Thursday, August 8, 2013

వానొచ్చింది..!! - శోభరాజు



చెంప ఛెళ్లుమన్నప్పుడు
దెబ్బ.. దెబ్బతో వచ్చే నొప్పీ
రెండూ మర్చిపోయి
రెప్పపాటు క్షణంలో
అలా వచ్చి ఇలా వెళ్లిపోయే
కరెంట్ షాక్ లాంటి మెరుపులు
ఎంత ఆశ్చర్యంగా అనిపించేదో

వానొస్తే మెరుపుల్ని చూస్తే ఎంత భయమో
కానీ కళ్లలోంచి ఆ మెరుపులు వస్తుంటే
ఆశ్చర్యమే ఆశ్చర్యం
అంతపెద్ద ఆకాశానికీ మెరుపులు
ఇంత చిన్న కళ్లకీ మెరుపులే.....!
ఎక్కిళ్ల శబ్దం ఆశ్చర్యాన్ని బ్రేక్ చేసేదాక
షాక్ నుంచి తేరుకోలేని కళ్లు...

ఆకాశానికి చిల్లుపడి వానొస్తే...
మా గొడుగుకీ చిల్లుపడి
వానొచ్చింది
నా కళ్లకి....
టపా టపా హోరులో కలిసిపోతూ...
సాగరంలో మునిగితేలుతూ
గట్టు తెగేందుకు ఓ కన్ను
వద్దు వద్దంటూ మరో కన్ను...!!

వాన - వాడ్రేవు చినవీరభద్రుడు


ఒక్కసారిగా తెలిసొచ్చింది నీకు, రాత్రంతా
వాన ఫోన్ చేస్తూనేవుందని, నువ్వు సైలెంట్
మోడ్ లో ఉండిపోయావని. నిస్సహాయంగా
తడుస్తున్నవి గోడలు,మేడలు,వీథులు,వైర్లు.

అడివిలో మిగలముగ్గిన తాటిపండ్ల లాగా ఆమె
వక్షోజాలు నిన్నుక్కిరిబిక్కిరిచేస్తున్నాయి. ఈ
నగరంలానే నీ హృదయం కూడా ఒక పొలం
కాలేకపోయిందని నీకిప్పుడిప్పుడే తెలుస్తున్నది.

మింటినీ మంటినీ చుట్టబెట్టినట్టు నీక్కూడా
మేఘంలాంటి ఒక వస్త్రంకావాలి, బహుశా
వస్త్రం వదిలిపెట్టి నువ్వొక మేఘం కావాలి,
నీకూ వర్షానికీ మధ్య గోడ బద్దలు కావాలి.

-------------------------------------8.8.2013

Monday, August 5, 2013

చినుకు - శ్రీకాంత్ కాంటేకర్




చినుకుతో ఎలా మమేకం కాను
ప్యాంటుజేబులో చేతులను జారవిడిచి
భుజాలను చెవుల వరకు రెక్కించి
అలా మౌనంగా నడక..
సౌమ్యంగా తాకుతూ.. జీవకణాలను తట్టిలేపుతూ ..చినుకులు

పచ్చని ప్రకృతి ఒడిలో
అదొక జీవభాష
ఏ లిపిలోకి తర్జుమా కాని భావధార
చినుకులతో ఒక సంభాషణ ..
కాదు.. చినుకుల్లో తడిసిపోయి కరిగిపోయే
ఒక సమాలోచన

గగనం నుంచి జలజలా రాలుతూ
ఆకుల లాలిత్యాన్ని ప్రేమగా నిమిరుతూ
మట్టిపొత్తిల్లలోకి చినుకు

నింగి నుంచి రాలిపడినా
తొణకని గర్వం
లిప్తపాటు అస్తిత్వమే అయినా
తన ఉనికిని బలంగా చాటే నైజం
జలసమూహంలో ఐక్యమై
తరంగాలుగా విస్తరించే ఒంటరి సైనికుడు చినుకు

ఎలా అనుసంధానం చేసుకోను
ఆ చిన్ని చినుకులో ఎలా లీనం కాను
అయినా జనసమూహంలో నువ్వు-నేను చినుకులమే కదా?
అలలుగా అల్లుకుంటూ.. ఆవిరిగా ఆకాశం ఒడికి చేరుతూ..
చినుకులుగా.. జల్లులుగా.. వర్షిస్తూ ఉంటాం
అప్పుడు ఆ చినుకు నీలా ఉంటుంది
నన్నూ తన మెరుపులో నింపుకుంటుంది
ఇద్దరిని తనలో ఐక్యం చేసుకొని
ఏ సముద్రంలోనో మునిగితేలుతుంది



తేదీ 5-8-13 

Thursday, August 1, 2013

చినుకు పాట - వర్చస్వి


పట్టుకున్న ఈ చినుకు పాట ఇప్పట్లో వదిలేలా లేదు
మసక మసక ముసురులా!

సంద్రంలో బడబాగ్ని ముడుచుకుని
పడుకుంటుందంటే నే నమ్మలేదు ఇప్పటివరకూ-

ఈ ముసురు చినుకు ఇంతలేసి అగ్గి శిఖలై
నన్ను మసి చేస్తుంటే అర్ధమౌతోంది ఇప్పుడు

నిప్పుకీ నీటికీ 
మనువెంతో మనోహరమని!

