీ
అదే గొడవ..అదే కథ..మనసు కథనుకుంటా

 గుండెని తడిచెయ్యటానికా అన్నట్లు కురుస్తూ
కాళ్ళకింద చిన్నపిల్లల్లా తిరుగాడుతూ
వానచుక్కలు......
వాటికేం ఇవ్వగలను అన్న బాధా లేకపోలేదు
బోలెడంత శబ్దం చేస్తాయి నిశ్శబ్దంగా…గర్వంగా

ప్రేమంటే వానకి తెల్సినట్టుగా మరిదేనికీ తెలీదనుకుంటా
అదే చెప్పాలంటే మాటపెగలట్లేదు..వాన భాష రాదుగా మరి
గుండె ఎండిపోయినట్లుంది…..ఈ జడివానలో కూడా
నా చిరునామా నేనే వెతుక్కునే పనిపెట్టాయని బాధ తప్ప
ఫిర్యాదేముందని?

ఓ నిష్కామం గురించిన అస్పష్టతే ఎప్పుడూ
వర్షపు గోళాల్లాగనే....బరువుని మోస్తూ తిరుగుతుంటాయిగా
ఏమీ ఆశించకుండానే.....
మరి నా బరువేదో తెలిసేదెప్పుడో
వర్షంతో నేనూ..నాతో నా వర్షమూనూ
ఓ సియామీస్ ట్విన్స్ ....తలదగ్గరో మొలదగ్గరో 
కలిసిఉన్నామన్న ఆ క్షణమే
ఓ అద్వైతానందమేమొ...చూడాలి
మనసు నిండాకైనా ఓ మాటొస్తుందేమొ!!


భళ్ళున చీల్చుకున్న ఆకాశంలోంచి ఊడిపడ్డ ఆరెండు
చినుకులూ చెవిపక్కనుండే పోతున్నాయి
ఓ కథని విప్పుతూ
అంత గొడవేంటని గొణిగాను మనసారా

నిష్కల్మషం గురించనుకుంటా ఆ రణగొణధ్వని
దానికంత చెప్పాలా అని అన్నప్పుడల్లా మళ్ళీ
అదే గొడవ..అదే కథ..మనసు కథనుకుంటా

గుండెని తడిచెయ్యటానికా అన్నట్లు కురుస్తూ
కాళ్ళకింద చిన్నపిల్లల్లా తిరుగాడుతూ
వానచుక్కలు......
వాటికేం ఇవ్వగలను అన్న బాధా లేకపోలేదు
బోలెడంత శబ్దం చేస్తాయి నిశ్శబ్దంగా…గర్వంగా

ప్రేమంటే వానకి తెల్సినట్టుగా మరిదేనికీ తెలీదనుకుంటా
అదే చెప్పాలంటే మాటపెగలట్లేదు..వాన భాష రాదుగా మరి
గుండె ఎండిపోయినట్లుంది…..ఈ జడివానలో కూడా
నా చిరునామా నేనే వెతుక్కునే పనిపెట్టాయని బాధ తప్ప
ఫిర్యాదేముందని?

ఓ నిష్కామం గురించిన అస్పష్టతే ఎప్పుడూ
వర్షపు గోళాల్లాగనే....బరువుని మోస్తూ తిరుగుతుంటాయిగా
ఏమీ ఆశించకుండానే.....
మరి నా బరువేదో తెలిసేదెప్పుడో
వర్షంతో నేనూ..నాతో నా వర్షమూనూ
ఓ సియామీస్ ట్విన్స్ ....తలదగ్గరో మొలదగ్గరో
కలిసిఉన్నామన్న ఆ క్షణమే
ఓ అద్వైతానందమేమొ...చూడాలి
మనసు నిండాకైనా ఓ మాటొస్తుందేమొ!!
...............................................27.10.2013

Wednesday, October 23, 2013

ఒక వాన-కొన్ని ఊహలు -Raghavareddy Ramireddy



..
ముసురు పడుతుంది. మబ్బులు నేలతో అలా తడితడిగా ఊసులాడుతూనే ఉంటాయ్ .ఇంటిముందున్న పసుప్పచ్చని పూలచెట్టు అదేపనిగా స్నానం చేసీ చేసీ అందంగా అలసిపోతుంది.
ఒక చల్లటి గాలి అలా బరువుగా వచ్చి పలకరిస్తుందా.. నాలో కదుల్తోన్న నీ ఙ్నాపకాల నులివెచ్చదనం సోకి ఇలా తేలికవుతుంది. నిన్ను చూడాలన్పిస్తుంది నాకు.
బయల్దేరుతాను నీ సమ్మతి కోరకుండానే. "ఇంత వానలో ఇలా తడుస్తూ ఈ రావడమేంటి బాబూ"అంటావు. పై పై మాటలే గదా అవి. నిజం మాటలు నీ కళ్ళలోంచి వినిపిస్తాయ్.
పక్కన కూర్చుని నీ అరచేతిని అపురూపంగా అందుకుంటానా. .కాస్త పైకెత్తుతానా. .కొంచెం కిందకు వొంగి తడితడి గా ఆ చేతికి ప్రణమిల్లుతానా.. అప్పుడా చేతి నుంచీ వినిపిస్తాయా మాటలు "భలే వచ్చావ్.. ఎంత బావుందో నీ రాక!"
...

కాస్త ఇటు తిరిగి "చెప్పు ఏం చేద్దాం" అంటావు. ఊరికే నవ్వుతాను. కళ్ళనుండీ, పెదవుల నుండీ, సమస్త శరీరం నుండీ పరిమళించిన నీ నవ్వు ఒక పరమాద్భుత విన్యాసమేదో చేస్తుంది. చిన్నప్పుడు చేసుకున్న తామరకాడల దండను తెచ్చి నా మెళ్ళో వేస్తుంది.
...
అనంతస్వచ్చమైన ప్రేమ మన లోతుల్లోంచి అలా అలా మాటలై తేలివస్తుంది.ఎటు చూసినా ప్రవహిస్తోన్న నీళ్ళమీదుగా మన బుల్లి పడవేసుకుని మనం బయలుదేరుతాం.
"
ఇదిగో ఈ కొంగ చూడు.ఇది భలే పరిచయం నాకు.ఇదిగో ఈ చోటు చూడు.ఈ చెట్లు. .ఈ పొలాలు..-నీ లోకమంతా నాకు పరిచయం చేస్తావు..గొప్ప మురిపెం తో.. మనసు కళ్ళను విప్పార్చుకుని అన్ని లోకాలనూ నీలోనే నేను చూస్తుంటాను..
...

ఒక మాట..ఒక స్పర్శ..వేలాది పువ్వులు..-ముసురలా కొనసాగుతూనే ఉంటుంది.

జీవనది - Mercy Margaret




వర్షం పడుతుంది
ఆయనా.. నాతో మాట్లాడుతున్నాడు.
ఎడతెరిపి లేని వానలా కురుస్తున్న ఆయన మాటల్తో
ఎండిన నేలలా నోరు తెరిచిన హృదయం
దాహం తీర్చుకుంటుంది.

ఆయన మాట్లాడుతున్నాడు వానా పడుతూనే ఉంది
హృదయారణ్యంలోని ప్రతి మూలల్లో మాటలు వర్షిస్తున్నాయి
ప్రతి నేలని చదును చేస్తున్నాయి
ఎండిన ప్రతి మోడు చిగురిస్తు౦ది
రాలిన ఆకుల చోట కొత్త జీవం చిగురిస్తుంది
ప్రతి అణువు చెట్టులా మారి పాటలు పాడుతుంది

వర్షం పడుతుంది, ఆయన ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు
విరిగిన ఎముకలన్నీ ఆ మాటలు వింటున్నాయి

ఆయన మాట్లాడాడు లేచి బయటికి రమ్మన్నాడు
శవం ఇప్పుడు శవం కాదు. మళ్ళీ జీవం ఉన్న మనిషి
కరిగిపోయిన ప్రతి కన్ను చూసేలా ఆయన మాట్లాడాడు
చనిపోయిన ప్రతీది నిత్యత్వం పొందుతుంది
ఆయన మాట్లాడుతున్నాడు
వర్షంలా
చినుకుల్లా కురిసే మాటలు నదులయ్యాయి
ఆ నది
జీవనది
ప్రవహిస్తూ నన్ను ముంచింది

అదో ... చూడు ఇప్పుడు
నీవైపే..
నీవైపే వస్తుంది.
____________ (23/10/2013)_