ఎంత వింతో కదా-

సంద్రంలా నీ ప్రేమ కప్పేసినప్పుడు
ముడుచుకు పడుకున్నా!

ఇప్పుడు ఆగిపోయిన నీ పాట చినుకుతో 
ఏ సుందర సంద్రాలకావలో
నన్ను చేయి పట్టుకు తీసుకెళ్తుంటే
బడబాగ్నిలా రగులుతున్నా!

---------------------------------------//02.08.2013//

వర్షించే ఆకాశం


అరుణ నారద భట్ల


ఆకాశం ఏడుస్తుంది
తాపం బాధించిన చోటల్లా భూమికై పరితపిస్తూ
మబ్బుదొంతరలను పత్తిలావిచ్చుతూ
ధరిత్రిని ఓదార్చే దిశలో
తానూఒకింత సాయంచేస్తుంది
ఇలానీరుకారుస్తూ

కాలుష్యపుపొరలను కాలరాస్తూ
భూమిపై ప్రేమను వర్షంలా వ్యక్తపరుస్తుంది
తనచుట్టూ ఆవహించిన గాఢమైన వాయువుల కన్నుగప్పి
పీల్చేస్తున్న ఊపిరిని తిరిగి తెస్తూ
నీటి ధారలై కన్నీటిధారలై..

నింబస్ మేఘాలను బద్దలుచేస్తూ
పరుగులెడుతూ వచ్చి పలకరిస్తుంది
అడ్దుగోడలా ఉన్న దూదిమబ్బులను
ఉరుము మెరుపులతో కోపగించి
పుడమిని అల్లుకుని నేనున్నానంటూ
చిట్టిచిట్టి చినుకుల మమతల వర్షం కురిపిస్తుంది
నింగితల్లీ నేలబిడ్డనుపలకరిస్తూ
అమృత వర్షం కురిపిస్తుంది

-----------------------------------31.07.2013

Wednesday, July 31, 2013

చినుకుభాష - యాకూబ్



ఇంకొంత సమయం పడుతుందేమో
ఈ ముసురు ఆగిపోవడానికి

మరీ చిని చిన్ని చినుకులు

వాటికో వ్యాకరణ సూత్రమేదో ఉన్నట్టు
వొకటివెంట ఒకటి కుదురుగా

నిన్నటి సాయంత్రం నుండి ఇవాల్టి ఉదయం లోపల
ఎన్ని పరిణామాలు జరిగిపోలేదూ
అవేమీ పట్టనట్లు ప్రవర్తిస్తుందీ ముసురు

ఎవర్నీ వో మాటా అనదు
అసలు నోరే విప్పదు
దానిది చినుకుభాష

వొక గొడుగునో, పైకప్పునో , లేకపోతే వొక రెయిన్ కోటునో
మనమీద కప్పుకుంటాం అడ్డంగా

ఈ ముసురు చేసే సంభాషణలో
ఒక్క ముక్కా అర్థం కాదు.

---------------------------------------------31.7.2013 

Monday, July 22, 2013

వానకలిసిన సముద్రం. - రేణుక అయోల



వెలియనివాన ఎండని కమ్మేసి చలిచలిగా నగరంలోకి
అడుగుపెట్టడం బాగుంది
జల్లులుగా నేలని అల్లుకుని
ఆగని, వాన చినుకులంటే అంటే ఇంకా ఇస్టం.

ముసురు మబ్బులు కాఫీ కప్పుని చేతులోవుంచేసి ఆలోచనలకి ఆవిరినందిస్తాయి
చినుకులు నదుల వరదలు తలవంచుకుని "కాదల్"కడలిలో కలిసిపోతే
తూఫాన్ ఇసుకగుడులని మింగేస్తుంది
గవ్వలేరుకునే మనుషుల బాల్యం
జాడలేని "ఇష్క"కి కహానిలా అయిపోతుంది

”సాగర్కి లహెరే” సవరించలేని ఉంగరాల ముంగురులు అణిగిపోయాయి
నీళ్ళని చిమ్మేసి రహదారులని ఉప్పుటేరులని చేస్తుందని భయం
కనీళ్ళతో పోటిపడే కాటు ఉప్పుని రుచి చూపిస్తుందని వెఱపు

సముద్రతీరంలో ఇసుకమేటలలో కూరుకుపోతూ ”ఆజా తు పాస్..పాస్ గుజారిశ్..పాటపాడితే
”గుంజుకున్నా నిన్నే యదలోకి"బదులిచ్చే అంత్యాక్షారీలు
ఇసుక మడులలో లంగరేసుకున్న పడవలు
 ఫోటోలకి ఫొజులిచ్చే ఇళ్లని
నిమిషంలో మింగేసి తీరాన్ని ముక్కలుచేసి వెనక్కి వెళ్ళిపోదుకదా..

ఈవాన వెలియకపోతే
సంద్రంలో చంద్రుడు మునిగిపోయి
వెన్నెల చిన్నచిన్న వెండిరేకుల్లా అలల మీద తేలవుకదా
నేలని అల్లుకునే వాన చినుకులు ఇస్టం
వానవెలిసేదాక ఆలోచనలన్నీ అక్కడే జాలరి వలలో చేపలు.

.................................................................23-7-2013